ఆన్లైన్లో బాధ చెప్పెయ్..!
రాజేశ్ బాగానే పని చేస్తాడు. బాస్ చెప్పిన పని చేసుకు పోతుంటాడు. ఎంత బాగా చేసినా నిత్యం ధుమధుమలాడే బాస్ అంటే రాజేశ్‌కు భయంతో పాటు కోపం కూడా ఉంది. ఈ సంగతి ఎవరితో చెప్పుకున్నా బాస్‌కు తెలిసే ప్రమాదం ఉంది. దాంతో మౌనంగా ఉండిపోతున్నాడు.
గవర్నమెంట్ ఆఫీసులో పదేళ్లకుపైగా క్లర్కుగా పనిచేస్తున్న అనన్యకు ప్రమోషన్ రావటమే లేదు. అందుకు కారణం ఆఫీసు రాజకీయాలు. వీటిపై ఎంత కోపం వచ్చినా ఆమె నిస్సహాయంగా ఉండిపోతోంది.
రాజేశ్, అనన్య అనే కాదు. చాలామందికి ఇలాంటి సమస్యలు ఉంటూనే ఉంటాయి. కాకపోతే ఎవరితోనైనా చెప్పుకుంటే విషయం బయటకు పొక్కుతుందేమోనన్న భయం. అలాగని ఎంతోకాలం మనసులోనే దాచుకుని ఉండలేరు. మరేం చేయాలి? తమ వివరాలు బయటపెట్టకుండా తమ మనోవేదనను ఎవరితోనైనా పంచుకునే అవకాశం వస్తే...? సరిగ్గా ఈ అవసరాన్ని తీర్చడానికే కొన్ని వెబ్సైట్లు అందుబాటులోకి వచ్చాయి. ఆన్లైన్ కౌన్సెలింగ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పటికే వేలాది మంది భారతీయులు ఈ సైట్లను ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కౌన్సెలింగ్ పొందారు.
‘ముక్కూ మొహం తెలియని స్నేహితుడితో నా మనో సంఘర్షణను చెప్పుకున్నాక నా మనసులోంచి ప్రతికూల ఆలోచనలు తొలగిపోతున్నాయి...’ అనేది కౌన్సెలింగ్ అనంతరం ఓ వైద్య విద్యార్థిని మాట.
సాధారణంగా భారతీయులు తమ మనోవేదనను ప్రొఫెషనల్ కౌన్సెలర్లతో చెప్పుకోవడానికి బిడియపడుతుంటారు. ఇప్పుడు ఇలాంటి సేవలు ఆన్లైన్లో లభిస్తుండడంతో పరిస్థితిలో మార్పు వస్తోంది. తమ వివరాలు చెప్పకుండానే ఆన్లైన్ ద్వారా సైకాలజిస్టులు, కౌన్సెలర్ల సూచనలు, సలహాలతో ఊరట పొందుతున్నారని ముంబైకి చెందిన సైకాలజిస్టు కరణ్ ఖటావు చెప్పారు.
ఇంటర్నెట్ను వినియోగించే కార్పొరేట్ ఉద్యోగులు, విద్యార్థులు పలువురు ఆన్లైన్లో స్వాంత్వన పొందుతున్నట్లు తెలియజేశారు. ఈ తరహా సేవలందిస్తున్న షేరింగ్దర్ద్.కామ్‌కు ఇప్పటికే 43 వేల మందికిపైగా రిజిస్టర్డ్ యూజర్లుండడం గమనార్హం. చాలా సులువుగా తమ సమస్యలను చెప్పుకునే అవకాశం ఉండడం ఆన్లైన్ కౌన్సెలింగ్‌కు ఆదరణ పెంచుతోంది. నెట్ అందుబాటులో ఉంటే చాలు, ఇలాంటి సేవలు 24 గంటలూ లభిస్తాయని ఎథోస్హెల్త్కేర్.కామ్ కౌన్సెలర్ డాక్టర్ ఎస్కే శర్మ చెప్పారు. వ్యక్తిగతంగా వచ్చి కౌన్సెలింగ్ పొందేవారి కంటే ఆన్లైన్, ఫోన్లో సంప్రదించే వారే ఎక్కువన్నారు.
లేడీస్‌తో మాట్లాడాలంటే భయం...
కౌన్సెలింగ్ సైట్లను 18-25 ఏళ్ల వయస్కులే ఎక్కువగా సందర్శిస్తున్నారు. ఇతరులతో సంబంధాలు విచ్ఛిన్నం కావడం, మహిళలతో మాట్లాడాలంటే బెరుకు వంటి అంశాలపై కౌన్సెలింగ్ పొందుతున్నారు. ఇక 25-40 ఏళ్ల ఏజ్ గ్రూప్ వారు ఆఫీసు రాజకీయాలు, పని ఒత్తిడి, చేస్తున్న ఉద్యోగంలో అసంతృప్తి వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయాల కారణంగా తాము పురుషులతో పోటీ పడలేకపోతున్నామని పలువురు మహిళలు వాపోతున్నారు. తమకు తగిన సూచనలిచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.