సిండికేట్ బ్యాంక్ లాభం రూ. 409 కోట్లు షేరుకి రూ. 3 డివిడెండ్
బెంగళూరు: ప్రభుత్వ రంగ సంస్థ సిండికేట్ బ్యాంక్ జనవరి-మార్చి(క్యూ4) కాలంలో రూ. 409 కోట్ల నికర లాభాన్ని సాధించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 592 కోట్లతో పోలిస్తే ఇది 31% తక్కువ. ప్రధానంగా నికర మొండిబకాయిలకు(ఎన్‌పీఏలు) కేటాయింపులు పెరగడం ప్రభావం చూపినట్లు బ్యాంక్ చైర్మన్ సుధీర్ కుమార్ జైన్ చెప్పారు. అంతేకాకుండా గత క్వార్టర్‌లో రూ. 114 కోట్లమేర మ్యాట్ క్రెడిట్ అదనంగా నమోదైనట్లు పేర్కొన్నారు.
ఎన్‌పీఏ కేటాయింపులు రూ. 160 కోట్ల నుంచి రూ. 331 కోట్లకు పెరిగినట్లు తెలిపారు. వాటాదారులకు షేరుకి రూ. 3 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. కాగా, నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 7% పుంజుకుని రూ. 1,433 కోట్లను తాకగా, బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 4,781 కోట్ల నుంచి రూ. 5,357 కోట్లకు ఎగసింది.
నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) 2.97% నుంచి 2.79%కు తగ్గాయి. ఎన్‌పీఏలు 0.76% నుంచి 1.56%కు పెరిగాయి.పూర్తి ఏడాదికి..: పూర్తి ఏడాదికి(2013-14) నికర లాభం దాదాపు 15% క్షీణించి రూ. 1,711 కోట్లకు పరిమితంకాగా, అంతక్రితం రూ. 2,004 కోట్లను ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం మాత్రం రూ. 18,295 కోట్ల నుంచి రూ. 19,945 కోట్లకు పుంజుకుంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో బ్యాంక్ షేరు 7% పతనమై రూ. 99 వద్ద ముగిసింది.