ప్రస్తుతమున్న ఉరుకుల పరుగుల జీవితంలో ఫిజికల్ ఫిట్‌నెస్ ఎంత ముఖ్యమో, మెంటల్ బ్యాలెన్స్ కూడా అంతే ముఖ్యం. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్నవాళ్లు తమ సమస్యలను పంచుకున్నా ఇదేమంత సమస్య కాదులే అని కొట్టిపారేస్తాం. మరికొన్ని సార్లు దాన్ని అసలు సమస్యగా కూడా గుర్తించం. అలాంటి వాటిలో బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ కూడా ఒకటి.
రాంబాబు ప్రవర్తన చిన్నప్పటినుంచి భిన్నంగా ఉండేది. దాంతో ‘మావాడు కొంచెం తేడాలే, వాడికి తిక్క ఎక్కువ’ అని కుటుంబ సభ్యులే అంటుండేవారు. సరిగా చదవడం లేదని.. మందలించారని ఇంటర్మీడియట్‌లో ఆత్మహత్యాప్రయత్నం చేశాడు. సకాలంలో చూసి కాపాడారు. కొన్నాళ్లు హుషారుగా ఉంటే, మరికొన్నాళ్లు దిగులుగా గదికే పరిమితమయ్యేవాడు. పాతికేళ్ల వయసులో నీరజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు. వద్దంటే ఏం చేసుకుంటాడోనని ఇంట్లో ఒప్పుకున్నారు. కానీ అతని మూడ్ స్వింగ్స్‌ని, కోపాన్ని భరించలేక ఏడాదికే నీరజ పుట్టింటికి చేరింది. ఆమెకు విడాకులిచ్చాక రేణుకను పెళ్లి చేసుకుని ఇద్దరు బిడ్డల్ని కన్నాడు.
పదేళ్ల తర్వాత ఆమెకు విడాకులిచ్చి అనూషను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు బిడ్డలు పుట్టాక ఆమెనూ వదిలేశాడు. బాగా నడుస్తున్న వ్యాపారాన్ని పక్కనపెట్టి రియల్ ఎస్టేట్ బిజినెస్‌లోకి దిగి భారీగా నష్టపోయాడు. దాంతో విపరీతమైన ఫ్రస్ట్రేషన్‌తో ఇంట్లో అరుస్తుండేవాడు. రాంబాబు బాధ చూడలేక, పడలేక అతని పేరెంట్స్ ఫోన్ చేసి సమస్యను వివరించారు. అతని సహకారం లేకుండా ఏమీ చేయలేమని చెప్పాక, నచ్చజెప్పి కౌన్సెలింగ్‌కి తీసుకువచ్చారు. మొదటి సెషన్‌లో అతనితో మాట్లాడాక, సైకో డయాగ్నసిస్ అనంతరం బార్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ (బీపీడీ)తో బాధపడుతున్నాడని నిర్ధారణైంది.
బాధాకరమైన బాల్యం
బీపీడీ సాధారణంగా యుక్తవయస్సులో ప్రారంభమవుతుంది. పెరిగిన వాతావరణం, ఎదుర్కొన్న వ్యక్తులు, పర్యావరణ పరిస్థితులు వంటివి బీపీడీకి దారితీసే అవకాశం ఉంది.
- ఇది జన్యుపరమైన సమస్య. కుటుంబంలో ఎవరైనా ఇలాంటి మానసిక సమస్యల బారిన పడినవారు ఉంటే వంశపారంపర్యంగా రావచ్చు.
- బాల్యంలో చూసిన, అనుభవించిన బాధాకరమైన సంఘటనలు ఈ రుగ్మతను మరింత ఎక్కువ చేస్తాయి.
- బీపీడీ ఉన్న వ్యక్తుల్లో 70శాతం మంది బాల్యంలో లైంగిక, భావోద్వేగ, శారీరక వేధింపులను అనుభవించి ఉంటారు.
- తల్లిదండ్రులతో సరైన అనుబంధం లేకపోవడం, కఠినమైన నిబంధనలు, కుటుంబంలో ఆల్కహాల్ వినియోగం కూడా కారణాలై ఉంటాయి.
- బీపీడీ ఉన్నవారి మెదడులో భావోద్వేగాలు, ప్రవర్తనను నియంత్రించే భాగాలు సరిగా కమ్యూనికేట్ చేయవు. అది మెదడు పని విధానాన్ని ప్రభావితం చేస్తుంది.
నాటకీయ ప్రవర్తన, అస్థిర బంధాలు
బీపీడీ వ్యక్తిత్వసంబంధమైన ఒక మానసిక రుగ్మత. విపరీతమైన మూడ్ స్వింగ్స్, మానవ సంబంధాల్లో అస్థిరత, ఇంపల్సివిటీ దీని ప్రధాన లక్షణాలు. మీ గురించి మీకు ఎలా అనిపిస్తుంది, మీరు ఇతరులతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారనేదాన్ని ప్రభావితం చేస్తుంది.
- తాను ప్రేమించిన వ్యక్తులు తనను నిర్లక్ష్యం చేస్తున్నారని, విడిచిపెడతారని భావిస్తుంటారు. అలాంటప్పుడు వారిని ట్రాక్ చేస్తారు. ఆ వ్యక్తికి దగ్గరగా ఉండేందుకు అందరినీ దూరంగా ఉంచుతారు.
- తిరస్కరణ, నిర్లక్ష్యం ఎదురైనప్పుడు స్వీయ హాని, బెదిరింపులు, ఆత్మహత్య ఆలోచనలు ఉండవచ్చు.
- ఇతరులపై తమ అభిప్రాయాలను ఆకస్మికంగా, నాటకీయంగా మార్చుకుంటారు. దీనివల్ల స్నేహాలు, వివాహాలు, కుటుంబ సభ్యులతో సంబంధాలు తరచుగా అస్తవ్యస్తంగా, అస్థిరంగా ఉంటాయి.
- వారి గురించి వారికే సరైన ఇమేజ్ ఉండదు. దానివల్ల తరచూ గిల్టీగా ఫీలవుతుంటారు. తనను తానే చెడుగా చూస్తారు. వృత్తిని, లక్ష్యాలను, స్నేహితులను అకస్మాత్తుగా మార్చడం ద్వారా తమ సెల్ఫ్ ఇమేజ్‌ని మార్చి చూపించాలని ప్రయత్నిస్తారు.
- అదుపు చేసుకోలేని కోపం, భయం, ఆందోళన, ద్వేషం, విచారం, ప్రేమ తరచుగా, వేగంగా మారతాయి. కోపాన్ని నియంత్రించుకోలేక వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు. ఈ మూడ్ స్వింగ్స్ కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకూ ఉంటాయి.
- నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఫైటింగ్, జూదం, డ్రగ్స్ వినియోగం, అతిగా తినడం, అసురక్షిత లైంగిక కార్యకలాపాలు సాధారణం. విచారంగా, విసుగుగా, శూన్యతగా భావిస్తారు.
- విపరీతమైన ఒత్తిడి ఎదురైనప్పుడు మతిస్థిమితం లేని ఆలోచనలు, కొన్నిసార్లు భ్రాంతులు ఉంటాయి.
- ఒంటరిగా వదిలేయొదు.
- బీపీడీలాంటి వ్యక్తిత్వ రుగ్మతలను ఎవరికి వారు గుర్తించలేరు. స్నేహితులో, సన్నిహితులో, కుటుంబ సభ్యులో గుర్తించాలి. మీకు తెలిసిన వారిలో బీపీడీ లక్షణాలు కనిపించినప్పుడు ఒంటరిగా వదిలేయకుండా సైకాలజిస్టును సంప్రదించండి.
- సైకో డయాగ్నసిస్ ద్వారా రుగ్మతను నిర్ధారిస్తారు. చికిత్సకు ఏడాదికి పైగా సమయం పట్టవచ్చు. అందువల్ల సహకారం, సహనం, నిబద్ధత అవసరం.
- · కౌన్సెలింగ్, సైకోథెరపీ ద్వారా చికిత్స ఉంటుంది. అవసరమైన సందర్భాల్లో మందులు వాడాల్సి ఉంటుంది. మీ భద్రత ప్రమాదంలో ఉంటే ఆస్పత్రిలో చేరాల్సి రావచ్చు.
- కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, డయలెక్టిక్ బిహేవియర్ థెరపీ, స్కీమా ఫోకస్డ్ థెరపీ, సైకోడైనమిక్ సైకోథెరపీ లాంటివి బీపీడీ చికిత్సలో ఉపయోగపడతాయి.
- భావోద్వేగాలను నియంత్రించుకోవడం, బాధలను తట్టుకోవడం, సంబంధాలను మెరుగుపరచుకోవడం ఎలాగో నేర్పుతాయి. ప్రతికూల జీవన విధానాలకు దారితీసిన పరిస్థితులను గుర్తించి, సానుకూల జీవన విధానాలను ప్రోత్సహిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment