స్వచ్ఛ భారత్ ద్వారా విషం చిమ్ముతున్నారు: రాహుల్
న్యూఢిల్లీ: శాంతి, ప్రేమ ద్వారానే స్వాతంత్రాన్ని సాధించుకున్నామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. దేశరాజధానిలోని తల్కొటోరా స్టేడియంలో ప్రారంభమైన భారత మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 125వ జయంతి ఉత్సవాల్లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ... స్వాతంత్ర ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నా.. నేతలు ఎన్నడూ శాంతి మార్గాన్ని వీడలేదు అని అన్నారు.
దేశ ప్రయోజనాల కోసం నాలోని కోపాన్నంతా ప్రేమగా మార్చుకున్నాను. అందుకు కారణమైన వారందరికి నా కృతజ్క్షతలు అంటూ రాహుల్ చెప్పారు.
'1947 తర్వాత ఆంగ్ల భాషను దేశం నుంచి దూరం చేయాలని ప్రయత్నించారు. కాని ప్రపంచాన్ని ఐక్యం చేయడానికి నెహ్రుజీ ఇంగ్లీష్ భాషలోనే మాట్లాడి.. ప్రొత్సహించారు' అని అన్నారు. వ్యక్తులు, దేశాల మధ్య సఖ్యత కేవలం ప్రేమ వల్లనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ ఎలాంటి తప్పులు చేయలేదని, మనమే తప్పులు చేశామన్నారు.
'మన సిద్దాంతాల్లో లోపం లేదని ఆయన అన్నారు. ఆగ్రహం, దూకుడుతో ఉన్న వ్యక్తులు దేశాన్ని ప్రస్తుతం పాలిస్తున్నారు. మన పునాధులు బలంగా లేకుంటే... శత్రువులు బలపడుతారు' అని రాహుల్ గాంధీ ఆవేశంగా ప్రసంగించారు. ప్రచారం కోసమే వాళ్లు వీధులను శుభ్రం చేస్తున్నారని, స్వచ్ఛ భారత్ ద్వారా సమాజంలో విషం చిమ్ముతున్నారని రాహుల్ విమర్శించారు.