ప్రజాసంబంధాలు అంటే పబ్లిసిటీ కాదు
భారత ప్రజాసంబంధాల చరిత్రలో ఏప్రిల్ 21 సువర్ణాక్షరాలతో లిఖించ దగిన తేదీ. ఎందుకంటే ఈ రోజునుంచే జాతీయ ప్రజాసంబంధాల దినోత్స వాన్ని 1986 నుంచి దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. జాతి నిర్మాణంలో నిమగ్నమైన సకల రంగాల్లోనూ ప్రజాసంబంధాలను సరైన రీతిలో ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వృత్తి నిబద్ధతా వైఖరితో నిర్వహించడం లక్ష్యంగా ఈ దినోత్సవం ఉనికిలోకి వచ్చింది. దీంట్లో భాగంగానే అఖిల భారత ప్రథమ ప్రజాసంబంధాల సదస్సును 21-04-1968న ఢిల్లీలో నిర్వహించారు. కేవలం ప్రచార కండూతి నుంచి బయటకు వచ్చి పి.ఆర్. (ప్రజాసంబంధాలు) విభాగం ఒక నైతిక చట్రాన్ని రూపొందించుకున్న రోజు ఇది. నిజం చెప్పాలంటే దేశంలో వృత్తి నిబద్ధతతో కూడిన ప్రజా సంబంధాలకు ఆనాడే నాంది పలికారు.
దేశాభివృద్ధిలో అతి ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తున్న ప్రజాసంబంధాల నిర్వహణ, ప్రజాసంబంధాల వృత్తి నిపుణులపై ప్రత్యేక శ్రద్ధపెట్టే లక్ష్యంతో జాతీయ ప్రజాసంబంధాల దినోత్సవాన్ని ప్రారంభించారు. ప్రజా సంబం ధాల విభాగాలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిని అధిగ మించే మార్గాన్వేషణ కోసం పలు కార్యక్రమాలను, సదస్సులను ఈ రోజు దేశమంతటా నిర్వహిస్తుంటారు. ప్రథమ సదస్సుతో దేశంలో ప్రజా సంబంధాల వృత్తికి కొత్త నిర్వచనం ఏర్పడింది. అంతవరకు ప్రజా సంబంధాలు అంటే కేవలం ప్రచారం, ప్రెస్ సమావేశాలు నిర్వహించడం, సమాచారాన్ని తెలుపడం అనే అర్థం మాత్రమే ఉండేది. ఈ లాంఛన ప్రాయమైన వ్యవహరాలతోపాటు వృత్తి నిబద్ధతా వైఖరిని పెంపొందించి, పి.ఆర్. విభాగం కొత్తపుంతలు తొక్కడానికి అది మార్గం ఏర్పర్చింది.
నేటి ప్రపంచంలో సమాచార సాంకేతికజ్ఞానాన్ని ఉపయోగించడంలో నిర్లక్ష్యం వహించడం ఏ వృత్తి నిపుణుడికైనా కష్టమే అవుతోంది. తీవ్రమైన పోటీ నెలకొన్న నేటి కాలంలో ప్రజా సంబంధాల నిపుణులు వేగంగా, కచ్చితంగా, నాణ్యమైన సమాచారాన్ని అందించడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సందర్భంలో పి.ఆర్.లకు ఐటీ మద్దతు ఎంతో అవసరం. ఈ రోజుల్లో ఈ-మీడియాతో అనుకూలంగా లేని పీఆర్ నిపుణులకు సమస్యలు తప్పవు. వృత్తిలోకి అడుగుపెట్టాక వీలైనంత త్వరగా వీరు కంప్యూటర్ జ్ఞానం పొందాలి. అప్పుడే వీరు సాంప్రదాయిక కమ్యూనికేషన్ నుంచి ఈ-కమ్యూనికేషన్‌కు మారగలరు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పీఆర్ వృత్తి నిపుణులతో అనుసంధానం కావడానికి కూడా ఇదెంతో అవసరం. పైగా కేవలం సమాచార శాఖ ఉద్యోగులు, వివిధ విభాగాల ప్రజాసంబంధాల అధికారులు మాత్రమే కాకుండా సకల విభాగాల్లోని సకల ఉద్యోగులు ప్రజా సంబంధాల అధికారులుగా మారినట్లయితేనే పి.ఆర్. విభాగం పటిష్టం అవుతుంది. దీనికనుగుణంగా ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పీఆర్ విభాగాన్ని పటిష్టం చేయడమే ప్రజాసంబంధాల దినోత్సవం లక్ష్యం.
(నేడు జాతీయ ప్రజా సంబంధాల దినోత్సవం)
నాగేశ్వర్, బంజారాహిల్స్, హైదరాబాద్