మూడు వేల ఏళ్ల క్రితమే ‘జల్లికట్టు’
తమిళనాడులో ‘జల్లికట్టు’ పోటీలను శాశ్వతంగా అనుమతించాలంటూ అక్కడి ప్రజలు ఓపక్క ఆందోళన కొనసాగిస్తుంటే మరోపక్క జల్లికట్టు ద్రవిడ సంప్రదాయమా, హిందూ సంప్రదాయమా? అంటూ మేథావుల మధ్య చర్చ జరుగుతోంది. జల్లికట్టు ద్రవిడ సంప్రదాయమని, సంఘం సాహిత్యం నాటి కాలం నుంచే, అంటే రెండువేల సంవత్సరాల కాలం నుంచే అమల్లో ఉందని, జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధాన్ని వ్యతిరేకిస్తున్న ఆందోళనకారులు వాదిస్తున్నారు. జల్లికట్టు హిందూ సంప్రదాయమని, ఈ క్రీడను నిషేధించడం హిందూత్వం మీద దాడి చేయడమేనని హిందుత్వ మేథావులు వాదిస్తున్నారు.
ప్రస్తుతం పాకిస్థాన్ భూభాగంలో ఉన్న మొహెంజొదారోలో మూడువేల సంవత్సరాల క్రితం దొరికిన ముద్ర (సీల్)లో జల్లికట్టు బొమ్మ ఉందని సింధూ నాగరికతపై అధ్యయనం చేసిన ప్రముఖ ప్రపంచ చరిత్రకారుల్లో ఒకరైన ఐరావతం మహదేవన్ తెలియజేశారు. ఆ ముద్రలో ఎద్దు లేదా దున్నపోతు మనుషులను తన కొమ్ములతో ఎత్తి పడేస్తున్నట్లు ఉంది. సింధూ నాగరికతకు సంబంధించిన పత్రాలు కూడా ద్రవిడ భాషలో రాసినవేనన్నది ఆయన వాదన. ప్రాచీన తమిళ భాషా చిహ్నాలకు, హరప్పా కాలం నాటి భాషాచిహ్నాలకు దగ్గరి పోలికలు చాలా ఉన్నాయని మహదేవన్ తన అధ్యయనంలో తేల్చారు.
1964లో యూరీ క్నోరోజొవ్ నాయకత్వంలో ఓ రష్యా బృందం, ఫిన్లాండ్కు చెందిన మరో పురాతత్వ చరిత్రకారుల బృందం సింధూ లిపిపై అధ్యయనం చేసి దాన్ని ద్రవిడ భాషగానే తేల్చాయి. ఫిన్లాండ్ బృందంలో పాల్గొన్న నాటి హెల్సింకి యూనివర్సిటీ ఇండాలజిస్ట్ అస్కో పర్పోలా సింధూ లిపిలో ఉన్న పదాలు లేదా శబ్ద చిత్రాలను ద్రవిడ భాషలోని చిత్రాలతో పోల్చి చూసి రెండూ ఒకే భాషలోనివని తేల్చారు. ‘ది రూట్స్ ఆఫ్ హిందూయిజం, ది ఎర్లీ ఆర్యన్స్ అండ్ సివిలైజేషన్’ అనే పుస్తకంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
సింధూ లిపి ద్రవిడ భాషలో ఉన్నందున సింధూ నాగరికత ద్రవిడులదని, ఆర్యులు అక్కడికి తర్వాత వచ్చారన్నది ఐరావతం మహదేవన్, ఆస్కో పర్పోలాలతోపాటు మరో సింధూ స్కాలర్ బ్య్రాన్ వెల్స్ వాదన. ఇలినాయి యూనివర్శిటీలో లింగ్విస్టిక్స్ ప్రొఫెసర్గా పనిచేసి, ప్రస్తుతం గూగుల్ రిసెర్చ్ విభాగంలో పనిచేస్తున్న రిచర్డ్ స్పోర్ట్, హార్వర్డ్ యూనివర్శిటీలో సంస్కృత భాషా పరిశోధకుడిగా పనిచేస్తున్న మైఖేల్ విట్జెల్ ఈ ద్రవిడ వాదనతో వ్యతిరేకిస్తున్నారు. అసలు సింధూ స్క్రిప్టు అనేదే బూటకమని, సింధూ నాగరికత మూలాలు ప్రాచీన సంస్కృతంలో ఉన్నాయన్నది వీరిద్దరి అభిప్రాయం.
జల్లికట్టు వివాదం పుణ్యమా అని ప్రాచీన నాగరికత, భాషలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. సింధూ నాగరికత ద్రవిడులదా, హిందువులదా లేదా ఆర్యులదా అన్నది పక్కన పెడితే మొహెంజొదారోలో దొరికిన ముద్రను బట్టి జల్లికట్టు సంప్రదాయం మూడువేల సంవత్సరాల క్రితమే ఉన్నట్లు తెలుస్తోంది.