
సాక్షి, అమరావతి: సమాజంలో ప్రజాసంబంధాలు శక్తివంతమైన సాధనమని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. భారత ప్రజా సంబంధాల మండలి (పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) 50వ శాఖను శనివారం విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ విజయవాడలోని రాజ్ భవన్ నుండి వెబినార్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రజా సంబంధాల నిపుణులకు విస్రృత అవకాశాలు కల్పిస్తూ వారి నైపుణ్యాలను మెరుగు పరచటంలో కౌన్సిల్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఈ రంగంలో ఉన్నత అవకాశాలు పొందాలనుకునే యువతకు ప్రోత్సాహాన్ని అందిస్తూ అనుబంధ రంగాల అవకాశాలను సమన్వయం చేయటం ముదావహమన్నారు.
2004 మార్చి 3న ఏర్పడిన ఈ సంస్ధ 42 నగరాలు, పట్టణాలతో పాటు బంగ్లాదేశ్, ఢాకా, శ్రీలంక, దుబాయ్, నేపాల్‌లలో ఐదు అంతర్జాతీయ చాప్టర్‌లతో వృత్తిపరమైన అభివృద్ధిని మెరుగుపరచడానికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రజా సంబంధాల నిపుణుల కోసం అంతర్జాతీయ నాలెడ్జ్ షేరింగ్ ప్లాట్‌ఫామ్‌ను అందిస్తోందని చెప్పారు. సభ్యులతో పాటు ఔత్సాహికులకు కూడా ఉపయోగపడేలా మంచి పుస్తకాలను ముద్రిస్తోందని, విద్యార్ధులకు ప్రత్యేక శిక్షణ ఇస్తోందని తెలిపారు. ఈ రంగంలో యువత సాధించిన ఉన్నతికి గుర్తుగా కౌటిల్య, చాణక్య అవార్డులు అందిస్తూ వారిని పునరుత్తేజితులను చేస్తోందన్నారు. ప్రజా సంబంధాల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే అయా సంస్ధల విజయానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ చైర్మన్ ఆర్‌ఎన్ మహాపాత్ర, తూర్పు జోన్ చైర్మన్ ఎంబి జయరామ్, జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వినయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షడు కెవీఆర్ మూర్తి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment