public sector company
-
పీఎన్బీ – సెయిల్ మధ్య ఒప్పందం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఉక్కు కంపెనీ సెయిల్‌తో ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా సెయిల్ ఉద్యోగులకు గృహ, కార్ల కొనుగోలుకు రుణాలను పీఎన్బీ అందిస్తుంది. అలాగే విద్యా రుణాలను సైతం తగ్గింపు రేట్లకే, ఆకర్షణీయమైన సదుపాయాలతో అందించనుంది. పీఎన్బీ కస్టమర్లను పెంచుకునేందుకు, సెయిల్ ఉద్యోగుల శ్రేయస్సుకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని పీఎన్బీ తెలిపింది. అవగాహన ఒప్పందంపై పీఎన్బీ జనరల్ మేనేజర్ (బిజినెస్ అక్విజిషన్) బిబు ప్రసాద్ మహపాత్ర, సెయిల్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) లావికా జైన్, సెయిల్ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) విక్రమ్ ఉప్పల్ సంతకాలు చేశారు. -
వైజాగ్ స్టీల్‌పై ఆర్సెలర్‌మిట్టల్ నిప్పన్ దృష్టి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ వైజాగ్ స్టీల్ (ఆర్ఐఎన్ఎల్)పై ప్రైవేట్ రంగ ఉక్కు దిగ్గజం ఏఎంఎన్ఎస్ ఇండియా (ఆర్సెలర్‌మిట్టల్ నిప్పన్ స్టీల్) సంస్థ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్ఐఎన్ఎల్ కొనుగోలు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే, కంపెనీ మాత్రం ఈ విషయం ్ర«ధువీకరించలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏఎంఎన్ఎస్ మాతృ సంస్థ ఆర్సెలర్‌మిట్టల్ చైర్మన్ లక్ష్మి నివాస్ మిట్టల్ భేటీ అవుతున్నట్లు ఏఎంఎన్ఎస్ గురువారం ట్వీట్ చేసింది. అయితే, సమావేశ వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో వైజాగ్ స్టీల్‌పై కంపెనీ దృష్టి పెట్టిందన్న వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గుజరాత్‌లోని ఏఎంఎన్ఎస్ ఇండియాలో ఆర్సెలర్‌మిట్టల్‌కు 60 శాతం, జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్‌కు 40 శాతం వాటాలు ఉన్నాయి. వైజాగ్ స్టీల్‌పై ఆసక్తిగా ఉన్నట్లు దేశీ ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. తూర్పు తీరంలో ఉన్న ఆర్ఐఎన్ఎల్ కొనుగోలు చేస్తే ఆగ్నేయాసియా మార్కెట్లలోకి మరింత చొచ్చుకుపోయేందుకు వీలుంటుందని భావిస్తున్నట్లు టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్ ఇటీవల తెలిపారు. వైజాగ్ స్టీల్‌లో 100 శాతం వాటాల విక్రయ ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) జనవరి 27న సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది. -
భెల్ లాభం 42 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్ సంస్థ, భెల్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) సెప్టెంబర్ క్వార్టర్లో 42 శాతం ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ2లో రూ.85 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ క్యూ2లో రూ.121 కోట్లకు పెరిగినట్లు భెల్ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.6,934 కోట్ల నుంచి రూ.6,360 కోట్లకు తగ్గింది. ఆరు నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ కంపెనీకి నష్టాలొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్– సెప్టెంబర్ కాలానికి రూ.125 కోట్ల నికర లాభం రాగా, ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.98 కోట్ల నికర నష్టాలు (కన్సాలిడేటెడ్) వచ్చాయని భెల్ తెలిపింది. మొత్తం ఆదాయం కూడా రూ.13,050 కోట్ల నుంచి రూ.11,033 కోట్లకు తగ్గిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో భెల్ షేర్ 4 శాతం నష్టంతో రూ.54.55 వద్ద ముగిసింది. -
పాలసీదారులకు ఎల్ఐసీ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ తాజాగా రెండేళ్ల పైబడి ల్యాప్స్ అయిన పాలసీలను కూడా పునరుద్ధరించుకునే వెసులుబాటు ప్రకటించింది. 2014 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం సాధారణంగా ప్రీమియం చెల్లింపులు ఆపేసిన నాటి నుంచి రెండేళ్ల లోపు మాత్రమే రివైవల్‌కి అవకాశం ఉంది. 2014 జనవరి 1 తర్వాత తీసుకున్న పాలసీలు ల్యాప్స్ అయి రెండేళ్లు దాటిపోతే.. పునరుద్ధరణకు వెసులుబాటు లేదు. అయితే, పాలసీదారులకు జీవిత బీమా కవరేజీ ప్రయోజనాలు లభించేలా వీటిని కూడా రివైవ్ చేసే అవకాశం కల్పించాలంటూ ఐఆర్‌డీఏఐని ఎల్ఐసీ కోరింది. దానికి అనుగుణంగానే తాజా మార్పులు చేసింది. వీటి ప్రకారం.. 2014 జనవరి 1 తర్వాత పాలసీలు తీసుకున్న వారు నాన్–లింక్డ్ పాలసీలను అయిదేళ్ల లోపు, యూనిట్ లింక్డ్ పాలసీలను మూడేళ్ల లోపు పునరుద్ధరించుకోవచ్చు. -
భెల్ నష్టాలు రూ.219 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ భెల్ కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో రూ.219 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయి. గత క్యూ1లో రూ.40 కోట్ల నికర లాభం ఆర్జించామని భెల్ తెలిపింది. ఆదాయం తక్కువగా ఉండటంతో ఈ క్యూ1లో నష్టాలు వచ్చాయని వివరించింది. మొత్తం ఆదాయం రూ.6,116 కోట్ల నుంచి రూ.4,673 కోట్లకు తగ్గిందని పేర్కొంది. విద్యుత్తు విభాగం ఆదాయం రూ.4,636 కోట్ల నుంచి రూ.3,492 కోట్లకు, ఇండస్ట్రీ సెగ్మెంట్ ఆదాయం రూ.1,161 కోట్ల నుంచి రూ.920 కోట్లకు తగ్గాయని భెల్ పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో భెల్ షేర్ 2 శాతం నష్టంతో రూ.57 వద్ద ముగిసింది. -
ఎయిరిండియా ప్రైవేటీకరణ ఒప్పుకోం
ముంబై: నష్టాలు, రుణభారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ ఎయిరిండియాను ప్రైవేటీకరించేందుకు కేంద్రం మరోసారి ప్రయత్నాలు ప్రారంభించడంపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రైవేటీకరణతో అనేక మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందనే భయాలు నెలకొన్న దరిమిలా యాజమాన్యానికి తమ ఆందోళన గురించి తెలియజేశాయి. ప్రైవేటీకరణ ప్రణాళికపై సోమవారం చైర్మన్ అశ్వనీ లోహానీతో జరిగిన సమావేశంలో 13 ఉద్యోగ సంఘాలు ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలిపాయి. దాదాపు రెండు గంటల పాటు సాగిన సమావేశంలో .. కంపెనీని మళ్లీ గట్టెక్కించేందుకు తాము అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని, శాయశక్తులా కృషి చేస్తామని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణను ఒప్పుకునేది లేదని స్పష్టం చేశాయి. ఎయిరిండియాలో డిజిన్వెస్ట్‌మెంట్‌ను వేగంగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఇటీవలి బడ్జెట్లో కేంద్రం కంపెనీకి నామమాత్రంగా రూ. లక్ష మాత్రమే కేటాయించింది. అలాగే అక్టోబర్ లోగా విక్రయ ప్రక్రియ పూర్తి చేయాలని డెడ్‌లైన్ కూడా విధించినట్లు వార్తలు వచ్చాయి. -
సిండికేట్ బ్యాంక్ లాభం రూ. 409 కోట్లు షేరుకి రూ. 3 డివిడెండ్
బెంగళూరు: ప్రభుత్వ రంగ సంస్థ సిండికేట్ బ్యాంక్ జనవరి-మార్చి(క్యూ4) కాలంలో రూ. 409 కోట్ల నికర లాభాన్ని సాధించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 592 కోట్లతో పోలిస్తే ఇది 31% తక్కువ. ప్రధానంగా నికర మొండిబకాయిలకు(ఎన్పీఏలు) కేటాయింపులు పెరగడం ప్రభావం చూపినట్లు బ్యాంక్ చైర్మన్ సుధీర్ కుమార్ జైన్ చెప్పారు. అంతేకాకుండా గత క్వార్టర్లో రూ. 114 కోట్లమేర మ్యాట్ క్రెడిట్ అదనంగా నమోదైనట్లు పేర్కొన్నారు. ఎన్పీఏ కేటాయింపులు రూ. 160 కోట్ల నుంచి రూ. 331 కోట్లకు పెరిగినట్లు తెలిపారు. వాటాదారులకు షేరుకి రూ. 3 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. కాగా, నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 7% పుంజుకుని రూ. 1,433 కోట్లను తాకగా, బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 4,781 కోట్ల నుంచి రూ. 5,357 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 2.97% నుంచి 2.79%కు తగ్గాయి. ఎన్పీఏలు 0.76% నుంచి 1.56%కు పెరిగాయి.పూర్తి ఏడాదికి..: పూర్తి ఏడాదికి(2013-14) నికర లాభం దాదాపు 15% క్షీణించి రూ. 1,711 కోట్లకు పరిమితంకాగా, అంతక్రితం రూ. 2,004 కోట్లను ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం మాత్రం రూ. 18,295 కోట్ల నుంచి రూ. 19,945 కోట్లకు పుంజుకుంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంక్ షేరు 7% పతనమై రూ. 99 వద్ద ముగిసింది.