లాలస పదో తరగతి చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. లాలసకు చిన్నప్పటి నుంచీ మంచి మార్కులు వచ్చేవి కావు. దాంతో పేరెంట్స్ చాలా ఆందోళన చెందేవారు. స్కూళ్లు మాన్పించినా, ట్యూషన్లు పెట్టించినా లాలస మార్కుల్లో ఎలాంటి మార్పూ లేదు. దాంతో ‘నువ్వెలా పుట్టావే మాకు.. బొత్తిగా తెలివితేటల్లేవు, మార్కులు రావు’ అని విమర్శిస్తుండేవారు. ఇప్పుడు పదో తరగతిలో కూడా అవే మార్కులు వస్తే కష్టమని, స్నేహితుల సలహా మేరకు కౌన్సెలింగ్‌కి తీసుకువచ్చారు.
లాలస పేరెంట్స్‌తో మాట్లాడిన తర్వాత.. వారు ఫిక్స్‌డ్ మైండ్‌సెట్‌తో ఉన్నారని, లాలసపై కూడా అదే రుద్దారని అర్థమైంది. తెలివితేటలు, సామర్థ్యం పుట్టుకతో వస్తాయని, వాటిని ఎప్పటికీ అభివృద్ధి చేసుకోలేరని నమ్మడమే ఫిక్స్‌డ్ మైండ్‌సెట్. ఈ మైండ్‌సెట్ ఉన్నవారు ఒకట్రెండు సార్లు ఫెయిలయితే జీవితమంతా ఫెయిల్యూరేనని భావిస్తారు. ఇతరులు ఏమనుకుంటారోనని ఆందోళన చెందుతారు.
పేరెంట్స్, టీచర్స్ ప్రభావమే ఎక్కువ
పిల్లలకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే ప్రాథమిక రోల్ మోడల్స్. వాళ్లు నిరంతరం పేరెంట్స్‌ని గమనిస్తుంటారు. వారి నుంచి మాట, నడక, నడత, ఆలోచన, ప్రవర్తన నేర్చుకుంటారు. పిల్లలందరూ గ్రోత్ మైండ్‌సెట్‌తో, జీనియస్‌లు కాగల సామర్థ్యంతోనే పుడతారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల ఆసక్తిగా ఉంటారు. దాన్నుంచి వీలైనంత ఎక్కువ నేర్చుకోవాలని ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో తప్పులు చేస్తారు.. విఫలమవుతారు. అలాంటి సందర్భాల్లో ఫిక్స్‌డ్ మైండ్‌సెట్ ఉన్న పేరెంట్స్, టీచర్స్ వారిని తప్పుబడతారు, విమర్శిస్తారు, దండిస్తారు.
దాంతో పిల్లలు కూడా అదే ఫిక్స్‌డ్ మైండ్‌సెట్‌ని అడాప్ట్ చేసుకుంటారు. తమకు పుట్టుకతో తెలివితేటలు లేవని, వాటిని ఇప్పుడు పెంచుకోలేమని నమ్ముతారు, ఉన్నదానితో సర్దుకుపోతారు, కొత్త ప్రయత్నాలు ఆపేస్తారు. లాలాస విషయంలో జరిగింది అదే. ఫిక్స్‌డ్ మైండ్‌సెట్‌ని అలవరచుకున్న లాలస తన వైఫల్యాలకు పేరెంట్స్‌ని, టీచర్స్‌ని, స్కూల్‌ని నిందిస్తోంది. పేరెంట్స్ కోరుకున్న మార్కులు సాధించడానికి షార్ట్‌కట్స్ అన్వేషిస్తోంది.
మైండ్‌సెట్ మార్చుకోవచ్చు
మన జీవితం మొత్తం మైండ్‌సెట్‌పైనే ఆధారపడి ఉంటుంది. ఒక పరాజయం ఎదురైనప్పుడు ఫిక్స్‌డ్ మైండ్‌సెట్ ఉన్నవారు బాధపడతారు, ఏడుస్తారు, డిప్రెషన్‌లో కూరుకుపోతారు. గ్రోత్ మైండ్‌సెట్ ఉన్నవారు ఆ ఫెయిల్యూర్ నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతారు. ఫిక్స్‌డ్ మైండ్‌సెట్ ఉన్నవారు ఎప్పుడూ ఇతరుల ఆమోదం కోరతారు. మొబైల్ ఫోన్, మొబైల్ గేమ్స్ లాంటి చిన్న చిన్న విషయాల నుంచి ఆనందం పొందుతూ, దాంతోనే తృప్తిపడతారు. లాలస కూడా అదే చేస్తోంది.
అయితే ఈ ఫిక్స్‌డ్ మైండ్‌సెట్‌ని మార్చవచ్చని, మార్చుకోవచ్చని.. జీనియస్ మైండ్‌సెట్ లేదా గ్రోత్ మైండ్‌సెట్‌ని డెవలప్ చేసుకోవచ్చని ఆమె పేరెంట్స్‌కి వివరించాను. అయితే వెంటనే కౌన్సెలింగ్ మొదలుపెట్టమన్నారు. అది ఒకటి రెండు సెషన్ల కౌన్సెలింగ్‌తో జరిగే పనికాదని, కనీసం ఆరు నెలల పాటు కోచింగ్ అవసరం ఉంటుందని, అందులో పేరెంట్స్ కూడా పనిచేయాలని చెప్పాను. అందుకు వారు సంతోషంగా అంగీకరించారు.
జీనియస్ మైండ్‌సెట్ సాధ్యమే
జీనియస్ మైండ్‌సెట్ పుట్టుకతో రాదు, పేరెంట్స్ నుంచి నేర్చుకుంటారు. లేదా ప్రత్యేక శిక్షణ ద్వారా నేర్చుకోవచ్చు. జీనియస్ మైండ్‌సెట్ ఉన్న పేరెంట్స్ తమ పిల్లలను ప్రతిదీ ప్రశ్నించమని, నేర్చుకోమని ప్రోత్సహిస్తారు. ఏది అవసరమో, ఏది కోరికో, ఏది తప్పో, ఏది ఒప్పో ఓపిగ్గా వివరిస్తారు. వైఫల్యాలకు తిట్టకుండా వాటి నుంచి పాఠాలు ఎలా నేర్చుకోవాలో, వాటిని సానుకూలంగా ఎలా మార్చుకోవచ్చో నేర్పిస్తారు.
ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు కూడా అలాంటి మైండ్‌సెట్‌నే అలవరచుకుంటారు. అందుకే ముందుగా పేరెంట్స్ తమ మైండ్‌సెట్ మార్చుకోవడం ద్వారా పిల్లల మైండ్‌సెట్‌ని మార్చవచ్చు. అలాంటి మైండ్‌సెట్ పేరెంట్స్‌కి కూడా సక్సెస్‌ని, సంతోషాన్ని అందిస్తుంది.
జీనియస్ మైండ్‌సెట్ కావాలంటే..
- పరిమితులన్నీ మనం సృష్టించుకున్నవేనని అర్థంచేసుకోవాలి, వాటిని బ్రేక్ చేసేందుకు ప్రయత్నించాలి.
- ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవాలి, కొత్త మార్గాలను అన్వేషించాలి.
- ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోకూడదు. మీకు మీరు మాత్రమే పోటీ అని తెలుసుకోవాలి.
- పరీక్షల కోసం, మార్కుల కోసం కాకుండా లోతుగా అధ్యయనం చేయాలి.
- జీవితంలో ఎప్పుడూ విజయాలే ఉండవు, పరాజయాలు వస్తాయి. అయితే వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి.
- మీకన్నా ప్రతిభావంతులైన వ్యక్తులతో కాలం గడపండి.. వారి నుంచి నేర్చుకోండి.
- ఏ విషయంలోనైనా మీ స్ట్రాటజీ పనిచేయకపోతే దాన్ని పక్కన పెట్టేసి కొత్త వ్యూహంతో ముందుకు సాగండి.
--సైకాలజిస్ట్ విశేష్
Comments
Please login to add a commentAdd a comment