జగిత్యాల: కరడుగట్టిన సుపారీ హంతకులు, కానీ..
క్రైమ్, జగిత్యాల: ఆ ముగ్గురూ సుపారీ కిల్లర్లు.. హత్యలు చేయడంలో నిష్ణాతులు.. ఇప్పటివరకు మూడు మర్డర్లలో పాలుపంచుకున్నారు. కోరుట్లలో మంగళవారం బీఆర్ఎస్ నాయకుడు పోగుల లక్ష్మీరాజం హత్య మాత్రం తన స్నేహితుడు ప్రవీణ్‌సింగ్ మర్డర్‌కు ప్రతీకారంగానే చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం.
లక్ష్మీరాజం హత్యలో పాలుపంచుకున్న నాగరాజు, వంశీని సంఘటన అనంతరం అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అదేరోజు రాత్రి నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో త్రిమూర్తులు, పిల్లి సత్యనారాయణను పట్టుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ నలుగురిని పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నటున్ల తెలిసింది.
సుపారీ ఇస్తే చాలు..
►పిల్లి సత్యనారాయణ, త్రిమూర్తులు, నాగరాజు.. ఈ ముగ్గురు కలిసి నాలుగేళ్ల క్రితం కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ పరిధిలో నెలకొన్న ఓ భూపంచాయితీ విషయంలో సుమారు రూ.కోటికి పైగా సుపారీ తీసుకుని ఓ వ్యక్తిని హతమార్చారు. ఈ సంఘటన అనంతరం పోలీసులు వీరితోపాటు మరికొందరిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.
►మూడేళ్లక్రితం సిద్దిపేట జిల్లా చినకోడూర్లో జరిగిన ఓ హత్య కేసులో పిల్లి సత్యనారాయణ, త్రిమూర్తులుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్యలో సుపారీ మాట్లాడుకున్నారా? అనే విషయం వెల్లడి కాలేదు.
►ఆర్నెల్ల క్రితం పిల్లి సత్యనారాయణ ఒక్కడే జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో ఓ వృద్ధుడిని హత్య చేసి ఆ మృతదేహాన్ని అడవిలో పారేశాడు. దృశ్యం సినిమా తరహాలో వృద్ధుడి సెల్‌ఫోన్ ఓ బస్సులో వేసి కేసును పక్కతోవ పట్టించేందుకు యత్నించాడు.
►తొమ్మిది నెలలు క్రితం కోరుట్ల మండలం పైడిమడుగులో ఓ వ్యక్తి హత్య కోసం రూ.5 లక్షల వరకు సుపారీ మాట్లాడుకున్నారు. ఆ సొమ్ము చేతికి అందకపోవడంతో ఎదుటిపక్షం వారికి సమాచారం లీక్ చేశారు. వారిని బెదిరించి డబ్బు వసూలు చేసేందుకు యత్నించారు. ఈ కేసులో నాగరాజుతో పాటు మరొకరిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.
►కోరుట్లలోనూ ఇటీవల కొందరు వ్యాపారులు, యువకులను కొట్టి, బెదిరించి డబ్బులు వసూలు చేసిన సంఘటనలపై పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు.
లక్ష్మీరాజంది ప్రతీకార హత్యే!
నాలుగు నెలల క్రితం జరిగిన పట్టణానికి చెందిన ప్రవీణ్‌సింగ్ హత్య కేసులో నిందితులకు మద్దతుగా ఉన్నాడన్న అపోహతోనే పోగుల లక్ష్మీరాజం హత్యకు పాల్పడ్డట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. అయితే, సుపారీ విషయంలోనే హత్య చేశారనే అనుమానాల నివృత్తి కోసం పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. లక్ష్మీరాజం హత్యలో ఈ వీరితోపాటు ఇంకా ఎవరైనా ఉన్నారా..? అనే దిశలో పోలీసుల విచారణ సాగుతోంది.
పక్కదోవ పట్టించే యత్నం..
నాగరాజు తాను లక్ష్మీరాజం హత్యలో పాలుపంచుకోలేదని పోలీసులను నమ్మించడానికి మంగళవారం ఉదయం సీసీ కెమెరాలు ఉన్నచోట నుంచి పిల్లి సత్యనారాయణ, త్రిమూర్తులు మోటార్‌సైకిల్‌పై తిరిగేలా పథకం రచించినట్లు సమాచారం. ఆ తర్వాత నాగరాజు మరో వ్యక్తితో కలిసి సీసీ కెమెరాలు లేని ఏరియా నుంచి క్రిస్టియన్ కాంపౌండ్ వద్దకు చేరుకుని లక్ష్మీరాజంపై కత్తితో దాడికి దిగినట్లు పోలీసులు గుర్తించారు.
లక్ష్మీరాజంపై దాడికి పాల్పడ్డ నాగరాజు అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయి అల్లమయ్యగుట్ట ప్రాంతంలోని ఓ పొలం వద్దకు చేరుకుని పనిచేస్తున్నట్లుగా పోలీసులను నమ్మించేందుకు యత్నించినట్లు తెలిసింది. నాగరాజు కత్తులను ఇటీవల దుబా య్ నుంచి తెప్పించినట్లు తెలిసింది.
లక్ష్మీరాజం హత్యకు ఉపయోగించిన కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పోగుల లక్ష్మీరాజం హత్య తర్వాత పిల్లి సత్యనారాయణ, త్రి మూర్తులు మంగళవారం రాత్రి ఖానాపూర్ వెళ్లి ఓ వ్యక్తి వద్ద ధావత్ చేసుకోగా.. పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
నాగరాజు ఇళ్లు ధ్వంసం..
బుధవారం రాత్రి కొందరు యువకులు ప్రకాశం రోడ్డులో నాగరాజు అద్దెకు ఉండే ఇంటిపై పెట్రో ల్ చల్లి కాల్చివేసేందుకు యత్నించారు. పోలీసులు వస్తారనే భయంతో చేసి ఫర్నీచర్ ధ్వంసం చే సి పరారయ్యారు. నాగరాజు తన కార్యకలాపాల కు వినియోగించే రాంనగర్‌లోని మరో ఇంటిపైనా దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. నేరస్తుల కు ఇళ్లు ఎందుకు అద్దెకు ఇచ్చారని యజమానులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. వీరు త ల్వార్లతో పట్టణంలో సంచరించడం గమనార్హం.
వారం క్రితం పట్టణానికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ హత్యకు గురికావడం, ఇంతలోనే పోగుల లక్ష్మీరాజం మర్డర్ జరగడంతో పట్టణంలో కలకలం నెలకొంది. వారం వ్యవధిలోనే వరుస హత్యలు జరగడం చ ర్చనీయాంశంగా మారింది. గత ఆర్నెల్లలో కోరుట్ల సర్కిల్లోని కోరుట్ల, మేడిపల్లి, కథలాపూర్ మండలాల్లో ఏడుచోట్ల హత్యలు జరగడం కలవరపెడుతోంది.