విస్తరణకు మోక్షం
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : గన్నవరం విమానాశ్రయ విస్తరణకు మోక్షం లభించింది. భూసేకరణకు అవసరమైన నిధుల కోసం రెండేళ్లుగా పెండింగులో ఉన్న ఫైలును రాష్ట్ర కేబినెట్ శుక్రవారం పరిశీలించింది. ఎట్టకేలకు రూ.280 కోట్ల నిధులు మంజూరు చేస్తూ కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. వీటిలో రూ.120 కోట్లు భూసేకరణకు కేటాయించాలని, మిగిలిన రూ.160 కోట్లతో విమానాశ్రయంలో వసతులు కల్పించాలని రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో నిర్ణయించారు.
గన్నవరం విమానాశ్రయ విస్తరణకు 400 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించాల్సి ఉంది. దీనిపై ప్రతిపాదనలను అధికారులు ప్రభుత్వానికి రెండేళ్ల క్రితం పంపారు. భూసేకరణకు నిధులు లేకపోవటంతో ఈ ఫైలు కదలలేదు. నిధులు విడుదలైతే భూసేకరణకు జిల్లా యంత్రాంగం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులు నిర్వాసితులతో పలుమార్లు చర్చలు జరిపారు. తమ భూములు
ఇవ్వటానికి వారు ససేమిరా అంటున్నారు.
అప్పట్లో బయట మార్కెట్ విలువకు, ప్రభుత్వ మార్కెట్ విలువకు చాలా వ్యత్యాసం ఉండటంతో రైతులు సహకరించలేదు. కొద్దిరోజుల క్రితం పార్లమెంటులో భూసేకరణకు కొత్త చట్టం ఆమోదం లభించటంతో నిర్వాసితులు తమ భూములు ఇవ్వటానికి ముందుకు వస్తారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
ఆధునిక వసతుల కల్పనకు మార్గం సుగమం..
విమానాశ్రయంలో ప్రయాణికులకు ఆధునిక వసతులు కల్పించేందుకు చేసిన ప్రతిపాదనలు ప్రస్తుతం అమలులోకి రానున్నాయి. రూ.50 కోట్లతో కొత్తగా టెర్మినల్ భవనం నిర్మించటానికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ విభాగం అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా టె ర్మినల్ భవనాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం 50 మంది కూర్చోవడానికి వినియోగిస్తున్న టెర్మినల్ భవనాన్ని 300 మంది కూర్చునేలా విశాలమైన హాలు నిర్మాణంతో విస్తరించనున్నారు. ప్రయాణికులు సేదతీరేందుకు అవసరమైన రిఫ్రెష్మెంట్ సెంటర్లు, రెస్టారెంట్లు, పుస్తక విక్రయ కేంద్రాలు తదితర సౌకర్యాలు కల్పిస్తారు. టిక్కెట్ విక్ర య కౌంటర్ల సంఖ్య పెంచటానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. టెక్నికల్ బ్లాక్‌ను కూడా విస్తరిస్తారు.
పెరగనున్న సర్వీసులు
గన్నవరం విమానాశ్రయంలో సర్వీసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయానికి న్యూఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌కు రెగ్యులర్‌గా ఆరు సర్వీసులు నడుస్తున్నాయి. వీటితోపాటు వచ్చే నెల నుంచి ఎయిర్‌కోస్తా మరో కొత్త సర్వీసును ప్రారంభించనుంది. ఎయిర్‌కోస్తా గన్నవరం కేంద్రంగానే బెంగళూరు, తిరుపతి తదితర ప్రాంతాలకు తమ సర్వీసులు నడపాలని యోచనలో ఉంది. విస్తరణ జరిగి టెర్మినల్ భవనం పూర్తయితే ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.