పీఎస్ఎల్వీ సీ26 ప్రయోగం సక్సెస్
కక్ష్యలోకి మూడో నావిగేషనల్ శాటిలైట్
భారత ప్రాంతీయ దిక్సూచీ దిశగా మరో ముందడుగు
శ్రీహరికోట(సూళ్లూరుపేట): శ్రీహరికోట లోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం(షార్)లో వారం రోజుల ముందే దీపావళి వెలుగులు విరజిమ్మాయి. షార్ మొదటి వేదిక నుంచి గురువారం తెల్లవారుజామున 1.32 గంటలకు నింగికి ఎగిసిన పీఎస్ఎల్వీ సీ26 రాకెట్ 1,425 కిలోల బరువైన ఐఆర్ఎన్ఎస్ఎస్-1సీ ఉపగ్రహాన్ని 20.18 నిమిషాలకు నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది.
ఉత్కంఠ మధ్య విజయవంతంగా..
.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చరిత్రలో రెండోసారి అర్ధరాత్రి నిర్వహిస్తున్న ప్రయోగం కావడంతో గురువారం తెల్లవారుజామున శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్)లోని మిషన్ కంట్రోల్‌రూంలో శాస్త్రవేత్తల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి పీఎస్ఎల్వీ సీ26 ప్రయోగం 10వ తేదీనే నిర్వహించాల్సి ఉన్నా.. సాంకేతిక లోపం వల్ల వాయిదాపడిన నేపథ్యంలో అందరిలోనూ ఆందోళన. కానీ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ.. ఇస్రో గెలుపుగుర్రం పీఎస్ఎల్వీ రాకెట్ ఎరుపు, నారింజ రంగు మంటలు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. సరిగ్గా 20.31 నిమిషాల తర్వాత ఐఆర్ఎన్ఎస్ఎస్-1సీ కక్ష్యలోకి చేరింది.
రూ.1,600 కోట్ల వ్యయంతో రూపొం దించిన ఈ ఉపగ్రహం పదేళ్లకు పైగా సేవలందిస్తుంది. దీనిలో లాజర్ రెట్రో-రిఫ్లెక్టర్, నావిగేషన్ సిగ్నల్స్ ఎల్-5 ఎస్ బాండ్, గ్లోబల్ పొజిషన్ సిస్టం (జీపీఎస్)పేలోడ్లను అమర్చి పంపారు.
సొంత దిక్సూచీ ఉపగ్రహ వ్యవస్థ ఏర్పాటు ఇలా...
ప్రస్తుతం అమెరికా, రష్యాలకు మాత్రమే సొంత నావిగేషన్(దిక్సూచీ) ఉపగ్రహ వ్యవస్థలు ఉన్నాయి. నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ ఏర్పాటు కోసం ఐరోపా అంతరిక్ష సంస్థ, చైనా, జపాన్‌లు కూడా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ సొంతంగా ‘భారత ప్రాంతీయ దిక్సూచీ ఉపగ్రహ వ్యవస్థ (ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం)’ ఏర్పాటుపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా మొత్తం ఏడు ఉపగ్రహాలను నింగికి పంపాల్సి ఉండగా, ఇప్పటిదాకా మూడు ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరాయి. వచ్చే ఏడాది ఏడు ఉపగ్రహాలను నింగికి పంపి ఈ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఇస్రో సన్నద్ధమైంది. వీటిలో మొదటి ఉపగ్ర హం ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఏని జూలై 1న, రెండో ఉపగ్రహం ఐఆర్ఎన్ఎస్ఎస్-1బీని ఏప్రిల్ 4న ప్రయోగించారు. ఈ వ్యవస్థ ఏర్పాటు పూర్తయితే భారత్‌తోపాటు చుట్టూ 1,500 కి.మీ. దూరం వరకూ ఉపగ్రహ దిక్సూచీ సేవలు (జీపీఎస్) అందుబాటులోకి వస్తాయి. భూమి, జల, వాయు మార్గాల స్థితిగతులు, దిక్కులు తెలియజేయడం, విపత్తుల సమయాల్లో ఆకాశంలో విమానాలకు, సముద్రాల్లో నౌకలకు దిక్సూచిగా ఉపయోగపడడమే కాకుండా ఆండ్రాయిడ్ ఫోన్లలో దిక్సూచి వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. భౌగోళిక సమాచారం, వాహన చోదకులకు దిశానిర్దేశం, సెల్‌ఫోన్‌తో అనుసంధానం లాంటి సౌకర్యాలు అందుతాయి. ఇకపై ఇలాంటి సేవలకు అమెరికా జీపీఎస్‌పై ఆధారపడకుండా సొంత వ్యవస్థతో పొందేందుకు, పొరుగుదేశాలకు అందించేందుకు వీలుంటుంది.
మరో మూడు ప్రయోగాలు: ఇస్రో చైర్మన్
తాజా విజయంతో ఈ ఏడాది ఇప్పటికే నాలుగు విజయాలు దక్కాయి. ఇది సమష్టి విజయం. ఈ ఏడాదిలోనే మరో మూడు ప్రయోగాలకూ సిద్ధమవుతున్నాం. ఇందులో రెండు ప్రయోగాలు షార్ నుంచి, మరో ప్రయోగం ఫ్రాన్స్‌లోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మరో 45 రోజుల్లో కీలకమైన జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగాన్ని షార్ రెండో ప్రయోగవేదిక నుంచి చేపడతాం. డిసెంబర్లో ఐఆర్ఎన్ఎస్ఎస్-1డీ ప్రయోగాన్ని పీఎస్ఎల్వీ సీ27 ద్వారా నింగికి పంపుతాం.
శ్రీవారి సేవలో రాధాకృష్ణన్
సాక్షి, తిరుమల: ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఐఆర్ఎన్ఎస్ఎస్-1సీ ప్రయోగం విజయవంతం అయిన నేపథ్యంలో సతీసమేతంగా ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు.