PS Narasimha Rao
-
‘మై లార్డ్’ అనకండి..సగం వేతనం ఇచ్చేస్తా!
న్యూఢిల్లీ: కోర్టులో వాదోపవాదాల సమయంలో పదేపదే మై లార్డ్, యువర్ లార్డ్‌షిప్స్’అంటూ లాయర్లు తమను సంబోధిస్తుండటంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మై లార్డ్స్ అని ఎన్నిసార్లు అంటారు? ఇలా అనడం ఆపేస్తే, నా వేతనంలో సగం మీకిచ్చేస్తా’అని జస్టిస్ పీఎస్ నరసింహ పేర్కొన్నారు. బుధవారం జస్టిస్ ఏఎస్ బొపన్నతో కలిసి ఆయన ఓ కేసు విచారణలో పాల్గొన్నారు. వాదోపవాదాల సమయంలో ఓ సీనియర్ లాయర్ పదేపదే ‘మై లార్డ్, యువర్ లార్డ్‌షిప్స్’ అంటుండటంపై పైవిధంగా ఆయన స్పందించారు. వాటికి బదులుగా సర్ అని అనొచ్చు కదా అని తెలిపారు. లేకుంటే ఆ మాటలను ఎన్నిసార్లు వాడేదీ లెక్కపెడ తానని చెప్పారు. ‘మై లార్డ్, యువర్ లార్డ్‌షిప్’అనే మాటలు వలస పాలన ఆనవాళ్లని, కోర్టు ప్రొసీడింగ్స్ సమయంలో వాడరాదంటూ 2006లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీర్మానం చేసింది. -
మధ్యవర్తిత్వమే ఉత్తమ మార్గం
సాక్షి, హైదరాబాద్: న్యాయపరమైన సమస్యలను పరిష్కరించడంలో మధ్యవర్తిత్వం ఉత్తమ మార్గమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్ పేర్కొన్నారు. కోర్టులు, చట్టాల ద్వారా అందేది కక్షిదారులపై బయటి నుంచి రుద్దిన పరిష్కారమే అవుతుందని.. మనుషులంతా కూర్చుని సంప్రదింపులతో జరిపే మానవీయ పరిష్కారం కాదని చెప్పారు. విద్వేష భావనలు, విద్వేష ప్రసంగాలతో కలుషితం అవుతున్న సమాజంలో సోక్రటీస్ వంటి మహనీయులు ప్రవచించిన జీవన విధానం మంచిదని సూచించారు. శనివారం హైదరాబాద్ షామీర్పేటలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో 20వ స్నాతకోత్సవం జరిగింది. ఇందులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ (నల్సా) కార్యనిర్వాహక అధ్యక్షుడు జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్ ముఖ్య అతిథిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, వర్సిటీ చాన్సలర్ అలోక్ అరాధే అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్ మాట్లాడుతూ.. ‘‘మనుషులం కనుకే ఆలోచిస్తాం.. ఒకరికొకరు భిన్నంగా ఆలోచిస్తాం. తర్క, వితర్కాలతో సంభాషించుకుంటూనే శాంతియుతంగా జీవించే సమాజం ఉండాలి. మన రాజ్యాంగ నైతికత కూడా దీన్నే తెలియజేస్తుంది. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించే విధానంలో అందరి తర్కం, వాదన విని.. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుంది. నాలుగు మెదళ్ల సంఘర్షణ నుంచి వచ్చే పరిష్కారం మెరుగ్గానే ఉంటుందనడంలో అశ్చర్యం అవసరం లేదు..’’ అని పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు న్యాయం అందేలా కృషి చేయాలని న్యాయ విద్యార్థులకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ సహకారం మరువలేనిది.. నల్సార్ వర్సిటీలో వసతులు కల్పించడంలో సీఎం కేసీఆర్ సహకారం మరువలేనిదని వర్సిటీ వీసీ శ్రీకృష్ణదేవరావు పేర్కొన్నారు. జ్యుడిషియల్ అకాడమీ కోసం 25 ఎకరాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. 25ఏళ్ల నల్సార్ వర్సిటీ ప్రస్థానంలో ఎన్నో కొత్త కోర్సులను తీసుకొచ్చామని, ఎందరో విద్యార్థులను సమాజానికి అందించామని చెప్పారు. లీగల్ ఎయిడ్‌తోపాటు అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్‌లను ప్రోత్సహించడంలో నల్సార్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్డీ, ఎల్ఎల్ఎం, ఎంబీఏ, బీఏ ఎల్ఎల్బీ ఆనర్స్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలతో పాటు 58 మందికి బంగారు పతకాలను అందజేశారు. ప్రొఫెసర్ బాలకృష్ణరెడ్డితోపాటు ఇతరులు రాసిన పుస్తకాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు సీజే ఆవిష్కరించారు. హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యకార్యదర్శి గోవర్థన్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి
తిరుమల/చంద్రగిరి: తిరుమల శ్రీవారిని ఆదివారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం న్యాయమూర్తికి పండితులు వేద ఆశీర్వచనం అందించగా, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, ఏఈవో ధర్మారెడ్డిలు శ్రీవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. అలాగే, శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామిని, కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామిని కూడా జస్టిస్ నరసింహ ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం చంద్రగిరిలోని రాయలవారి కోటను సందర్శించి తిరుగు ప్రయాణమయ్యారు. ఇక, ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖుల్లో ఇన్‌కమ్‌టాక్స్ చీఫ్ కమిషనర్ సంజయ్ పురి, నటుడు విజయ్‌దేవరకొండ ఉన్నారు. అధికారులు వీరికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. -
వ్యాపార నియంత్రణ కోసమే!
పశువధ నిషేధంపై నోటిఫికేషన్ తీసుకొచ్చామన్న కేంద్రం ► నిషేధాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం ► 2 వారాల్లో స్పందించాలని కేంద్రానికి నోటీసులు న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పశువుల వ్యాపారంలో నియంత్రణ వ్యవస్థను తీసుకొచ్చేందుకే పశువుల అమ్మకంపై నిషేధం విధించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ ఉద్దేశంతోనే కేంద్రం పశువధను నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిందని అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) పీఎస్ నరసింహారావు సుప్రీంకోర్టు ధర్మాసనానికి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పశువుల మార్కెట్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టడమే ప్రభుత్వం ఆలోచన అని.. సక్రమంగా వ్యాపారం చేస్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవని ఆయన తెలిపారు. పశువధపై కేంద్ర నిర్ణయాన్ని (మే 26న జారీ అయిన నోటిఫికేషన్) సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించిన జస్టిస్ ఆర్కే అగర్వాల్, జస్టిస్ ఎస్కే కౌల్ల ధర్మాసనం దీనిపై 2 వారాల్లో సమాధానం ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు జారీచేసింది. జూలై 11కు కేసును వాయిదా వేసింది. రాజ్యాంగ విరుద్ధమన్న పిటిషనర్లు కేంద్రం నిర్ణయంపై స్టే విధించాలన్న ఓ పిటిషనర్ ప్రశ్నపై ఏఎస్జీ స్పందిస్తూ.. ఇప్పటికే మద్రాసు హైకోర్టు స్టే విధించినందున కేంద్రం నిర్ణయం ప్రస్తుతానికి అమల్లో లేదన్నారు. పిటిషనర్ల తరపున వాదిస్తున్న కొందరు న్యాయవాదులు.. పశువధపై నిషేధం వల్ల కేరళ, తమిళనాడు చుట్టుపక్కల రాష్ట్రాల్లో తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. కేంద్ర నోటిఫికేషన్‌తో విశ్వాసం, మత స్వాతంత్య్రానికి భంగం వాటిల్లుతోందన్నారు. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ ఫహీమ్ ఖురేషీ అనే పిటిషనర్ ‘నోటిఫికేషన్ జంతువులను బలి ఇచ్చే మత విశ్వాసానికి వ్యతిరేకంగా ఉంద’ని పేర్కొన్నారు. దీంతోపాటుగా రాజ్యాంగం పౌరులకు కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛ, ఆహారపు హక్కు నిబంధనలకు కూడా వ్యతిరేకంగా ఉందన్నారు. ఇలాగైతే జీవితాలు దుర్భరం! కేరళ, పశ్చిమబెంగాల్, త్రిపుర, కర్ణాటక ప్రభుత్వాలు కేంద్రం నిర్ణయాన్ని తమ రాష్ట్రాల్లో అమలుచేయబోవటం లేదని స్పష్టం చేసిన విషయాన్ని కూడా పిటిషనర్లు పేర్కొన్నారు. తమ రాష్ట్రంలో పశువధపై ఆధారపడి బతుకుతున్నవారి జీవితాలు దుర్భరమవుతాయని ఆయా రాష్ట్రాలు చెప్పటాన్నీ వారు గుర్తుచేశారు. పశువుల అమ్మకం, కొనుగోలుపై నిషేధం వల్ల రైతులపైనా పెనుభారం పడుతుందని.. ఈ వ్యాపారంపై ఆధారపడేవారి కుటుంబాల్లో పిల్లలు మూడుపూటలా తినే పరిస్థితి లేదన్నారు.