ఎంపీకి పూలు, చెప్పులతో నిరసన
న్యూఢిల్లీ: ఎయిరిండియా ఉద్యోగి సుకుమార్‌ను దుర్భాషలాడి, ఆయనపై దాడి చేసిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై ఆమ్ ఆద్మీ సేన సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుకుమార్‌ను చెప్పుతో కొట్టిన గైక్వాడ్‌కు తామూ అదే పని చేస్తామని హెచ్చరించారు.
ఎంపీ దౌర్జన్యాన్ని నిరసిస్తూ ఆమ్ ఆద్మీ సేన సభ్యులు ఢిల్లీ విమానాశ్రయంలో మూడో టర్మినల్ ముందు ఆందోళన చేపట్టారు. పూలు, చెప్పులతో నిరసన తెలియజేశారు. ఎంపీ గైక్వాడ్ మహారాష్ట్రకు వెళ్లేందుకు శుక్రవారం సాయంత్రం 4:15 గంటలకు టికెట్ రిజర్వ్ చేసుకున్నారు. నిన్న సంఘటన తర్వాత ఎయిరిండియా ఈ టికెట్‌ను రద్దు చేసింది. ఎంపీ విమానాశ్రయానికి వస్తారని సమాచారం రావడంతో గొడవ జరుగుతుందనే ఉద్దేశంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. కాగా టికెట్ రద్దు కావడంతో ఎంపీ రాలేదు. గైక్వాడ్ దాడిని ఖండిస్తూ నిరసన తెలిపేందుకు ఆమ్ ఆద్మీ సేన సభ్యులు విమానాశ్రయానికి వచ్చారు.
గురువారం సీటు విషయంపై గొడవపడిన ఎంపీ గైక్వాడ్.. సుకుమార్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. సుకుమార్‌ను 25 సార్లు చెప్పుతో కొట్టానని స్వయంగా ఎంపీ చెప్పారు. ఎంపీపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఎయిరిండియాతో పాటు విస్తారా, ఇండిగో, జెట్ ఎయిర్వేస్, స్పైస్ జెట్, గో ఎయిర్ లాంటి సంస్థలు ఆయన్ను బహిష్కరించాయి.