పోటీ చేస్తారా? చేయరా?
సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నది, లేనిది వీలైనంత తొందరగా తేల్చాలని వామపక్షాలు ప్రజాగాయకుడు గద్దర్‌ను కోరుతున్నాయి. దీనిపై త్వరలోనే పది వామపక్షాల నాయకులు గద్దర్‌ను స్వయంగా కలుసుకుని ఆయన మనసులోని మాటను తెలుసుకోవాలని భావిస్తున్నారు. వచ్చేనెల 5లోగా ఒక నిర్ణయానికి రావాలని ఈ పార్టీలు నిర్ణయించాయి.
గద్దర్ పోటీకి సుముఖంగా ఉంటే కొంత ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నా పర్వాలేదని, అయితే ఆ విషయాన్ని ముందుగా తెలియజేయాలని ఈ పార్టీలు కోరుకుంటున్నాయి. పోటీకి విముఖంగా ఉన్నా ఆ విషయాన్ని స్పష్టంచేస్తే ప్రత్నామ్నాయ అభ్యర్థిని సిద్ధం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నాయి.
మరోవైపు గద్దర్‌తో, ఆయన సన్నిహితులతో సంప్రదింపుల ప్రక్రియ సాగుతోందని వామపక్ష ముఖ్యనాయకుడొకరు ‘సాక్షి’కి వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్రను పోషించడంతో పాటు విప్లవ రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగడం, ప్రజాగాయకుడిగా ఆయనకున్న గుర్తింపు తప్పకుండా ఉపయోగపడుతుందని వామపక్షాలు అంచ నావేస్తున్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్న అంచనాకు వస్తున్న ఈ పార్టీలు ఈ ఉప ఎన్నికను అందుకు అనుకూలంగా వాడుకోవాలని భావిస్తున్నాయి.
మరోవైపు గద్దర్ వామపక్షాల అభ్యర్థి లేదా ఈ పార్టీలు బలపరిచిన అభ్యర్థి అయితే కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కూడా మద్దతునిస్తాయనే అంచనా వేస్తున్నారు. ఒకవేళ గద్దర్ పోటీ చేస్తే టీఆర్‌ఎస్ శ్రేణుల్లో కూడా చీలిక వస్తుందని, క్రియాశీలంగా ఉంటే యువత కూడా కీలకభూమిక పోషిస్తుందని భావిస్తున్నారు. పోటీకి ఆయన ఒప్పుకుంటే అందరినీ కలుపుకొని రావాలని వామపక్షాలు భావిస్తుండగా, అన్నిపార్టీల నాయకులు కలసి కోరితే బాగుంటుందనే అభిప్రాయంతో గద్దర్ ఉన్నారని వీరంటున్నారు.
ఏచూరితో గాలి వినోద్‌కుమార్ భేటీ
వామపక్షాలు బలపరిచిన అభ్యర్థిగా లేదా పది వామపక్షాల అభ్యర్థిగా పోటీచేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని సీపీఎం జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరిని అంబేద్కరిస్టు, లా కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొ.గాలి వినోద్‌కుమార్ కోరారు. గురువారం ఎంబీ భవన్‌లో ఏచూరిని ఆయన కలిశారు. తాను వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తిని కావడంతో పాటు, ప్రజలతో సంబంధాలు, ఇక్కడ అధికసంఖ్యలో మాదిగ సామాజికవర్గానికి చెందిన వాడిని కావడం కలిసొచ్చే అంశాలుగా ఆయన వివరించినట్లు తెలిసింది.
అయితే వినోద్‌కుమార్ అభ్యర్థిత్వం పట్ల ఈ పార్టీలన్నింటిలో పూర్తి సానుకూలత వ్యక్తం కావడం లేదు. వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో పోటీ చేయడాన్నే సీపీఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ-చంద్రన్న) వర్గం వ్యతిరేకిస్తోంది. ఈ ఎన్నికల్లో తాము ఎవరికీ మద్దతు తెలిపేది లేదని స్పష్టంచేసింది. వామపక్షాల అభ్యర్థి అని చెప్పి ఇండిపెండెంట్‌గా ఎవరినైనా నిలబెడితే మాత్రం తాము మద్దతు తెలపమని ఆర్‌ఎస్‌పీ, ఫార్వర్డ్‌బ్లాక్ పార్టీలు స్పష్టంచేస్తున్నాయి.