ప్రయోగానికి సర్వం సిద్ధం
సూళ్లూరుపేట: పీఎస్ఎల్వీ సీ23 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. షార్‌లోని ఒకటో ప్రయోగవేదికపై నుంచి సోమవారం ఉదయం 9.52 గంటలకు ఐదు విదేశీ ఉపగ్రహాలతో రాకెట్ నింగిలోకి దూసుకుపోనుంది. ప్రయోగానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
కౌంట్‌డౌన్ నిర్విఘ్నంగా సాగుతోంది. ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆదివారం సాయంత్రం శ్రీహరికోటకు చేరుకున్నారు. వీరికి షార్ అధికారులు ఘనస్వాగతం పలికారు. ప్రయోగవేది కపై ఉన్న రాకెట్‌ను పరిశీలించిన అనంతరం ప్రయోగ విశేషాలను పీఎం, గవర్నర్, సీఎం తెలుసుకున్నారు. అనంతరం వీరు భాస్కర అతిథి గృహంలో బస చేశారు. దీంతో షార్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పలు విభాగాల సందర్శన
ప్రధాని నరేంద్రమోడీ షార్‌లోని పలు విభాగాలను సందర్శించారు. మొదటి ప్రయోగవేదికపై ప్రయోగానికి సిద్ధంగా ఉన్న పీఎస్ఎల్వీ సీ23 రాకెట్‌ను పరి శీలించారు. అక్కడ నుంచి రెండో ప్రయోగవేదిక అనుసంధానంగా ఉన్న వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్, రెండో ప్రయోగవేదికపై అనుసంధానం పనుల్లో ఉన్న జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్‌ను పరి శీలించారు. మార్క్-3 వివరాలను ప్రధానికి శాస్త్రవేత్తలు వివరించారు. అనంతరం భాస్కర గెస్ట్‌హౌస్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. షార్‌లో ఒకేసారి నాలుగైదు రాకెట్లు గమనాన్ని పరిశీలించే మల్టీ అబ్జెక్టివ్ రాడార్, రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ గురించి షార్ డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ వివరించారు. భవిష్యత్తులో స్పేస్ షటిల్ లాంటి భారీ ప్రయోగాలు చేయాలంటే మూడో ప్రయోగవేదిక అవసరముందని శాస్త్రవేత్తలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాని మాట్లాడుతూ శాస్త్రసాంకేతిక రంగాల్లో మనం ఎంతో పురోగతిని సాధించినప్పటికీ కొన్ని దేశాలతో పొలిస్తే ఇంకా వెనుకబడి వున్నామనిపిస్తోందన్నట్టు తెలిసింది. భారీ ప్రయోగాలకు సిద్ధం కావాలని, భారతజాతికి మరిన్ని సాంకేతిక ఫలా లు అందజేయాలని ఆయన సూచించినట్టు సమాచారం. సమావేశంలో దేశంలోని అన్ని ఇస్రో కేం ద్రాల డెరైక్టర్లు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.