రూ. 2 వేల కోట్లతో ఎస్ఎస్ఏ కార్యక్రమాలు
ఆమోదం తెలిపిన ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు
110 కేజీబీవీలు, 29 అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లకు ఓకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) కింద రూ. రెండు వేల కోట్లకు పైగా నిధులతో విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఎస్ఎస్ఏ ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) ఓకే చెప్పింది. ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో పీఏబీ రాష్ట్రంలో విద్యా కార్యక్రమాలకు ఓకే చెప్పింది. 2017–18 విద్యా సంవత్సరంలో చేపట్టే విద్యా కార్యక్రమాలకు వెచ్చించే ఈ మొత్తంలో కేంద్రం 60 శాతం నిధులను ఇవ్వనుండగా, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను వెచ్చించనుంది. వాస్తవానికి రాష్ట్ర విద్యా శాఖ రూ. 2,933 కోట్లతో ప్రతిపాదనలు పంపించినా, సివిల్ వర్క్స్‌కు నిధులు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు.
వాటిని తొలగించి రూ. 2 వేల కోట్ల రాష్ట్ర ప్రణాళికలను ఓకే చేసింది. ఇందులో అత్యధికంగా రూ. 1,064 కోట్లు 20,823 మంది టీచర్ల వేతనాల కింద ఇచ్చేందుకే వెచ్చించనున్నారు. ఇప్పటికే ఉన్న 391 కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల (కేజీబీవీ) అభివృద్ధికి రూ. 264 కోట్లు వెచ్చించనున్నారు. వీటికి అదనంగా రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పాటైన 125 మండలాల్లో విద్యా పరంగా వెనుకబడిన 110 మండలాల్లోనూ కేజీబీవీల ఏర్పాటుకు ఓకే చెప్పింది. ప్రస్తుతం హైదరాబాద్, ఖమ్మంలో వీధి బాలలు, అనాథ విద్యార్థుల కోసం అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండగా, మిగతా జిల్లాల్లోని పట్టణ కేంద్రాల్లో మరో 29 అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు అంగీకరించింది. ఈసారి పాఠ్య పుస్తకాలకు కూడా నిధులను ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.