తగ్గిన ఆహార ధాన్యాల ఉత్పత్తి..
వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఈ ఏడాది 9.8 శాతం వృద్ధి నమోదైనప్పటికీ ఆహార ధాన్యాల ఉత్పత్తి, పంటల సాగులో మాత్రం గత ఏడాది కన్నా రాష్ట్రం వెనకబడింది. 2017–18 సంవత్సరానికి గానూ రెండో ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 31.87 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. అయితే, గత ఏడాది 34.39 లక్షల హెక్టార్లలో సాగు కావడం గమనార్హం. అంటే గత ఏడాదితో పోలిస్తే పంటల సాగు 7.33 శాతం తగ్గిందన్నమాట. ఇక, ఆహార ధాన్యాల దిగుబడి విషయంలోనూ తగ్గుదల కనిపిస్తోంది. గత సంవత్సరం మొత్తం 101.29 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయితే, ఈ ఏడాది 95.01 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరుగుతుందని సామాజిక ఆర్థిక సర్వే అంచనా వేసింది.
పంటల సాగులో నల్లగొండ ఫస్ట్
సాగుకు యోగ్యమైన భూముల్లో పంటల సాగు విషయంలో నల్లగొండ జిల్లా ముందుందని సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. ఈ జిల్లాలో ఉన్న 4.2 లక్షల హెక్టార్ల సాగు యోగ్య భూమిలో 3.6 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతున్నాయి. పంటల సాగులో వరంగల్ అర్బన్ 0.6 లక్షల హెక్టార్లతో చివరి స్థానంలో ఉంది. అయితే, సాగుకు యోగ్యమైన భూముల్లో పంటలు సాగయ్యే విస్తీర్ణ రాష్ట్ర సగటు 1.2 లక్షల హెకార్లు కాగా, రాష్ట్రంలోని 15 జిల్లాలు ఈ సగటు కన్నా వెనుకబడి ఉన్నాయి.
పాలు, గుడ్లు ఓకే
ఇక, మాంసకృత్తులుండే ఆహార ఉత్పత్తుల విషయంలోనూ రాష్ట్ర పరిస్థితి బాగానే ఉంది. 2016–17 సంవత్సరంలో మొత్తం 4,681 టన్నుల పాల ఉత్పత్తి అయితే 2017–18లో అక్టోబర్ నాటికే 2,894 టన్నుల పాల ఉత్పత్తి జరిగిందని సామాజిక ఆర్థిక సర్వే చెబుతోంది. గుడ్ల విషయానికి వస్తే గత ఆర్థిక సంవత్సరంలో 1,181.86 కోట్ల గుడ్లు ఉత్పత్తి కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 2017 అక్టోబర్ నాటికి 718.31 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యాయి. 2016–17లో 591 టన్నుల మాంసం ఉత్పత్తి అయితే, 2017 అక్టోబర్ నాటికి 379 టన్నులు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment