Public Relations
-
శక్తివంతమైన సాధనం ప్రజాసంబంధాలు
సాక్షి, అమరావతి: సమాజంలో ప్రజాసంబంధాలు శక్తివంతమైన సాధనమని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. భారత ప్రజా సంబంధాల మండలి (పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) 50వ శాఖను శనివారం విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ విజయవాడలోని రాజ్ భవన్ నుండి వెబినార్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రజా సంబంధాల నిపుణులకు విస్రృత అవకాశాలు కల్పిస్తూ వారి నైపుణ్యాలను మెరుగు పరచటంలో కౌన్సిల్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఈ రంగంలో ఉన్నత అవకాశాలు పొందాలనుకునే యువతకు ప్రోత్సాహాన్ని అందిస్తూ అనుబంధ రంగాల అవకాశాలను సమన్వయం చేయటం ముదావహమన్నారు. 2004 మార్చి 3న ఏర్పడిన ఈ సంస్ధ 42 నగరాలు, పట్టణాలతో పాటు బంగ్లాదేశ్, ఢాకా, శ్రీలంక, దుబాయ్, నేపాల్‌లలో ఐదు అంతర్జాతీయ చాప్టర్లతో వృత్తిపరమైన అభివృద్ధిని మెరుగుపరచడానికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రజా సంబంధాల నిపుణుల కోసం అంతర్జాతీయ నాలెడ్జ్ షేరింగ్ ప్లాట్‌ఫామ్‌ను అందిస్తోందని చెప్పారు. సభ్యులతో పాటు ఔత్సాహికులకు కూడా ఉపయోగపడేలా మంచి పుస్తకాలను ముద్రిస్తోందని, విద్యార్ధులకు ప్రత్యేక శిక్షణ ఇస్తోందని తెలిపారు. ఈ రంగంలో యువత సాధించిన ఉన్నతికి గుర్తుగా కౌటిల్య, చాణక్య అవార్డులు అందిస్తూ వారిని పునరుత్తేజితులను చేస్తోందన్నారు. ప్రజా సంబంధాల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే అయా సంస్ధల విజయానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ చైర్మన్ ఆర్ఎన్ మహాపాత్ర, తూర్పు జోన్ చైర్మన్ ఎంబి జయరామ్, జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వినయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షడు కెవీఆర్ మూర్తి పాల్గొన్నారు. -
అజ్ఞాతవాసి!
పొద్దున లేవగానే ఫేస్‌బుక్‌లోనో.. వాట్సాప్‌లోనో, ట్వీటర్లోనో మన ఫొటోలు షేర్ చేస్తుంటాం. వాటికి లైక్స్.. కామెంట్లు.. షేర్లు ఎన్ని వచ్చాయో తరచూ చెక్ చేసుకునే వాళ్లూ ఉంటారు. అయితే ఇందుకు భిన్నంగా ఓ వ్యక్తి గత 25 ఏళ్ల నుంచి తనెవరో తెలియకుండా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. ఆఖరికి గూగుల్ కంపెనీ కూడా అతడి ఫొటోల కోసం వెతికినా ఒక్కటంటే ఒక్కటి కూడా దొరకలేదు. అతడి పేరు జొనాథన్ హిర్షన్. పబ్లిక్ రిలేషన్స్ అధికారి. హిర్షన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉంటాడట. అతడి ఫేస్బుక్లో దాదాపుగా 3వేల మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అంతేకాదు.. ఎప్పటికప్పుడు తను ఏం చేస్తున్నాడో వ్యక్తిగత వివరాలను కూడా అప్డేట్ చేస్తుంటాడు. అయితే కేవలం అతడి ముఖాన్ని మాత్రం ఎవరికీ తెలియకుండా దాచేసుకున్నాడు. ఫొటోలు కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తుంటాడు కానీ ముఖంపై వేరు వేరు బొమ్మలను ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాడు. మరి ఎప్పటికి మనోడు అజ్ఞాతవాసం వీడుతాడో వేచిచూడాల్సిందే..! -
ప్రజాసంబంధాలు అంటే పబ్లిసిటీ కాదు
భారత ప్రజాసంబంధాల చరిత్రలో ఏప్రిల్ 21 సువర్ణాక్షరాలతో లిఖించ దగిన తేదీ. ఎందుకంటే ఈ రోజునుంచే జాతీయ ప్రజాసంబంధాల దినోత్స వాన్ని 1986 నుంచి దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. జాతి నిర్మాణంలో నిమగ్నమైన సకల రంగాల్లోనూ ప్రజాసంబంధాలను సరైన రీతిలో ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వృత్తి నిబద్ధతా వైఖరితో నిర్వహించడం లక్ష్యంగా ఈ దినోత్సవం ఉనికిలోకి వచ్చింది. దీంట్లో భాగంగానే అఖిల భారత ప్రథమ ప్రజాసంబంధాల సదస్సును 21-04-1968న ఢిల్లీలో నిర్వహించారు. కేవలం ప్రచార కండూతి నుంచి బయటకు వచ్చి పి.ఆర్. (ప్రజాసంబంధాలు) విభాగం ఒక నైతిక చట్రాన్ని రూపొందించుకున్న రోజు ఇది. నిజం చెప్పాలంటే దేశంలో వృత్తి నిబద్ధతతో కూడిన ప్రజా సంబంధాలకు ఆనాడే నాంది పలికారు. దేశాభివృద్ధిలో అతి ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తున్న ప్రజాసంబంధాల నిర్వహణ, ప్రజాసంబంధాల వృత్తి నిపుణులపై ప్రత్యేక శ్రద్ధపెట్టే లక్ష్యంతో జాతీయ ప్రజాసంబంధాల దినోత్సవాన్ని ప్రారంభించారు. ప్రజా సంబం ధాల విభాగాలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిని అధిగ మించే మార్గాన్వేషణ కోసం పలు కార్యక్రమాలను, సదస్సులను ఈ రోజు దేశమంతటా నిర్వహిస్తుంటారు. ప్రథమ సదస్సుతో దేశంలో ప్రజా సంబంధాల వృత్తికి కొత్త నిర్వచనం ఏర్పడింది. అంతవరకు ప్రజా సంబంధాలు అంటే కేవలం ప్రచారం, ప్రెస్ సమావేశాలు నిర్వహించడం, సమాచారాన్ని తెలుపడం అనే అర్థం మాత్రమే ఉండేది. ఈ లాంఛన ప్రాయమైన వ్యవహరాలతోపాటు వృత్తి నిబద్ధతా వైఖరిని పెంపొందించి, పి.ఆర్. విభాగం కొత్తపుంతలు తొక్కడానికి అది మార్గం ఏర్పర్చింది. నేటి ప్రపంచంలో సమాచార సాంకేతికజ్ఞానాన్ని ఉపయోగించడంలో నిర్లక్ష్యం వహించడం ఏ వృత్తి నిపుణుడికైనా కష్టమే అవుతోంది. తీవ్రమైన పోటీ నెలకొన్న నేటి కాలంలో ప్రజా సంబంధాల నిపుణులు వేగంగా, కచ్చితంగా, నాణ్యమైన సమాచారాన్ని అందించడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సందర్భంలో పి.ఆర్.లకు ఐటీ మద్దతు ఎంతో అవసరం. ఈ రోజుల్లో ఈ-మీడియాతో అనుకూలంగా లేని పీఆర్ నిపుణులకు సమస్యలు తప్పవు. వృత్తిలోకి అడుగుపెట్టాక వీలైనంత త్వరగా వీరు కంప్యూటర్ జ్ఞానం పొందాలి. అప్పుడే వీరు సాంప్రదాయిక కమ్యూనికేషన్ నుంచి ఈ-కమ్యూనికేషన్‌కు మారగలరు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పీఆర్ వృత్తి నిపుణులతో అనుసంధానం కావడానికి కూడా ఇదెంతో అవసరం. పైగా కేవలం సమాచార శాఖ ఉద్యోగులు, వివిధ విభాగాల ప్రజాసంబంధాల అధికారులు మాత్రమే కాకుండా సకల విభాగాల్లోని సకల ఉద్యోగులు ప్రజా సంబంధాల అధికారులుగా మారినట్లయితేనే పి.ఆర్. విభాగం పటిష్టం అవుతుంది. దీనికనుగుణంగా ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పీఆర్ విభాగాన్ని పటిష్టం చేయడమే ప్రజాసంబంధాల దినోత్సవం లక్ష్యం. (నేడు జాతీయ ప్రజా సంబంధాల దినోత్సవం) నాగేశ్వర్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ఎయిర్ ఇండియాకు ఇక పీఆర్ సేవలు
న్యూఢిల్లీ: వినియోగదారుల విశ్వాసాన్ని తిరిగి పొందడం ద్వారా ఇమేజ్ పెంచుకోవడం లక్ష్యంగా ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా, పబ్లిక్ రిలేషన్స్(పీఆర్) సంస్థను నియమించుకోనున్నది. ఆసక్తి ఉన్న పీఆర్ సంస్థల నుంచి సాంకేతిక, కమర్షియల్ బిడ్లను ఎయిర్ ఇండియా ఇటీవల ఆహ్వానించింది. ఈ బిడ్ల దాఖలుకు ఈ నెల 30 చివరి తేదీ. విమాన సర్వీసుల్లో తరుచుగా జాప్యం జరుగుతుండడం, విమాన సర్వీసులను రద్దు చేయడం ద్వారా ఇమేజ్ దెబ్బతిన్నదని ఎయిర్ ఇండియా ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అందుకే పీఆర్ సంస్థను నియమించుకోవాలని నిర్ణయించామని వివరించారు. పీఆర్ ఏజెన్సీ నియామకం ద్వారా ఎయిర్ ఇండియా పట్ల ప్రజలు, మీడియా అభిప్రాయాన్ని మెరుగుపరచడం, ప్రజలతో, కార్పొరేట్లతో వ్యవహారాలను మరింత ప్రభావవంతంగా నిర్వహించుకోవడం లక్ష్యాలని వివరించారు.