Public singer Gaddar
-
పోటీ చేస్తారా? చేయరా?
సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నది, లేనిది వీలైనంత తొందరగా తేల్చాలని వామపక్షాలు ప్రజాగాయకుడు గద్దర్‌ను కోరుతున్నాయి. దీనిపై త్వరలోనే పది వామపక్షాల నాయకులు గద్దర్‌ను స్వయంగా కలుసుకుని ఆయన మనసులోని మాటను తెలుసుకోవాలని భావిస్తున్నారు. వచ్చేనెల 5లోగా ఒక నిర్ణయానికి రావాలని ఈ పార్టీలు నిర్ణయించాయి. గద్దర్ పోటీకి సుముఖంగా ఉంటే కొంత ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నా పర్వాలేదని, అయితే ఆ విషయాన్ని ముందుగా తెలియజేయాలని ఈ పార్టీలు కోరుకుంటున్నాయి. పోటీకి విముఖంగా ఉన్నా ఆ విషయాన్ని స్పష్టంచేస్తే ప్రత్నామ్నాయ అభ్యర్థిని సిద్ధం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నాయి. మరోవైపు గద్దర్‌తో, ఆయన సన్నిహితులతో సంప్రదింపుల ప్రక్రియ సాగుతోందని వామపక్ష ముఖ్యనాయకుడొకరు ‘సాక్షి’కి వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్రను పోషించడంతో పాటు విప్లవ రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగడం, ప్రజాగాయకుడిగా ఆయనకున్న గుర్తింపు తప్పకుండా ఉపయోగపడుతుందని వామపక్షాలు అంచ నావేస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్న అంచనాకు వస్తున్న ఈ పార్టీలు ఈ ఉప ఎన్నికను అందుకు అనుకూలంగా వాడుకోవాలని భావిస్తున్నాయి. మరోవైపు గద్దర్ వామపక్షాల అభ్యర్థి లేదా ఈ పార్టీలు బలపరిచిన అభ్యర్థి అయితే కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కూడా మద్దతునిస్తాయనే అంచనా వేస్తున్నారు. ఒకవేళ గద్దర్ పోటీ చేస్తే టీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా చీలిక వస్తుందని, క్రియాశీలంగా ఉంటే యువత కూడా కీలకభూమిక పోషిస్తుందని భావిస్తున్నారు. పోటీకి ఆయన ఒప్పుకుంటే అందరినీ కలుపుకొని రావాలని వామపక్షాలు భావిస్తుండగా, అన్నిపార్టీల నాయకులు కలసి కోరితే బాగుంటుందనే అభిప్రాయంతో గద్దర్ ఉన్నారని వీరంటున్నారు. ఏచూరితో గాలి వినోద్‌కుమార్ భేటీ వామపక్షాలు బలపరిచిన అభ్యర్థిగా లేదా పది వామపక్షాల అభ్యర్థిగా పోటీచేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని సీపీఎం జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరిని అంబేద్కరిస్టు, లా కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొ.గాలి వినోద్‌కుమార్ కోరారు. గురువారం ఎంబీ భవన్లో ఏచూరిని ఆయన కలిశారు. తాను వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తిని కావడంతో పాటు, ప్రజలతో సంబంధాలు, ఇక్కడ అధికసంఖ్యలో మాదిగ సామాజికవర్గానికి చెందిన వాడిని కావడం కలిసొచ్చే అంశాలుగా ఆయన వివరించినట్లు తెలిసింది. అయితే వినోద్‌కుమార్ అభ్యర్థిత్వం పట్ల ఈ పార్టీలన్నింటిలో పూర్తి సానుకూలత వ్యక్తం కావడం లేదు. వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో పోటీ చేయడాన్నే సీపీఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ-చంద్రన్న) వర్గం వ్యతిరేకిస్తోంది. ఈ ఎన్నికల్లో తాము ఎవరికీ మద్దతు తెలిపేది లేదని స్పష్టంచేసింది. వామపక్షాల అభ్యర్థి అని చెప్పి ఇండిపెండెంట్‌గా ఎవరినైనా నిలబెడితే మాత్రం తాము మద్దతు తెలపమని ఆర్ఎస్పీ, ఫార్వర్డ్‌బ్లాక్ పార్టీలు స్పష్టంచేస్తున్నాయి. -
‘మిషన్ కాకతీయ’తో మమేకం అవుదాం
తూప్రాన్: ప్రభుత్వం చేపడుతున్న ‘మిషన్ కాకతీయ’ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణ పనుల్లో భాగస్వాములమవుదామని ప్రజాగాయకుడు గద్దర్ ప్రజలకు పిలుపునిచ్చారు. మండలంలో చేపట్టిన రెండు రోజుల పాదయాత్రలో భాగంగా తొలిరోజు సోమవారం మండల పరిధిలోని కాళ్లకల్, కూచారం, జీడీపల్లి, మనోహరాబాద్, రామాయిపల్లి, ఇమాం పూర్, లింగారెడ్డిపేట, రావెల్లి గ్రామాల్లో ని చెరువులను సందర్శించారు. డప్పు, ఓగ్గు కళాకారులతో కలిసి గ్రామల్లోని ప్రజలను, విద్యార్థులను మమేకం చేస్తూ చెరువు నుంచి చెరువుకు సాంస్క ృతిక పాదయాత్రను కొనసాగించారు. ఈ పాదయాత్రకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఇరిగేషన్ ఓఎస్డీ శ్రీధర్‌దేశ్‌పాండే, ఈఈ ఆనం ద్, గఢా అధికారి హన్మంతరావు, విద్యావంతుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ తిప్పర్తి యాదయ్య, మాల్కాజిగిరి ఎమ్మెల్యే కనకరెడ్డి, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరిలు హాజరయ్యారు. వారంతా గద్దర్‌తో కలిసి ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ చెరువులను సందర్శించారు. ఈ సందర్భంగా గద్దర్ తన పాటలతో ప్రజలను, విద్యార్థులను ఆకట్టుకున్నారు. ప్రత్యేక ఆకర్షణగా గద్దర్ ‘అమర వీరులకు జోహర్లు, జై తెలంగాణ’ అని రాసి ఉన్న చొక్కాను ధరించారు. తన కాళ్లకు గజ్జె లు కట్టి పాటలు పాడుతూ గ్రామాల్లో ప్రజలను ఆకట్టుకున్నారు. మొదట కాళ్లకల్ బంగారమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి పాదయాత్రగా గ్రామ సమీపంలోని ఊర చెరువును సందర్శించి నీటిలో పూజలు జరిపారు. గ్రామస్తులతో చెరువులను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయిం చారు. అనంతరం గద్దర్ మాట్లాడుతూ అమరుల స్వప్నమైన జలకళ, పంట సిరుల్ని సాధించాలని సూచించారు. రాష్ట్రంలో చెరువుల పునర్నిర్మాణం పూర్తయితే కోటి ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని వివరించారు. 1.20 కోట్ల ఎకరాల భూమి సాగవుతుంది.. తెలంగాణలోని 46 వేల చెరువులు పునరుద్ధరణ జరిగితే 265 టీఎంసీల నీరు నిల్వచేయవచ్చని, ఈ నీటితో 1.20 కోట్ల ఎకరాల భూమి సాగవుతుందని ఇరిగేషన్ శాఖ ఓఎస్డీ శ్రీధర్‌దేశ్‌పాండే అన్నారు. దేశంలోనే అత్యధిక చెరువులు గల రాష్ట్రం ఒక తెలంగాణ మాత్రమే అని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ పథకం పూర్తి అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రం మారుతుందని వివరించారు. చెరువుల్లోని మట్టిలో అనేక పోషకాలు ఉంటాయని ఇది పొలాల్లో వేసిన పంటలకు లాభాం చేకురుతుందన్నారు. మన నీరు, మన భూములు, మన వనరులు మనమే రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. గద్దర్ చేపట్టిన కార్యక్రమానికి ప్రభుత్వం పూర్తి మద్దతు తెలుపుందున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని 1212 చెరువుల్లో మొదటి విడుతల్లో 606 చెరువులకు జూన్‌లో ప్రారంభమవుతాయని చెప్పారు. అనంతరం విద్యావంతుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ తిప్పర్తి యాదయ్య మాట్లాడుతూ గ్రామాల్లో చెరువులు నిండి సస్యశ్యామలంగా ఉంటే రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. అలాగే సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ మన వనరులు, మన నీళ్లు కోసం 1994లోనే గద్దర్‌తో కలిసి ఉద్యమం ప్రారంభించినట్లు చెప్పారు. పాదయాత్రలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎలక్షన్‌రెడ్డి, పొన్నాల రఘుపతిరావు, డీఎస్పీ వేంకటేశ్వర్లు, సీఐ సంజయ్‌కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు ర్యాకల శేఖర్‌గౌడ్, ఎంపీడీఓ కరుణాశీల, సర్పంచులు శివ్వమ్మ, మంజుల, విఠల్‌యాదవ్, ఎంపీటీసీ లక్ష్మినర్సింలుగౌడ్తో పాటు ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం కోరితే మధ్యవర్తిత్వానికి సిద్ధం: గద్దర్
గజ్వేల్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తలెత్తిన విద్యుత్ వివాదం విషయంలో.. ఇక్కడి ప్రభుత్వం కోరితే మధ్యవర్తిత్వం వహించి సమస్య పరిష్కారానికి తనవంతు ప్రయత్నం చే స్తానని ప్రజాగాయకుడు గద్దర్ ప్రకటించారు. మెదక్ జిల్లా గజ్వేల్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్నదమ్ముల్లా కలసి ఉండాల్సిన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ వ్యవహారం ఉద్రిక్తతలను సృష్టించడం బాధాకరమని వ్యాఖ్యానించారు. కరెంట్ కోతల కారణంగా తెలంగాణ రైతాంగం అల్లాడుతోందని, ఈ సమస్య నుంచి రైతులను గట్టెక్కించడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనవంతు తోడ్పాటు ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు సాగించాల్సిన ప్రస్తుత తరుణంలో రెండు రాష్ట్రాల మధ్య సోదరభావం ఎంతో అవసరమన్నారు. సాగునీటి వనరుల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం ముందుకు కదలడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.