sanghi temple
-
దగ్గరుండి.. గొంతు కోయించి చంపించిన భార్య!!
తండ్రి గుండె పగిలి చస్తాడనే పెళ్లికి ఒప్పుకున్నా ఆర్టీసీ ఉద్యోగి హత్య కేసులో ముగ్గురి అరెస్టు భార్య, ప్రియుడు, మరో యువకుడు నిందితులు హైదరాబాద్: ప్రియుడి సహకారంతో భర్త (ఆర్టీసీ ఉద్యోగి) గొంతుకోసి దారుణంగా హతమార్చిన ఉదంతంలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. పెళ్లయి మూడు నెలలైనా పెళ్లి కూతురు తారుమారైన విషయం ఆ అమాయకుడికి తెలియదు! హత్యకు పాల్పడిన భార్యతో పాటు ఆమె ప్రియుడు, మరో యువకుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పెళ్లి ఆగిపోతే తన తండ్రి గుండె పగిలి చనిపోతాడనే భయంతోనే ఇష్టం లేకున్నా తాను వెంకటేశ్వరరావుతో బలవంతపు పెళ్లికి అంగీకరించానని సౌజన్య పేర్కొంది. ఈ కేసు మిస్టరీ చేధించడంలో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు కీలక పాత్ర పోషించారని ఎల్బీనగర్ డీసీపీ రవివర్మ పేర్కొన్నారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలను ఆయన వెల్లడించారు. ఆర్టీసీలో డీజిల్ మెకానిక్‌గా పనిచేస్తున్న మల్కాజ్‌గిరికి చెందిన వెంకటేశ్వరరావు (27)కు నాచారం ప్రాంతానికి చెందిన లతతో పెద్దలు మే 29న పెళ్లి చేయాలని నిర్ణయించారు. కానీ సరిగ్గా ఒక్కరోజు ముందు లత తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. అప్పటికే పెళ్లి పత్రికలు వెళ్లిపోయాయి. తెల్లారితే పెళ్లి.. లత ఆచూకీ లేదు. పరువు పోతుందనే భయంతో ఆమె తల్లిదండ్రులు బెంగళూరులోని అసెంచర్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నలత చెల్లెలు సౌజన్యను ఒప్పించి వెంకటేశ్వరరావుతో అదే ముహుర్తానికి పెళ్లి చేశారు. పెళ్లయిన తర్వాత సౌజన్య తన పేరును లతగానే చెప్పుకుంది. అయితే పెళ్లికూతురు మారిన విషయం వెంకటేశ్వరరావుకు గానీ, వారి కుటుంబ సభ్యులకు గానీ తెలియదు. నా భర్త హత్య శుభవార్త త్వరలో వింటావు... పెద్దలు బలవంతం చేయడంతో వెంకటేశ్వరరావును సౌజన్య పెళ్లయితే చేసుకుంది. కానీ సౌజన్య మనసు మాత్రం తన కంపెనీలోనే పనిచేస ఆరేళ్ల నుంచి ప్రేమిస్తున్న తన ప్రియుడు జైదీప్ (24)పైనే ఉంది. ఎలాగైనా వెంకటేశ్వరరావును వదులుకుని జైదీప్ వద్దకు వెళ్లాలని సౌజన్య కలలు కం. ఈ క్రమంలోనే హత్యకు పథకం పన్నింది. ఘటనకు మూడు రోజుల ముందు ‘నా భర్త వెంకటేశ్వరరావు హత్యకు గురైనట్లు శుభవార్త త్వరలోనే వింటావు’ అని జైదీప్‌కు వాయిస్ ఎస్ఎమ్ఎస్ను సౌజన్య పంపింది. పథకంలో భాగంగానే ఈ నెల 14న సంఘీ దేవాలయానికి బైక్‌పై దంపతులు వెళ్లి వస్తుండగా దారిలో జైదీప్, అతని స్నేహితుడు రాజ్‌కుమార్ అడ్డగించి వెంకటేశ్వరరావు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. భార్య అతని కాళ్లు గట్టిగా పట్టుకోగా, రాజ్‌కుమార్ అతని చేతులు బలంగా పట్టుకున్నాడు. పదునైన కత్తితో జైదీప్ అతని గొంతు కోశాడు. కేసును తప్పుదారి పట్టించేందుకు తనపై కూడా దుండగులు దాడి చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారని సౌజన్య పోలీసులను నమ్మించింది. సౌజన్య సెల్‌ఫోన్ కాల్‌లిస్టు ద్వారా జైదీప్‌ను అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు లోతుగా విచారించారు. హత్యకు ఉపయోగించిన కత్తి, బంగారు ఆభరణాలు, సౌజన్య సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సంఘీ దేవాలయం వద్ద దంపతులను నిందితులు ఇద్దరు కూడా అనుసరిస్తునే ఉన్నారు. దేవాలయం వద్ద సౌజన్య తన సెల్‌ఫోన్‌తో వెంకటేశ్వరరావు ఫోటోలు తీసింది. ఆ ఫోటోలలో వెనక భాగంలో ప్రియుడు జైదీప్, రాజ్‌కుమార్ కనిపించారు. మూడు రోజుల క్రితం జైదీప్‌కు పంపిన వాయిస్ ఎస్ఎమ్ఎస్ను కూడా పోలీసులు సేకరించారు. వెంకటేశ్వరరావు, సౌజన్యల పెళ్లి తీరుపై కూడా విచారణ జరుపుతామని డీసీపీ రవివర్మ తెలిపారు. జైదీప్ తమ ఇంటికి వచ్చిపోతుండేవాడని, అయితే తన కూతురు సౌజన్యను ప్రేమిస్తున్నాడన్న విషయం తమకు తెలియదని తల్లి పేర్కొంది. అక్కా చెల్లెళ్లు తమ ప్రేమ వ్యవహారం గురించి పెద్దలకు చెప్పుకుని ఉంటే ఇలాంటి పరిణామాలు తలె త్తెవి కావని పోలీసులు అంటున్నారు. -
ఎవరిదీ ఘాతుకం?
సాక్షి, సిటీబ్యూరో: సంఘీ ఆలయంలో దైవ దర్శనం చేసుకుని వస్తున్న దంపతులపై జరిగిన దాడి ఘటనపై సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దాడిలో భర్త వెంకటేశ్వరరావు (27) అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన అతని భార్య సౌజన్య హయత్‌నగర్‌లోని టైటాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. బంగారు ఆభరణాల కోసమే దుండగులు దంపతులపై దాడి చేశారా? లేక మరేవైనా కారణాలున్నాయా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పెళ్లయిన మూడు నెలలకే జరిగిన దాడి నేపథ్యంలో కుటుంబ వ్యవహారాలపైనా దృష్టి పెట్టినట్టు పోలీసులు చెప్పారు. ఆదివారం క్లూస్‌టీంతో పాటు డీసీపీ రవివర్మ, ఏసీపీ ఆనంద్‌భాస్కర్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌కుమార్ సంఘటన స్థలాన్ని మరోసారి క్షుణ్ణంగా పరిశీలించారు. ఇరు కుటుంబాలతో పాటు బెంగళూరులో సౌజన్య స్నేహితులను కూడా విచారించాలని భావిస్తున్నారు. హత్య జరిగిన తీరును బట్టి ప్రొఫెషనల్ కిల్లర్స్ పనిగానూ అనుమానించాల్సి వస్తుందని పోలీసులు అంటున్నారు. కోలుకుంటున్న సౌజన్య దుండగుల దాడిలో గాయపడ్డ సౌజన్య హయత్‌నగర్ టైటాన్ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఆమెకు వీపు, మోకాలు, నడుము భాగంలో గాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు. ఆమె ఇంకా ఐసీయూలోనే చికిత్స పోందుతున్నారని, కొలుకునేసరికి మరోరోజు పడుతుందన్నారు. కాగా దుండగులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు డీసీపీ రవివర్మ తెలిపారు. సౌజన్య పూర్తిగా కొలుకున్నాక ఆమెను విచారిస్తామని తెలిపారు. మల్కాజిగిరిలో విషాదఛాయలు పోస్టుమార్టం అనంతరం వెంకటేశ్వరరావు మృతదేహానికి ఆదివారం శాంతినగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. జూబ్లీ బ స్డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు (27) సౌమ్యుడని ఈ సందర్భంగా స్థానికులు గుర్తుచేసుకున్నారు. ఇంటి పెద్దకొడుకు చనిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. -
నిఘా లేకే దారుణాలు
సాక్షి, సిటీబ్యూరో : నవ దంపతులు.. వారాంతంలో దైవదర్శనం కోసం వచ్చారు... తిరిగి వెళ్తూ రోడ్డు పక్కగా ఆగడమే వారు చేసిన పాపం... కర్కశంగా దాడి చేసిన ముగ్గురు దుండగులు భర్త వెంకటేశ్వరరావును హతమార్చి, భార్య సౌజన్యపై హత్యాయత్నం చేసి దోచుకున్నారు. ప్రస్తుతం ఆ అభాగ్యురాలు ఐసీయూలోనే చికిత్స పొందుతోంది. సంఘీ టెంపుల్ దారిలో శనివారం జరిగిన దారుణమిది. నగర శివార్లలో సంఘీనగర్‌లో ఉన్న సంఘీ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆలయం వద్ద భద్రత విషయంలో ఢోకా లేకపోయినా... దానికి వెళ్లే దారి మాత్రం ‘ముళ్ల బాటే’. అనేకమంది భక్తులతో పాటు ప్రేమ పక్షులు నిత్యం ఇక్కడ కనిపిస్తుంటారు. వీరిపై దాడులు, దోపిడీలు నిత్యకృత్యమయ్యాయి. పోలీసుల గస్తీ, నిఘా ఉండాల్సిన స్థాయిలో లేకపోవడంతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకాంతం కోరుకోవడమే ఇబ్బంది సంఘీ ఆలయానికి వచ్చే దంపతులు, ప్రేమికులు ఆ మార్గంమధ్యలో ఏకాంతంగా కాసేపు సేద తీరాలని కోరుకుంటుంటారు. ఇదే నేరగాళ్లకు అనువుగా మారుతోంది. కొన్ని ప్రాంతాలకు చెందిన యువకులు, పాత నేరగాళ్లు ఇక్కడ తిష్ట వేసి కనిపించిన వారిని అడ్డగిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. కంచే చేను మేసిన చందాన హోంగార్డులూ బెదిరింపులకు పాల్పడి వసూళ్లు చేసిన ఉదంతాలున్నాయి. దంపతులపై జరిగిన నేరాలు బయటకు వచ్చినా... అనేక కారణాలతో ప్రేమికులు తమకు ఎదురైన అనుభవాలను సైతం బయటకు చెప్పుకోలేరు. ఇదే అసాంఘికశక్తులు, నేరగాళ్లకు వరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో సంఘీ మార్గంలో సాధారణ రోజుల్లో అవసరమైన స్థాయిలో, వారాంతాలు, సెలవు దినాల్లో పెట్రోలింగ్, నిఘా పెంచాలని పలువురు కోరుతున్నారు. -
హయత్‌నగర్‌లో దుండగుల దాడి.. భార్య మృతి, భర్త సీరియస్
హైదరాబాద్ శివారు ప్రాంతంలోని హయత్‌నగర్‌లో దారుణం జరిగింది. సంఘీ టెంపుల్ వద్దకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి వస్తున్న దంపతులపై దుండగులు హత్యాయత్నం చేశారు. కత్తులతో వారిపై దాడి చేయడంతో ఇద్దరిలో భార్య మృతి చెందింది. భర్త పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. కోహెడ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఇటీవలి కాలంలో శివారు ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిస్థితి బాగా క్షీణిస్తోంది. సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు నిర్వహించిన సమావేశానికి హాజరైన కొందరు తిరిగి వెళ్తుండగా బస్సు మీద రాళ్లతో దాడి కూడా హయత్‌నగర్ ప్రాంతంలోనే జరిగిన విషయం తెలిసిందే.