Psychology counselor
-
30లో ప్రెగ్నెన్సీ ప్లాన్,బీపీ, షుగర్ రిస్క్.. మరి పెళ్లికి సరైన వయసేది?
మా అమ్మాయికి 22 ఏళ్లు. ఇంజినీరింగ్ అయిపోయి ఈమధ్యనే ఉద్యోగంలో చేరింది. పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. కానీ తను ఇంకో అయిదేళ్ల దాకా పెళ్లి ప్రసక్తి తేవద్దంటోంది. పిల్ల మొండితనం వల్ల పెళ్లికి మరీ ఆలస్యం అవుతుందేమోనని చింతగా ఉంది. ఆడపిల్ల పెళ్లికి సరైన వయసేదో సూచించగలరా? – చల్లపల్లి వింధ్యాకిరణ్, హోస్పేట్ ఈరోజుల్లో ఉన్నత చదువుల కోసం ప్రతి ఆడపిల్లా ప్రయత్నిస్తోంది. దాంతో వ్యక్తిగత శ్రద్ధ, బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండట్లేదు. దీనివల్ల పెళ్లి, పిల్లలు అన్నీ ఆలస్యం అవుతున్నాయి. ఈ క్రమంలో చాలాసార్లు 35 ఏళ్లు దాటిన తరువాత ప్రెగ్నెన్సీస్‌ని చూస్తున్నాం. అలాగని ఎర్లీ మ్యారెజెస్ ఏమీ విజయవంతం కావడంలేదు. వాటిల్లో విడాకులనూ చూస్తున్నాం. అందుకని పెళ్లికి సరైన వయసు ఇదని చెప్పడం కష్టమే మరి! ఈ రెండు పారామీటర్స్‌ని దృష్టిలో పెట్టుకుని 28 –32 ఏళ్ల మధ్య వయసు పెళ్లికి బెస్ట్ వయసుగా కొన్ని రీసెర్చ్ పేపర్స్ చెబుతున్నాయి. ఈ వయసుకి ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ మెంటల్ ఎబిలిటీ వస్తుంది. ఈ వయసులో ట్రామా, స్ట్రెస్, ఎమోషనల్, ఫిజికల్, మెంటల్ బ్యాలెన్స్, కమ్యూనికేషన్ చక్కగా ఉంటాయి. మనం ఏం చేయాలి?మనకేం కావాలి? అనే విషయాల్లో స్పష్టంగా ఉంటారు. అమ్మాయికి 30 ఏళ్లు దాటినప్పటి నుంచి నేచురల్ లేదా స్పాంటేనియస్ ప్రెగ్నెన్సీ చాన్సెస్ తగ్గుతుంటాయి. జీవనశైలిలో మార్పుల వల్ల చాలామంది అమ్మాయిల్లో అండాల నాణ్యతా తగ్గిపోతోంది. ఏఎమ్‌హెచ్ అనే టెస్ట్‌తో దీన్ని కనిపెట్టవచ్చు. 30 –35 ఏళ్లలో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బీపీ, సుగర్ వచ్చే చాన్సెస్ పెరుగుతాయి. లేట్ మ్యారేజెస్ .. ఇండైరెక్ట్‌గా లేట్ ప్రెగ్నెన్సీస్ వల్ల మెడికల్ కాంప్లికేషన్స్ పెరుగుతాయి. కాబట్టి 28 – 30 ఏళ్ల మధ్యలో పెళ్లిని ప్లాన్ చేసుకుంటే ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. అలాగే భవిష్యత్‌లో ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కూడా తక్కువగా ఉంటాయి. డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
''నువ్వెలా పుట్టావే మాకు.. బొత్తిగా తెలివితేటల్లేవు, మార్కులు రావు''
లాలస పదో తరగతి చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. లాలసకు చిన్నప్పటి నుంచీ మంచి మార్కులు వచ్చేవి కావు. దాంతో పేరెంట్స్ చాలా ఆందోళన చెందేవారు. స్కూళ్లు మాన్పించినా, ట్యూషన్లు పెట్టించినా లాలస మార్కుల్లో ఎలాంటి మార్పూ లేదు. దాంతో ‘నువ్వెలా పుట్టావే మాకు.. బొత్తిగా తెలివితేటల్లేవు, మార్కులు రావు’ అని విమర్శిస్తుండేవారు. ఇప్పుడు పదో తరగతిలో కూడా అవే మార్కులు వస్తే కష్టమని, స్నేహితుల సలహా మేరకు కౌన్సెలింగ్‌కి తీసుకువచ్చారు. లాలస పేరెంట్స్‌తో మాట్లాడిన తర్వాత.. వారు ఫిక్స్డ్ మైండ్‌సెట్‌తో ఉన్నారని, లాలసపై కూడా అదే రుద్దారని అర్థమైంది. తెలివితేటలు, సామర్థ్యం పుట్టుకతో వస్తాయని, వాటిని ఎప్పటికీ అభివృద్ధి చేసుకోలేరని నమ్మడమే ఫిక్స్డ్ మైండ్‌సెట్. ఈ మైండ్‌సెట్ ఉన్నవారు ఒకట్రెండు సార్లు ఫెయిలయితే జీవితమంతా ఫెయిల్యూరేనని భావిస్తారు. ఇతరులు ఏమనుకుంటారోనని ఆందోళన చెందుతారు. పేరెంట్స్, టీచర్స్ ప్రభావమే ఎక్కువ పిల్లలకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే ప్రాథమిక రోల్ మోడల్స్. వాళ్లు నిరంతరం పేరెంట్స్‌ని గమనిస్తుంటారు. వారి నుంచి మాట, నడక, నడత, ఆలోచన, ప్రవర్తన నేర్చుకుంటారు. పిల్లలందరూ గ్రోత్ మైండ్‌సెట్‌తో, జీనియస్‌లు కాగల సామర్థ్యంతోనే పుడతారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల ఆసక్తిగా ఉంటారు. దాన్నుంచి వీలైనంత ఎక్కువ నేర్చుకోవాలని ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో తప్పులు చేస్తారు.. విఫలమవుతారు. అలాంటి సందర్భాల్లో ఫిక్స్డ్ మైండ్‌సెట్ ఉన్న పేరెంట్స్, టీచర్స్ వారిని తప్పుబడతారు, విమర్శిస్తారు, దండిస్తారు. దాంతో పిల్లలు కూడా అదే ఫిక్స్డ్ మైండ్‌సెట్‌ని అడాప్ట్ చేసుకుంటారు. తమకు పుట్టుకతో తెలివితేటలు లేవని, వాటిని ఇప్పుడు పెంచుకోలేమని నమ్ముతారు, ఉన్నదానితో సర్దుకుపోతారు, కొత్త ప్రయత్నాలు ఆపేస్తారు. లాలాస విషయంలో జరిగింది అదే. ఫిక్స్డ్ మైండ్‌సెట్‌ని అలవరచుకున్న లాలస తన వైఫల్యాలకు పేరెంట్స్‌ని, టీచర్స్ని, స్కూల్‌ని నిందిస్తోంది. పేరెంట్స్ కోరుకున్న మార్కులు సాధించడానికి షార్ట్‌కట్స్ అన్వేషిస్తోంది. మైండ్‌సెట్ మార్చుకోవచ్చు మన జీవితం మొత్తం మైండ్సెట్పైనే ఆధారపడి ఉంటుంది. ఒక పరాజయం ఎదురైనప్పుడు ఫిక్స్డ్ మైండ్‌సెట్ ఉన్నవారు బాధపడతారు, ఏడుస్తారు, డిప్రెషన్లో కూరుకుపోతారు. గ్రోత్ మైండ్‌సెట్ ఉన్నవారు ఆ ఫెయిల్యూర్ నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతారు. ఫిక్స్డ్ మైండ్‌సెట్ ఉన్నవారు ఎప్పుడూ ఇతరుల ఆమోదం కోరతారు. మొబైల్ ఫోన్, మొబైల్ గేమ్స్ లాంటి చిన్న చిన్న విషయాల నుంచి ఆనందం పొందుతూ, దాంతోనే తృప్తిపడతారు. లాలస కూడా అదే చేస్తోంది. అయితే ఈ ఫిక్స్డ్ మైండ్‌సెట్‌ని మార్చవచ్చని, మార్చుకోవచ్చని.. జీనియస్ మైండ్‌సెట్ లేదా గ్రోత్ మైండ్‌సెట్‌ని డెవలప్ చేసుకోవచ్చని ఆమె పేరెంట్స్‌కి వివరించాను. అయితే వెంటనే కౌన్సెలింగ్ మొదలుపెట్టమన్నారు. అది ఒకటి రెండు సెషన్ల కౌన్సెలింగ్‌తో జరిగే పనికాదని, కనీసం ఆరు నెలల పాటు కోచింగ్ అవసరం ఉంటుందని, అందులో పేరెంట్స్ కూడా పనిచేయాలని చెప్పాను. అందుకు వారు సంతోషంగా అంగీకరించారు. జీనియస్ మైండ్‌సెట్ సాధ్యమే జీనియస్ మైండ్‌సెట్ పుట్టుకతో రాదు, పేరెంట్స్ నుంచి నేర్చుకుంటారు. లేదా ప్రత్యేక శిక్షణ ద్వారా నేర్చుకోవచ్చు. జీనియస్ మైండ్‌సెట్ ఉన్న పేరెంట్స్ తమ పిల్లలను ప్రతిదీ ప్రశ్నించమని, నేర్చుకోమని ప్రోత్సహిస్తారు. ఏది అవసరమో, ఏది కోరికో, ఏది తప్పో, ఏది ఒప్పో ఓపిగ్గా వివరిస్తారు. వైఫల్యాలకు తిట్టకుండా వాటి నుంచి పాఠాలు ఎలా నేర్చుకోవాలో, వాటిని సానుకూలంగా ఎలా మార్చుకోవచ్చో నేర్పిస్తారు. ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు కూడా అలాంటి మైండ్‌సెట్‌నే అలవరచుకుంటారు. అందుకే ముందుగా పేరెంట్స్ తమ మైండ్‌సెట్ మార్చుకోవడం ద్వారా పిల్లల మైండ్‌సెట్‌ని మార్చవచ్చు. అలాంటి మైండ్‌సెట్ పేరెంట్స్‌కి కూడా సక్సెస్‌ని, సంతోషాన్ని అందిస్తుంది. జీనియస్ మైండ్‌సెట్ కావాలంటే.. పరిమితులన్నీ మనం సృష్టించుకున్నవేనని అర్థంచేసుకోవాలి, వాటిని బ్రేక్ చేసేందుకు ప్రయత్నించాలి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవాలి, కొత్త మార్గాలను అన్వేషించాలి. ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోకూడదు. మీకు మీరు మాత్రమే పోటీ అని తెలుసుకోవాలి. పరీక్షల కోసం, మార్కుల కోసం కాకుండా లోతుగా అధ్యయనం చేయాలి. జీవితంలో ఎప్పుడూ విజయాలే ఉండవు, పరాజయాలు వస్తాయి. అయితే వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మీకన్నా ప్రతిభావంతులైన వ్యక్తులతో కాలం గడపండి.. వారి నుంచి నేర్చుకోండి. ఏ విషయంలోనైనా మీ స్ట్రాటజీ పనిచేయకపోతే దాన్ని పక్కన పెట్టేసి కొత్త వ్యూహంతో ముందుకు సాగండి. --సైకాలజిస్ట్ విశేష్ -
రాంబాబు.. ముగ్గురితో పెళ్లిళ్లు, విడాకులు.. విషయం ఏంటంటే..
ప్రస్తుతమున్న ఉరుకుల పరుగుల జీవితంలో ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ముఖ్యమో, మెంటల్ బ్యాలెన్స్ కూడా అంతే ముఖ్యం. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్నవాళ్లు తమ సమస్యలను పంచుకున్నా ఇదేమంత సమస్య కాదులే అని కొట్టిపారేస్తాం. మరికొన్ని సార్లు దాన్ని అసలు సమస్యగా కూడా గుర్తించం. అలాంటి వాటిలో బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ కూడా ఒకటి. రాంబాబు ప్రవర్తన చిన్నప్పటినుంచి భిన్నంగా ఉండేది. దాంతో ‘మావాడు కొంచెం తేడాలే, వాడికి తిక్క ఎక్కువ’ అని కుటుంబ సభ్యులే అంటుండేవారు. సరిగా చదవడం లేదని.. మందలించారని ఇంటర్మీడియట్లో ఆత్మహత్యాప్రయత్నం చేశాడు. సకాలంలో చూసి కాపాడారు. కొన్నాళ్లు హుషారుగా ఉంటే, మరికొన్నాళ్లు దిగులుగా గదికే పరిమితమయ్యేవాడు. పాతికేళ్ల వయసులో నీరజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు. వద్దంటే ఏం చేసుకుంటాడోనని ఇంట్లో ఒప్పుకున్నారు. కానీ అతని మూడ్ స్వింగ్స్‌ని, కోపాన్ని భరించలేక ఏడాదికే నీరజ పుట్టింటికి చేరింది. ఆమెకు విడాకులిచ్చాక రేణుకను పెళ్లి చేసుకుని ఇద్దరు బిడ్డల్ని కన్నాడు. పదేళ్ల తర్వాత ఆమెకు విడాకులిచ్చి అనూషను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు బిడ్డలు పుట్టాక ఆమెనూ వదిలేశాడు. బాగా నడుస్తున్న వ్యాపారాన్ని పక్కనపెట్టి రియల్ ఎస్టేట్ బిజినెస్‌లోకి దిగి భారీగా నష్టపోయాడు. దాంతో విపరీతమైన ఫ్రస్ట్రేషన్‌తో ఇంట్లో అరుస్తుండేవాడు. రాంబాబు బాధ చూడలేక, పడలేక అతని పేరెంట్స్ ఫోన్ చేసి సమస్యను వివరించారు. అతని సహకారం లేకుండా ఏమీ చేయలేమని చెప్పాక, నచ్చజెప్పి కౌన్సెలింగ్‌కి తీసుకువచ్చారు. మొదటి సెషన్లో అతనితో మాట్లాడాక, సైకో డయాగ్నసిస్ అనంతరం బార్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ (బీపీడీ)తో బాధపడుతున్నాడని నిర్ధారణైంది. బాధాకరమైన బాల్యం బీపీడీ సాధారణంగా యుక్తవయస్సులో ప్రారంభమవుతుంది. పెరిగిన వాతావరణం, ఎదుర్కొన్న వ్యక్తులు, పర్యావరణ పరిస్థితులు వంటివి బీపీడీకి దారితీసే అవకాశం ఉంది. ఇది జన్యుపరమైన సమస్య. కుటుంబంలో ఎవరైనా ఇలాంటి మానసిక సమస్యల బారిన పడినవారు ఉంటే వంశపారంపర్యంగా రావచ్చు. బాల్యంలో చూసిన, అనుభవించిన బాధాకరమైన సంఘటనలు ఈ రుగ్మతను మరింత ఎక్కువ చేస్తాయి. బీపీడీ ఉన్న వ్యక్తుల్లో 70శాతం మంది బాల్యంలో లైంగిక, భావోద్వేగ, శారీరక వేధింపులను అనుభవించి ఉంటారు. తల్లిదండ్రులతో సరైన అనుబంధం లేకపోవడం, కఠినమైన నిబంధనలు, కుటుంబంలో ఆల్కహాల్ వినియోగం కూడా కారణాలై ఉంటాయి. బీపీడీ ఉన్నవారి మెదడులో భావోద్వేగాలు, ప్రవర్తనను నియంత్రించే భాగాలు సరిగా కమ్యూనికేట్ చేయవు. అది మెదడు పని విధానాన్ని ప్రభావితం చేస్తుంది. నాటకీయ ప్రవర్తన, అస్థిర బంధాలు బీపీడీ వ్యక్తిత్వసంబంధమైన ఒక మానసిక రుగ్మత. విపరీతమైన మూడ్ స్వింగ్స్, మానవ సంబంధాల్లో అస్థిరత, ఇంపల్సివిటీ దీని ప్రధాన లక్షణాలు. మీ గురించి మీకు ఎలా అనిపిస్తుంది, మీరు ఇతరులతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారనేదాన్ని ప్రభావితం చేస్తుంది. తాను ప్రేమించిన వ్యక్తులు తనను నిర్లక్ష్యం చేస్తున్నారని, విడిచిపెడతారని భావిస్తుంటారు. అలాంటప్పుడు వారిని ట్రాక్ చేస్తారు. ఆ వ్యక్తికి దగ్గరగా ఉండేందుకు అందరినీ దూరంగా ఉంచుతారు. తిరస్కరణ, నిర్లక్ష్యం ఎదురైనప్పుడు స్వీయ హాని, బెదిరింపులు, ఆత్మహత్య ఆలోచనలు ఉండవచ్చు. ఇతరులపై తమ అభిప్రాయాలను ఆకస్మికంగా, నాటకీయంగా మార్చుకుంటారు. దీనివల్ల స్నేహాలు, వివాహాలు, కుటుంబ సభ్యులతో సంబంధాలు తరచుగా అస్తవ్యస్తంగా, అస్థిరంగా ఉంటాయి. వారి గురించి వారికే సరైన ఇమేజ్ ఉండదు. దానివల్ల తరచూ గిల్టీగా ఫీలవుతుంటారు. తనను తానే చెడుగా చూస్తారు. వృత్తిని, లక్ష్యాలను, స్నేహితులను అకస్మాత్తుగా మార్చడం ద్వారా తమ సెల్ఫ్ ఇమేజ్‌ని మార్చి చూపించాలని ప్రయత్నిస్తారు. అదుపు చేసుకోలేని కోపం, భయం, ఆందోళన, ద్వేషం, విచారం, ప్రేమ తరచుగా, వేగంగా మారతాయి. కోపాన్ని నియంత్రించుకోలేక వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు. ఈ మూడ్ స్వింగ్స్ కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకూ ఉంటాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఫైటింగ్, జూదం, డ్రగ్స్ వినియోగం, అతిగా తినడం, అసురక్షిత లైంగిక కార్యకలాపాలు సాధారణం. విచారంగా, విసుగుగా, శూన్యతగా భావిస్తారు. విపరీతమైన ఒత్తిడి ఎదురైనప్పుడు మతిస్థిమితం లేని ఆలోచనలు, కొన్నిసార్లు భ్రాంతులు ఉంటాయి. ఒంటరిగా వదిలేయొదు. బీపీడీలాంటి వ్యక్తిత్వ రుగ్మతలను ఎవరికి వారు గుర్తించలేరు. స్నేహితులో, సన్నిహితులో, కుటుంబ సభ్యులో గుర్తించాలి. మీకు తెలిసిన వారిలో బీపీడీ లక్షణాలు కనిపించినప్పుడు ఒంటరిగా వదిలేయకుండా సైకాలజిస్టును సంప్రదించండి. సైకో డయాగ్నసిస్ ద్వారా రుగ్మతను నిర్ధారిస్తారు. చికిత్సకు ఏడాదికి పైగా సమయం పట్టవచ్చు. అందువల్ల సహకారం, సహనం, నిబద్ధత అవసరం. · కౌన్సెలింగ్, సైకోథెరపీ ద్వారా చికిత్స ఉంటుంది. అవసరమైన సందర్భాల్లో మందులు వాడాల్సి ఉంటుంది. మీ భద్రత ప్రమాదంలో ఉంటే ఆస్పత్రిలో చేరాల్సి రావచ్చు. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, డయలెక్టిక్ బిహేవియర్ థెరపీ, స్కీమా ఫోకస్డ్ థెరపీ, సైకోడైనమిక్ సైకోథెరపీ లాంటివి బీపీడీ చికిత్సలో ఉపయోగపడతాయి. భావోద్వేగాలను నియంత్రించుకోవడం, బాధలను తట్టుకోవడం, సంబంధాలను మెరుగుపరచుకోవడం ఎలాగో నేర్పుతాయి. ప్రతికూల జీవన విధానాలకు దారితీసిన పరిస్థితులను గుర్తించి, సానుకూల జీవన విధానాలను ప్రోత్సహిస్తాయి. -
ఫస్ట్ ర్యాంకు రావాలా?! ప్రణాళిక తప్పనిసరి
13-19 కేరెంటింగ్ అందరూ ఆ దశను దాటి వచ్చినవారే! అందరూ ఆ దశను అర్థం చేసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేసేవారే! ఎందుకలా?! జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల కౌమార దశను అర్థం చేసుకునేదెలా? సరైన మార్గం చూపేదెలా?! ఆ మార్గం చూపే ప్రయత్నమే ఈ 13-19... కిరణ్‌కి క్రికెట్ అంటే చాలా ఇష్టం. క్రికెట్ ప్రసారం అయ్యే సమయంలో టీవీకి అతుక్కుపోయి చుట్టూ ఉన్న ప్రపంచం మర్చిపోతాడు. పదవ తరగతి హాఫ్ ఇయర్లీలో మంచి మార్కులు వచ్చినా, ప్రీ ఫైన ల్లో అన్నీ సబ్జక్టులూ ఫెయిలయ్యాడు. తల్లిదండ్రులు భయపడిపోయారు. పదవ తరగతి ఫెయిలైతే ఇక భవిష్యత్తు ఎలా? అని ఆలోచించి ఒక సైకాలజీ కౌన్సిలర్ వద్దకు తీసుకెళ్లారు. ‘‘నీకు క్రికెట్ ఆట మీద చక్కని అవగాహన ఉంది కదా! ఈసారి కప్ ఎవరికి వస్తుందో తెలుసా?’ అనడిగాడు కౌన్సిలర్. అక్షరాలా ఆ అబ్బాయి ఊహించిన టీమే వరల్డ్ కప్ సాధించింది. జ్ఞానాన్ని బదిలీ చేయవచ్చు... సైకాలజీలో ‘ట్రాన్స్ఫర్ ఆఫ్ ట్రైనింగ్’ అనే అధ్యాయం ఉంది. అంటే మనకు తెలిసిన ఒక సబ్జక్టులోని జ్ఞానాన్ని మరొక సబ్జక్టులోకి బదిలీ చేయవచ్చు. ఉదాహరణకు సైకిల్ నేర్చుకున్న అబ్బాయి మోటార్‌సైకిల్ సునాయాసంగా నేర్చుకోగలడు. తెలుగు బాగా చదివే అబ్బాయి కన్నడ భాష కూడా త్వరగా నేర్చుకోగలడు. అదే విషయాన్ని కౌన్సిలర్ ఆ అబ్బాయికి చెప్పి, క్రికెట్ మీద ఉన్న జ్ఞానాన్ని చదువు మీదకు మళ్లించేలా కొన్ని సజెషన్లు ఇచ్చారు. సహజంగా తెలివైనవాడు కావటం, వ్యూహ ప్రతివ్యూహాలు గుర్తించగలిగే ప్రజ్ఞ ఉండటంతో త్వరగానే నేర్చుకున్నాడు. కిరణ్‌కి పరీక్షల ప్రణాళికలను ఇలా తయారు చే సి ఇచ్చారు కౌన్సిలర్ - 1. ప్రణాళిక, పరీక్షల తేదీలు; 2. చదువుకునే సమయం; 3. సబ్జక్టులు చదివే క్రమం (కష్టమైనవి ముందు చదవాలి); 4. వివరణలు - విశ్లేషణలు (తెలియని విషయాలు టీచర్లను అడిగి తెలుసుకోవాలి); 5. కొండగుర్తులు, బండగుర్తులు లాంటివి బట్టీ పట్టవచ్చు. (ఉదా: యమాతారాజభానస, నజభజజజర); 6. పద్యాలు, పెద్దల నిర్వచనాలు (డెఫినిషన్స్) బట్టీ పట్టాలి; 7.ప్రశ్నలు - సమాధానాలు బట్టీ పట్టకూడదు; 8. ఒక్క ప్రశ్నను ఎన్ని కోణాల్లో అడగవచ్చో విశ్లేషించుకోవాలి. ఉదాహరణకు (్చ+ఛ)2 ఎంత అని అడగవచ్చు. లేదా ్చ2+ఛ2+2్చఛ=? అని కూడా అడగవచ్చు. రెండేళ్ల క్రితం ఇంటర్మీడియట్ ఫిజిక్స్‌లో ప్రశ్నలు కొంచెం మార్చి ఇవ్వటంలో ప్రశ్నలను బట్టీ పట్టినవారు ఖంగుతిన్నారు. 9. ప్రతి ప్రశ్నకూ సమాధానం చదివి దానిలోని ‘కీపాయింట్స్’ని ప్రత్యేకంగా నోట్సులో రాసుకోవాలి. వీటినే బులెట్ పాయింట్స్ అంటారు. కుల పరమైనవి మత పరమైనవి ప్రాంతీయ పరమైనవి నిరక్షరాస్యత మహిళల స్థితిగతులు బాలల హక్కులు- బాలకార్మికులు చట్టం - సమాజం అవినీతి పరులు ఈ పాయింట్స్‌ని బాగా వివరించి సొంతంగా రాయాలి. ఉదాహరణకు అవినీతి అంటే అందులో లంచగొండులు, అవినీతిపరులు, మాదకద్రవ్యాలు అమ్మేవారు, స్మగ్లింగ్ చేసేవారు, నేరాలు చేసేవారు.. ఇలా మీరు అనేక విషయాలు రాయవచ్చు. రోజూ పేపర్ చదివితే ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉంటాయి. ఆ తాజా ఉదాహరణలు రాస్తే, పేపరు దిద్దే వారికి కూడా అభ్యర్థిపై అభిమానం కలుగుతుంది. 10. స్వయం పరీక్ష: చాలామంది స్టూడెంట్స్ పరీక్ష రాయబోయే ముందు కూడా గబగబా చదివేస్తూ ఉంటారు. ఆటోల్లో, బస్సులో, చెట్ల క్రింద నాన్‌స్టాప్‌గా చదువుతారు. ఇది నిరర్థక విజయం సాధించటం లాంటిదే. చదివిన ఆ విషయాలు అప్పటికి మాత్రమే గుర్తుంటాయి. అందుకే దీనిని విరుగుడు స్వయంపరీక్ష అంటారు. అంటే ఇంట్లో చదివిన తరువాత, బాగా మననం చేసుకుని, పేపరుమీద ముఖ్యాంశాలు రాసుకోవాలి. అంటే టీవీలో న్యూస్ చదివేవారు ముందుగా ముఖ్యాంశాలు చెప్తారు తరువాత వివరాల్లోకి వెళ్తారు. అలాగే మీరు కూడా ముఖ్యాంశాలను పేపరు మీద రాయాలి. 11.ఒత్తిడి నిర్వహణ: ఇది చాలా అవసరం. పరీక్షలంటే ఒత్తిడి కొంచెం ఉండాలి. అది మరీ ఎక్కువ కాకుండా జాగ్రత్త పడాలి. అందుకు రోజూ ఉదయం పది నిమిషాల పాటు వజ్రాసనంలో కూర్చొని ప్రాణాయామం లాంటి సాధన చేస్తే చాలు. ఇది మీ టీచర్లు లేదా పెద్దలను ఎవరిని అడిగినా చెప్పగలరు. పరీక్షల టెన్షన్ విడిచిపెట్టి ఇంట్లో వాళ్లతో సరదాగా కబుర్లు చెప్పాలి. నవ్వుతూ ఉండాలి. అలాగని చెప్పి టీవీలు, ఫోను కబుర్లు వద్దు. వీలైతే సుడోకు, రూబిక్స్క్యూబ్ లాంటివి చేయవచ్చు. దీనివల్ల రివిజన్ సామర్థ్యం పెరుగుతుంది. ఇవి చాలా మంచి ఫలితాలనిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. 12. పాజిటివ్ థింకింగ్: ఇది అత్యవసరం. అన్నీ బాగా జరుగుతాయి. అన్నీ మంచి శకునములే అంటూ సానుకూల వైఖరిని అలవాటు చేసుకోవాలి. అంటే ‘నేను పదవతరగతి ఫస్ట్ ర్యాంకులో పాసవుతాను’ అని కాకుండా లక్ష్యాన్ని పొడిగించి సజెషన్లు ఇచ్చుకోవాలి. అంటే నేను గొప్ప డాక్టర్ని అవుతాను, గొప్ప ఇంజనీరు, గొప్ప సైంటిస్టు, గొప్ప చార్టర్డ్ అకౌంటెంట్ అవుతాను... అనుకోవాలి. అలా అనుకున్నప్పుడు ఆటోమేటిగ్గా పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ అన్నీ అందులో వచ్చేస్తాయి. దీనికో కథ ఉదాహరణగా తీసుకోవచ్చు. ఒక నిరుపేద జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకోవాలని అడవికి వెళ్లాడు. ఆ విషయం తెలుసుకున్న ఒక మునీశ్వరుడు ‘‘మూర్ఖుడా! ఆత్మహత్య అనేది బలహీనత. తాత్కాలిక సమస్యని వదిలించుకునే శాశ్వత పరిష్కారం. ఆత్మహత్య చేసుకోవటానికి చాలా ధైర్యం కావాలి. నువ్వు భగవంతుడిని ప్రార్థించు నీ కష్టాలు తొలగిపోతాయి’’ అని సలహా ఇచ్చాడు. ‘‘అయ్యా నాకున్నది ఒక కష్టం కాదు. మూడు కష్టాలున్నాయి. మొదటిది పేదరికం. రెండవది నా భార్య ఆరోగ్యం బాగా లేదు. మూడవది నాకు పిల్లలు లేరు. దేవుడిని ఏ కోరిక కోరాలి?’’ అన్నాడు. ‘‘ముందు, ఏకాగ్రతతో ప్రార్థించు. తరువాత ఆలోచనలు అవే వస్తాయి’’ అన్నాడు మునీశ్వరుడు. ‘‘సరే’’నని తపస్సు ప్రారంభించాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ‘‘నీకు ఒక్కటే వరం ఇస్తాను. ఏది కావాలో కోరుకో’’ అన్నాడు. ఏకాగ్రతతో తపస్సు చేయడంలో చక్కని ఆలోచన వచ్చింది. ‘‘దేవుడా! నా భార్య తన మనవడిని బంగారు ఊయలలో ఊపేలా ఆశీర్వదించండి’’ అనడిగాడు. సరేనన్నాడు దేవుడు. విద్యార్థులంతా ఈ కథ ద్వారా గమనించాల్సింది ఏంటంటే.. ఆ ఒక్క కోరికలోనే మూడు కోరికలు కలిసి ఉన్నాయి అనే విషయం. మీ లక్ష్యం కూడా అలాగే ఉండాలి. ఈ ప్రణాళికను పాటించి, పదవ తరగతిలో ఫస్ట్ క్లాస్‌లో రాణించిన కిరణ్ ఇప్పుడు వరంగల్‌లో ‘ఎన్ఐటి’ కళాశాలలో ఉన్నత చదువులు చదువుతున్నాడు. - డా.బి.వి.పట్టాభిరామ్, సైకాలజిస్ట్, bvpattabhiram@yahoo.com ఫోన్: 040-23233232, 23231123