సాక్షి, యాదాద్రి: రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీఆర్‌ఎస్ పార్టీకి అభ్యర్థులే కరువయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ బొమ్మతో ఎన్నికలకు వెళ్తే నిండా మునిగిపోతామనే భయం ఆ పార్టీ ఎమ్మెల్యేలకు పట్టుకుందన్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఆయన యాదాద్రి భువ నగిరి జిల్లా రామన్నపేట మండలం ఎల్లంకిలో బుధవారం తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిలో బీజేపీలో చేరే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య చాలా ఎక్కువగానే ఉందన్నారు.
ప్రజా సంగ్రామ యాత్రకు వస్తున్న స్పందనను చూశాక ఆయా ఎమ్మెల్యేలు బీజేపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని తెలిపారు. ఇటీవల 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వస్తారని నేను చెబితే ఆ జాబితాలో నా పేరు కూడా ఉందా? లేదా? అని ఆయా ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ కోసం పని చేసే నిజమైన కార్యకర్తలంతా టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విసిగిపోయారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే హైదరాబాద్‌లోని కంపెనీల వద్ద నెల కిందటే ఎన్నికల కోసం డబ్బులు వసూలు చేసుకున్నా రని సంజయ్ ఆరోపించారు.
కమ్యూనిస్టు పార్టీలకు దమ్ముంటే మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేయాలని సవాల్ చేశారు. కమ్యూనిస్టు, మజ్లిస్ పార్టీల నాయకులు కేసీఆర్ కోవర్టుల్లా మారారని మండిపడ్డారు. మిషన్ భగీరథ కోసం జిల్లాలో రూ.800 కోట్లు ఖర్చుతో అందిస్తున్న నీళ్లను ప్రజలు తాగడం లేదన్నారు. కాగా,ఈనెల 21న మునుగోడు లో జరిగే భారీ బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్నారని సంజయ్ వెల్లడించారు. 8వ రోజు బండి సంజయ్ పాదయాత్ర 14కి.మీ మేర కొనసాగింది.
చదవండి: మునుగోడుపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్
Comments
Please login to add a commentAdd a comment