Psycho sudigadu
-
సైకో నీడ.. వదలని పీడ
భీమవరం : సైకో సూదిగాడి పీడ వదల్లేదు. తరచూ ఏదోమూల ఇంజెక్షన్ దాడులు జరిగాయంటూ కలకలం రేగుతూనే ఉంది. ఆగంతకుణ్ణి పట్టుకునేందుకు ఊరూవాడా జల్లెడ పడుతున్నామని.. ఇందుకోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని పోలీసు అధికారులు ప్రకటిస్తున్నారు. ఎక్కడికక్కడ వాహన తనిఖీలు చేయిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతుండటంతోపాటు ఒకదాని వెనుక ఒకటిగా సైకో ఊహాచిత్రాలు.. వివిధచోట్ల సీసీ టీవీల్లో రికార్డైన పుటేజీలు విడుదల చేస్తున్నారు. మొదటి రోజుల్లో నమోదైనవి మాత్రమే సూదిగాడి ఇంజెక్షన్ దాడులని.. ఆ తరువాత జరిగినవన్నీ వదంతులతో కూడిన ఉత్తుత్తి దాడులేనని చెప్పుకొస్తున్నారు. ఇంజెక్షన్ దాడుల కవరేజీ విషయంలో మీడియా సంయమనం పాటించాలని.. ఇలాంటి ఘటనలకు విస్తృత ప్రచారం కల్పించవద్దని ప్రకటనలు సైతం జారీ చేస్తున్నారు. ఏదిఏమైనా సూదిగాడిని పట్టుకునేందుకు పోలీస్ యంత్రాంగం యావత్తు కదన రంగంలోకి దూకింది. అయినా ఆగంతకుడి ఆచూకీని పసిగట్టలేకపోవడంతో పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపడంతోపాటు ఎక్కడికక్కడ తనిఖీలు.. ఉన్నతాధికారుల సమీక్షలు చేస్తున్నా ప్రయోజనం లేకపోవడం పోలీస్ శాఖకు సవాల్‌గా మారింది. -
అన్నవరంలో సైకో సూదిగాడు కలకలం
అన్నవరం (జగ్గయ్యపేట): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైకో సూదిగాడు సోమవారం రాత్రి గ్రామానికి వచ్చాడంటూ వదంతులు రావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 10 గంటల సమయంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక వ్యక్తి ద్విచక్రవాహనంపై గ్రామానికి వచ్చాడు. ప్రధాన సెంటర్లో కొందరికి అతడిపై అనుమానం రావడంతో వాహనాన్ని ఆపడానికి యత్నించడంతో ఆపకుండా వెళ్ళిపోయాడు. దీంతో గ్రామస్తులు అతడి వాహనాన్ని పట్టుకునేందుకు పరుగులు తీశారు. ఈ విషయాన్ని చిల్లకల్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యస్.ఐ షణ్ముఖసాయి సిబ్బందితో వచ్చి వెంబడించారు. చివరకు అతను బలుసుపాడు సమీపంలో అతన్ని పట్టుకుని వివరాలు అడుగగా తనది తెలంగాణ రాష్ట్రం అని, కాపుసారా అమ్ముకునేందుకు వచ్చానని చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. గ్రామ సమీపంలోని అనుమాననాస్పదంగా ఉన్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.