అది రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సొంతంగా ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు 20-30 ప్రభుత్వ శాఖలు ఉద్యోగ నియామక ప్రక్రియను సర్వీసు కమిషన్ పరిధి నుంచి వెనక్కి తీసుకున్నాయని...ఇది రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని టీఎస్పీఎస్సీ కార్యాలయ ఆవరణలో సంస్థ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు, కార్యదర్శి, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ అన్ని శాఖల్లో నియామకాల బాధ్యతలను తమకు అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరామని, ఆ బాధ్యతలను ప్రభుత్వం అప్పగిస్తుందని ఆశిస్తున్నామన్నారు.
గతంలో జూనియర్ సివిల్ జడ్జి పోస్టులను కూడా రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ భర్తీ చేసేదని గుర్తుచేశారు. కమిషన్ సభ్యుల్లో న్యాయ నిఫుణులు ఉన్నారని, అన్ని రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తమ సిబ్బంది అంకితభావంతో పని చేయడం వల్లే 9 నోటిఫికేషన్ల ద్వారా 3 లక్షల మందికి విజయవంతంగా పరీక్షలు నిర్వహించగలిగామన్నారు. టెక్నాలజీ వినియోగంలో తమ పనితీరుకు రెండు జాతీయ అవార్డులు వచ్చాయన్నారు. అయితే అవార్డుల కోసం కాకుండా తాము పారదర్శకత కోసం పని చేస్తున్నామన్నారు.
కమిషన్ కే అప్పగించాలి..: జస్టిస్ సుభాషణ్‌రెడ్డి
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి తొలుత ప్రసంగిస్తూ ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకే సుప్రీం కోర్టు కమిటీ సిఫారసుల మేరకు పబ్లిక్ సర్వీసు కమిషన్లు రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డాయన్నారు. వాటికే ఉద్యోగ నియామకాలు, సర్వీసు సంబంధ అంశాలను అప్పగించాలన్నారు. గతంలో మున్సిఫ్ జడ్జిల నియామకాల విషయంలో 1963-73 వరకు కమిషన్ ఒక్క నియామకం చేపట్టలేదని... అందువల్లే ఆయా శాఖలు నియామకాలను వెనక్కి తీసుకున్నాయన్నారు. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ బాగా పని చేస్తోంది కనుక దానికే అన్ని రకాల నియామకాల బాధ్యతలను అప్పగించాలన్నారు.
టీఎస్పీఎస్సీ ఏర్పడిన ఏడాది కాలంలో 9 రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పూర్తి చేయడం అభినందనీయమన్నారు. ఐటీని బాగా వినియోగించుకొని టీఎస్పీఎస్సీ పారదర్శకతకు పెద్దపీట వేస్తోందన్నారు. భవిష్యత్తులో ఇంతకన్నా బాగా చేయాలని జస్టిస్ సుభాషణ్‌రెడ్డి ఆకాంక్షించారు. ఉద్యోగ నియామకాల్లో సమ న్యాయం ముఖ్యమని ఆయన సూచించారు. వికలాంగుల కోటాలో 3 శాతం అమలు సరిగ్గా జరగడం లేదన్నారు. ఏడీఈ పోస్టు నుంచి ఈఈ పోస్టుకు పదోన్నతుల ఇంటిగ్రేషన్ ఆఫ్ సర్వీసు విషయంలోనూ సుప్రీంకోర్టు 9 మంది సభ్యుల ధర్మాసనం తీర్పు ఇచ్చినా వివాదాలు కొనసాగుతున్నాయన్నారు. అలాంటి వివాదాలు రాకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులకు, ఉద్యోగులకు, సిబ్బందికి జస్టిస్ సుభాషణ్‌రెడ్డి జ్ఞాపికలు అందజేశారు.