ఎవరిదీ ఘాతుకం?
సాక్షి, సిటీబ్యూరో: సంఘీ ఆలయంలో దైవ దర్శనం చేసుకుని వస్తున్న దంపతులపై జరిగిన దాడి ఘటనపై సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దాడిలో భర్త వెంకటేశ్వరరావు (27) అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన అతని భార్య సౌజన్య హయత్‌నగర్‌లోని టైటాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. బంగారు ఆభరణాల కోసమే దుండగులు దంపతులపై దాడి చేశారా? లేక మరేవైనా కారణాలున్నాయా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
పెళ్లయిన మూడు నెలలకే జరిగిన దాడి నేపథ్యంలో కుటుంబ వ్యవహారాలపైనా దృష్టి పెట్టినట్టు పోలీసులు చెప్పారు. ఆదివారం క్లూస్‌టీంతో పాటు డీసీపీ రవివర్మ, ఏసీపీ ఆనంద్‌భాస్కర్, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌కుమార్ సంఘటన స్థలాన్ని మరోసారి క్షుణ్ణంగా పరిశీలించారు. ఇరు కుటుంబాలతో పాటు బెంగళూరులో సౌజన్య స్నేహితులను కూడా విచారించాలని భావిస్తున్నారు. హత్య జరిగిన తీరును బట్టి ప్రొఫెషనల్ కిల్లర్స్ పనిగానూ అనుమానించాల్సి వస్తుందని పోలీసులు అంటున్నారు.
కోలుకుంటున్న సౌజన్య
దుండగుల దాడిలో గాయపడ్డ సౌజన్య హయత్‌నగర్ టైటాన్ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఆమెకు వీపు, మోకాలు, నడుము భాగంలో గాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు. ఆమె ఇంకా ఐసీయూలోనే చికిత్స పోందుతున్నారని, కొలుకునేసరికి మరోరోజు పడుతుందన్నారు. కాగా దుండగులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు డీసీపీ రవివర్మ తెలిపారు. సౌజన్య పూర్తిగా కొలుకున్నాక ఆమెను విచారిస్తామని తెలిపారు.
మల్కాజిగిరిలో విషాదఛాయలు
పోస్టుమార్టం అనంతరం వెంకటేశ్వరరావు మృతదేహానికి ఆదివారం శాంతినగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. జూబ్లీ బ స్‌డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు (27) సౌమ్యుడని ఈ సందర్భంగా స్థానికులు గుర్తుచేసుకున్నారు. ఇంటి పెద్దకొడుకు చనిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది.