ప్రతినిధులు వృథా!
=ఏసీడీపీ నిధులకు గ్రహణం
=ఎమ్మెల్యేల పనితీరుకు నిదర్శనం
=రూ. కోట్లలో మూలుగుతున్నా పట్టించుకోని వైనం
=ఇన్‌ఛార్జి మంత్రి కోటా నిధుల తీరు దారుణం
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి (ఏసీడీపీ) నిధుల వ్యయం విధానం జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరుకు అద్దం పడుతోంది. వారి నిర్లక్ష్యం నియోజకవర్గాల్లో అభివృద్ధికి శాపంగా పరిణమిస్తోంది. రూ. కోట్లలో మంజూరవుతున్న నిధులను మూడేళ్లుగా అభివృద్ధి పనులకు వినియోగించకపోవడంతో నిరుపయోగమవుతున్నాయి. కొన్ని అభివృద్ధి పనులు,మౌలిక సదుపాయాలకు సర్కారు నుంచి నిధులు రాకపోగా.. ఉన్నవి ఖర్చు చేయకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏసీడీపీ నిధులు ఒక్కో ఎమ్మెల్యేకు ఏటా రూ. కోటి వంతున ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఇందులో 50 శాతం అంటే రూ.50 లక్షలు జిల్లా ఇన్చార్జి మంత్రి కోటాలోకి వెళ్తాయి. ప్రతి మూడు నెలలకు (క్వార్టర్‌కు) రూ.12.5 లక్షలు ఎమ్మెల్యేలకు, రూ.12.5 లక్షలు ఇన్చార్జి మంత్రికి ఇవ్వాలి. ఎమ్మెల్సీలకూ ఇలాగే కేటాయించాలి. కానీ ప్రభుత్వం వీటిని
సకాలంలో విడుదల చేయడం లేదు. ఒక ఆర్థిక సంవత్సరం నిధులను మరో ఏడాది విడుదల చేస్తోంది. దీంతో అనేక కార్యక్రమాలు నిలిచిపోతున్నాయి. 2012-13 ఆర్థిక సంవత్సరంలో చివరి రెండు క్వార్టర్లకు రూ.50 లక్షలు చొప్పున ఇన్‌ఛార్జి మంత్రి కోటాను కలిపి ఈ ఏడాదివ్వడం విశేషం. అయితే 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి రెండు క్వార్టర్లకు రూ. 25 లక్షల ఏసీడీపీ నిధులు విడుదలయ్యాయి.
50 శాతం కూడా ఖర్చు కాలేదు : జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొందరు ఎమ్మెల్యేలు 50 శాతం నిధులు కూడా ఖర్చు చేయకపోవడం శోచనీయం. విశాఖ-దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాసరావు 2010 నుంచి ఇప్పటి వరకు మూడేళ్లలో రూ.1.37 కోట్లు రాగా రూ.55.099 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. ఇన్‌ఛార్జి మంత్రి కోటాలోనూ రూ.57.089 లక్షలను మాత్రమే వివిధ పనులకు వినియోగించారు. యలమంచిలి ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తి రాజు(కన్నబాబు) కోటాలో మూడేళ్లలో రూ.58.481 లక్షలు వినియోగించారు.
గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య రూ.56.216 లక్షలు, విశాఖ-తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు రూ.71.143 లక్షలు ఖర్చు చేయగా 2012-13కు సంబంధించి విడుదలైన నిధులు అలాగే ఖజానాలో మూలుగుతున్నాయి. విశాఖ-ఉత్తరం ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్ రూ.35.159 లక్షలు, విశాఖ పశ్చిమం ఎమ్మెల్యే మళ్ల విజయ్‌ప్రసాద్ రూ.58.208 లక్షలు, చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు రూ.81.416 లక్షలు, మాడుగుల ఎమ్మెల్యే గవిరెడ్డి రామనాయుడు 82.621 లక్షలు వివిధ పనులకు ఉపయోగించారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకట్రామయ్య, ద్రోణంరాజు శ్రీనివాసరావు, కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, మళ్ల విజయ్‌ప్రసాద్, సివేరి సోమ, తైనాలవిజయ్‌కుమార్, కన్నబాబు, వెలగపూడి రామకృష్ణబాబులు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడం గమనార్హం.
మూలుగుతున్న ‘ఇన్‌ఛార్జి’ నిధులు : నియోజకవర్గాల్లో వివిధ అవసరాలు, పనుల కోసం ఎమ్మెల్యేలు ప్రతిపాదిస్తే, వాటికి ఇన్చార్జి మంత్రి తన వాటాలో నిధులను మంజూరు చేస్తారు. మూడేళ్లుగా జిల్లాలో వరదలు, కరవు పరిస్థితులు ఉన్నాయి. నష్టాల నివారణకు, అభివృద్ధి పనులకు రూ. కోట్లు అవసరమున్నా.. ఈ నిధులను ఖర్చు చేయకపోవడం ప్రజా సంక్షేమంపై వీరి కున్న శ్రద్ధ ఏపాటిదో అవగతమవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు క్వార్టర్ల నిధులు మంజూరైనా ఒక్క పనికి కూడా వాటిని వినియోగించ లేదు. ప్రస్తుతం జిల్లాకు ఇన్చార్జి మంత్రి లేకపోవడంతో ఆ కోటా నిధులు ఖజానా లో మూలుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం 2013-14లో ఇన్చార్జి మంత్రి కోటా కింద వచ్చే రూ. 8.5 కోట్లు కూడా నిరుపయోగం కానున్నాయి.