దగ్గరుండి.. గొంతు కోయించి చంపించిన భార్య!!
తండ్రి గుండె పగిలి చస్తాడనే పెళ్లికి ఒప్పుకున్నా
ఆర్టీసీ ఉద్యోగి హత్య కేసులో ముగ్గురి అరెస్టు
భార్య, ప్రియుడు, మరో యువకుడు నిందితులు
హైదరాబాద్: ప్రియుడి సహకారంతో భర్త (ఆర్టీసీ ఉద్యోగి) గొంతుకోసి దారుణంగా హతమార్చిన ఉదంతంలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. పెళ్లయి మూడు నెలలైనా పెళ్లి కూతురు తారుమారైన విషయం ఆ అమాయకుడికి తెలియదు! హత్యకు పాల్పడిన భార్యతో పాటు ఆమె ప్రియుడు, మరో యువకుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పెళ్లి ఆగిపోతే తన తండ్రి గుండె పగిలి చనిపోతాడనే భయంతోనే ఇష్టం లేకున్నా తాను వెంకటేశ్వరరావుతో బలవంతపు పెళ్లికి అంగీకరించానని సౌజన్య పేర్కొంది. ఈ కేసు మిస్టరీ చేధించడంలో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ) పోలీసులు కీలక పాత్ర పోషించారని ఎల్బీనగర్ డీసీపీ రవివర్మ పేర్కొన్నారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలను ఆయన వెల్లడించారు.
ఆర్టీసీలో డీజిల్ మెకానిక్‌గా పనిచేస్తున్న మల్కాజ్‌గిరికి చెందిన వెంకటేశ్వరరావు (27)కు నాచారం ప్రాంతానికి చెందిన లతతో పెద్దలు మే 29న పెళ్లి చేయాలని నిర్ణయించారు. కానీ సరిగ్గా ఒక్కరోజు ముందు లత తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. అప్పటికే పెళ్లి పత్రికలు వెళ్లిపోయాయి. తెల్లారితే పెళ్లి.. లత ఆచూకీ లేదు. పరువు పోతుందనే భయంతో ఆమె తల్లిదండ్రులు బెంగళూరులోని అసెంచర్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నలత చెల్లెలు సౌజన్యను ఒప్పించి వెంకటేశ్వరరావుతో అదే ముహుర్తానికి పెళ్లి చేశారు. పెళ్లయిన తర్వాత సౌజన్య తన పేరును లతగానే చెప్పుకుంది. అయితే పెళ్లికూతురు మారిన విషయం వెంకటేశ్వరరావుకు గానీ, వారి కుటుంబ సభ్యులకు గానీ తెలియదు.
నా భర్త హత్య శుభవార్త త్వరలో వింటావు...
పెద్దలు బలవంతం చేయడంతో వెంకటేశ్వరరావును సౌజన్య పెళ్లయితే చేసుకుంది. కానీ సౌజన్య మనసు మాత్రం తన కంపెనీలోనే పనిచేస ఆరేళ్ల నుంచి ప్రేమిస్తున్న తన ప్రియుడు జైదీప్ (24)పైనే ఉంది. ఎలాగైనా వెంకటేశ్వరరావును వదులుకుని జైదీప్ వద్దకు వెళ్లాలని సౌజన్య కలలు కం. ఈ క్రమంలోనే హత్యకు పథకం పన్నింది. ఘటనకు మూడు రోజుల ముందు ‘నా భర్త వెంకటేశ్వరరావు హత్యకు గురైనట్లు శుభవార్త త్వరలోనే వింటావు’ అని జైదీప్‌కు వాయిస్ ఎస్‌ఎమ్‌ఎస్‌ను సౌజన్య పంపింది. పథకంలో భాగంగానే ఈ నెల 14న సంఘీ దేవాలయానికి బైక్‌పై దంపతులు వెళ్లి వస్తుండగా దారిలో జైదీప్, అతని స్నేహితుడు రాజ్‌కుమార్ అడ్డగించి వెంకటేశ్వరరావు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు.
భార్య అతని కాళ్లు గట్టిగా పట్టుకోగా, రాజ్‌కుమార్ అతని చేతులు బలంగా పట్టుకున్నాడు. పదునైన కత్తితో జైదీప్ అతని గొంతు కోశాడు. కేసును తప్పుదారి పట్టించేందుకు తనపై కూడా దుండగులు దాడి చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారని సౌజన్య పోలీసులను నమ్మించింది. సౌజన్య సెల్‌ఫోన్ కాల్‌లిస్టు ద్వారా జైదీప్‌ను అదుపులోకి తీసుకున్న ఎస్‌ఓటీ పోలీసులు లోతుగా విచారించారు. హత్యకు ఉపయోగించిన కత్తి, బంగారు ఆభరణాలు, సౌజన్య సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సంఘీ దేవాలయం వద్ద దంపతులను నిందితులు ఇద్దరు కూడా అనుసరిస్తునే ఉన్నారు. దేవాలయం వద్ద సౌజన్య తన సెల్‌ఫోన్‌తో వెంకటేశ్వరరావు ఫోటోలు తీసింది. ఆ ఫోటోలలో వెనక భాగంలో ప్రియుడు జైదీప్, రాజ్‌కుమార్ కనిపించారు. మూడు రోజుల క్రితం జైదీప్‌కు పంపిన వాయిస్ ఎస్‌ఎమ్‌ఎస్‌ను కూడా పోలీసులు సేకరించారు.
వెంకటేశ్వరరావు, సౌజన్యల పెళ్లి తీరుపై కూడా విచారణ జరుపుతామని డీసీపీ రవివర్మ తెలిపారు. జైదీప్ తమ ఇంటికి వచ్చిపోతుండేవాడని, అయితే తన కూతురు సౌజన్యను ప్రేమిస్తున్నాడన్న విషయం తమకు తెలియదని తల్లి పేర్కొంది. అక్కా చెల్లెళ్లు తమ ప్రేమ వ్యవహారం గురించి పెద్దలకు చెప్పుకుని ఉంటే ఇలాంటి పరిణామాలు తలె త్తెవి కావని పోలీసులు అంటున్నారు.