నేడు పీఎస్ఎల్వీ సీ30 కౌంట్‌డౌన్ ప్రారంభం
సూళ్లూరుపేట: సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి సోమవారం ఉదయం 10 గంటలకు ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ- సీ30కి సంబంధించి శనివారం ఉదయం 8 గంటలకు కౌంట్‌డౌన్ కోసం సర్వంసిద్ధమైంది. మిషన్ సంసిద్ధతా కమిటీ(ఎంఆర్ఆర్) రాకెట్‌కు తుది తనిఖీలు నిర్వహించి లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించగా వారు శుక్రవారం ప్రీకౌంట్డౌన్ ప్రక్రియలను నిర్వహించి శనివారం కౌంట్‌డౌన్‌కు సిద్ధమయ్యారు. 50 గంటల కౌంట్‌డౌన్ తర్వాత సోమవారం ప్రయోగాన్ని నిర్వహించనున్నారు.
ప్రయోగం ద్వారా ఇస్రో ఆస్ట్రోశాట్‌తో పాటు మరో 6 ఉపగ్రహాలను రోదసీలోకి పంపుతారు. ఇస్రోసహాఇండోనేసియా, కెనడా, అమెరికా శాస్త్రవేత్తలు ప్రయోగ పనుల్లో పాలుపంచుకుంటున్నారు. సూర్యమండలాన్ని పరిశోధించేందుకు, విశ్వంలోని సుదూర పదార్థాల అధ్యయనానికి ఆస్ట్రోశాట్‌ను పీఎస్ఎల్వీ సీ30 రాకెట్ ద్వారా ప్రయోగిస్తున్నారు.
ఈ ఉపగ్రహంలో 40 సెంటీమీటర్లు ట్విన్స్ అల్ట్రావయొలెట్ టెలీస్కోప్(యూవీఐటీ), లార్ట్ ఏరియా క్సెనాన్ ప్రొపోర్షన్ కౌంటర్ (ఎల్ఏఎక్స్పీసీ), సాప్ట్ ఎక్స్‌రే టెలిస్కోప్, కాడ్‌మిమ్స్-జింక్-టెల్యూరైడ్ కోడెడ్- మాస్క్ ఇమేజర్ (సీజడ్టీఐ), స్కానింగ్ స్కై మానిటర్ అనే ఉపకరణాలను అమర్చారు.