PULAPARTHI RAMANJANEYULU
-
జంపింగ్ నేతకు భీమవరం టికెట్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఎట్టకేలకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన అభ్యర్థులు ఖరారైనట్టు సమాచారం. బుధవారం పవన్‌కళ్యాణ్ అభ్యర్థులతో సమావేశం నిర్వహించి బీ–ఫామ్, ఎన్నికల నియామవళి విధి విధానాలు, అనుమతి పత్రాలు అందజేశారు. భీమవరం నుంచి పవన్‌కళ్యాణ్ పూర్తిగా తప్పుకున్నారు. నియోజకవర్గాల వారీగా నరసారం నుంచి బొమ్మిడి నాయకర్, తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు నుంచి పత్సమట్ల ధర్మరాజు, భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు సమావేశానికి హాజరై పత్రాలు తీసుకుని అభ్యర్థులుగా ఖరారయ్యారు. తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ ర్యాలీ, సమావేశం నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల్లో భాగంగా జనసేనకు ఉమ్మడి పశ్చిమలో నిడదవోలుతో కలిపి ఆరు సీట్లు కేటాయించారు. పోలవరం అభ్యర్థిత్వంపై జనసేనకు స్పష్టత లేకపోవడంతో పెండింగ్‌లో ఉంది. జంపింగ్ నేతకు భీమవరం టికెట్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయం ప్రారంభించి ఒకసారి ఎమ్మెల్యేగా చేసి వెంటనే టీడీపీలో చేరి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచిన భీమవరం మాజీ ఎమ్మెల్యే, జంపింగ్ నేత పులపర్తి రామాంజనేయులుకు భీమవరం టికెట్ కేటాయించారు. 2019లో పవన్‌కళ్యాణ్ పోటీ చేసి ఓటమి పాలైనప్పటి నుంచి మళ్లీ భీమవరంలోనే పోటీ చేస్తానని పలుమార్లు ప్రకటించి చివరకు జిల్లా నుంచి జారుకున్నారు. అంతటితో ఆగకుండా పార్టీ ఆవిర్భావం నుంచి జనసేనలో ఉన్న వారికి కాదని రెండు రోజుల క్రితం పార్టీలో చేరిన రామాంజనేయులకు టికెట్ ఇవ్వడంపై జనసేన కేడర్‌లో అసమ్మతి మొదలైంది. గత వారమే రామాంజనేయులకు టికెట్ ఇస్తారని ప్రచారం జరిగిన క్రమంలో భీమవరం జనసేన కార్యకర్తలు ప్రొడ్యూసర్ బన్నీ వాసును కలిసి రామాంజనేయులకు టికెట్ ఇవ్వవద్దని కలిసి చెప్పారు. ఇక రామాంజనేయులు అభ్యర్థిత్వం ఖరారు కావడంతో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నేతల్లో అసహనం మొదలైంది. సాధారణంగా పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తాయి, అయితే ఇక్కడ మాత్రం అభ్యర్థులు వారికి వారే ప్రకటించుకున్నట్టు తెలిసింది. -
భీమవరం ఎమ్మెల్యేకు అస్వస్థత
హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం టీడీపీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అస్వస్థతకు గురయ్యారు. ఈ ఉదయం శాసనసభ సమావేశాలకు హాజరైన ఆయన అస్వస్థతకు లోనయ్యారు. దీంతో హుటాహుటిన ఆయన కేర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు వైద్య సహాయం అందిస్తున్నారు. ఆయన అనారోగ్యానికి గల కారణాలు వెంటనే తెలియరాలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ పై రామాంజనేయులు గెలిచారు. మంత్రి గంటా శ్రీనివాసరావుకు రామాంజనేయులు వియ్యంకుడు. గంటా శ్రీనివాసరావు కుమార్తె సాయిపూజిత, ఆంజనేయులు కుమారుడు వెంకట్రామ్ ప్రశాంత్‌ల వివాహం గత డిసెంబర్ లో జరిగిన సంగతి తెలిసిందే. -
పాపం.. పార్థసారథి
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : ఆయన పేరు మెంటే పార్థసారథి. మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో పల్లకి మోసే బోయూగానే ఉండిపోయూరు. ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ తనకు సీటొస్తుందనే ఆశతో ఉంటున్నారు. చివరకు అట్టడుగు స్థారుుకి నెట్టబడుతున్నారు. ఓసారి ఆయనకు ఎమ్మెల్సీ అయ్యే అవకాశం దక్కింది. సామాజిక సర్దుబాటులో భాగంగా మునిసిపల్ మాజీ చైర్మన్‌కు ఆ పదవిని కట్టబెడుతున్నామని.. మరోసారి మంచి అవకాశం కల్పిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బుజ్జగించారు. 1999 ఎన్నికల్లో అరుునా ఎమ్మెల్యే సీటు ఇస్తారని సారథి, ఆయన వర్గీయులు భావించారు. అప్పుడూ అదే పరిస్థితి. ఆయన వర్గీయులు, అభిమానులు ఎమ్మెల్యే సీటును ఆయనకే ఇచ్చి తీరాలన్నారు. అరుునా పార్టీ అధిష్టానం పట్టించుకోలేదు. అరుునా పార్థసారథి సర్దుకుపోయూరు. ఇలా చాలా సందర్భాల్లో జరిగింది. ప్రస్తుత ఎన్నికల్లో తనకు తప్పకుండా ఎమ్మెల్యే సీటొస్తుందనే ధీమాతో ఉన్నారు. అభిమానులు సైతం మొన్నటివరకూ అదే ఆశతో ఉన్నారు. బంధుగణం, అనుచర వర్గం బలంగా ఉన్న ఆయనకు ఈసారి సీటొస్తే కష్టపడి గెలిపించుకుందామనుకున్నారు. కానీ.. సీను తారుమారైంది. కాంగ్రెస్ పార్టీని వీడిన వారందరికీ పచ్చజెండాలు కప్పుతున్న చంద్రబాబునాయుడు ఈసారి కూడా సారథి కి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం సీటు రామాంజనేయులు (అంజిబాబు)కు ఇస్తామని హామీ కూడా ఇచ్చేశారు. ఈసారి ఎలాగైనా సరే టీడీపీ సీటు తనకే వస్తుందని.. ఖర్చుకు వెనుకాడబోనని పార్థసారథి ఎన్నికలకు సిద్ధమైన తరుణంలో అంజిబాబు రాక టీడీపీలో ముసలాన్ని రేపింది. ‘టీడీపీలో ఎప్పుడూ పల్లకి మోసే బోయీగానే ఉండిపోవాలా, పల్లకి ఎక్కే అవకాశం ఇవ్వరా’ అంటూ సారథి అనుచరులు, బంధుగణం అసహనంతో రగిలిపోతోంది. పార్టీ శ్రేణులు సైతం ఆవేదనతో రగిలిపోతున్నాయి. ఆదినుంచి పార్టీకి ఎనలేని సేవలందిస్తున్న మెంటే పార్థసారథిని కాదని వేరే వారికి సీటిస్తే సహించేది లేదని, అంజిబాబుకు సహకరించేది లేదని వారంతా మండిపడుతున్నారు. అంజిబాబుపై అసంతృప్తి: టీడీపీలో చేరిన ఎమ్మెల్యే అంజిబాబుపై ఆ పార్టీ శ్రేణులు అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారుు. చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరి మంగళవారం భీమవరం వచ్చిన ఎమ్మెల్యే అంజిబాబుకు స్వాగతం పలికేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో ఒక్కరు కూడా వెళ్లలేదు. మెంటేకి అసెంబ్లీ సీటిస్తేనే మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల కోసం పనిచేస్తామని, లేదంటే పట్టించుకునేది లేదని పార్టీ నాయకులు ఇప్పటికే చంద్రబాబుకు వివిధ రూపాల్లో స్పష్టం చేశారు. అరుునా అధిష్టానం పట్టించుకోకపోవడంతో శ్రేణులంతా అసహనంతో రగిలిపోతున్నారు. నీ దారి నీదే : ఇటీవల పార్థసారథి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే అంజిబాబు వచ్చే ఎన్నికల్లో తనకు సహకరించాలని కోరారు. ఇందుకు పార్థసారథి ససేమిరా అన్నట్టు సమాచారం. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నానని, తాను అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నానని.. ఈ విషయంలో నీ దారి నీదే.. నా దారి నాదే అని పార్థసారథి స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. దీంతో చేసేదేమీ లేక అంజిబాబు వెనుతిరిగినట్లు తెలిసింది. ఎందుకింత కష్టపడాలి : భీమవరం సీటు తనకు దక్కుతుందనే ఆశతో మెంటే పార్థసారథి మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల కోసం చెమటోడుస్తున్నారు. అయితే అంజిబాబుకు సీటు ఖరారైందనే విషయం తెలిసి పార్థసారథి పార్టీ కోసం తానెందుకు కష్టపడాలనే ఆలోచనతో ఉన్నట్టు ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. అంజిబాబు అంటే ఇష్టంలేని శ్రేణులు ఆయన చేరికతో మునిసిపల్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వెనకడుగు వేశారు. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘన
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నా.. భారీ ర్యాలీ నిర్వహించి టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. టీడీపీలో చేరిన ఆయన మంగళవారం ఉదయం భీమవరం టౌన్ రైల్వేస్టేషన్ నుంచి పట్టణంలోని పలు ప్రధాన వీధుల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రస్తుతం ఎక్కడా కూడా ర్యాలీలకు అనుమతి లేదు. చిన్న ర్యాలీ నిర్వహించుకోవాలన్నా.. మైక్ పెట్టుకోవాలన్నా.. జెండాలతో ప్రదర్శన నిర్వహించాలన్నా ఎన్నికల అధికారులు, పోలీసుల అనుమతి తప్పనిసరి. అందుకు విరుద్ధంగా ఈ ర్యాలీ సాగింది. వందలాది మోటార్ సైకిళ్లు, సుమారు 25 వరకు కార్లు, పెద్ద ఎత్తున ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న పోలీసులు అంజిబాబు నివాసానికి చేరుకుని, అక్కడ వేసిన టెంట్‌ను తొలగించారు. దీనిపై భీమవరం వన్‌టౌన్ సీఐ జి.కెనడీని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా తాము పులపర్తి రామాంజనేయులు ర్యాలీకి ఎటువంటి అనుమతులు మంజూరు చేయలేదని, అయితే ర్యాలీ జరుగుతుందన్న సమాచారం తెలుసుకుని తాము వెళ్లేసరికి ఆయన ఇంటికి వె ళ్లిపోయారని సమాధానమిచ్చారు. ర్యాలీ విషయమై అక్కడ ఆరా తీయగా అటువంటిది జరగలేదని, కేవలం అంజిబాబుకు స్వాగతం చెప్పేం దుకు మాత్రం వెళ్లామన్నారని చెప్పారు. ఎమ్మెల్యే ర్యాలీ విషయమై ఎన్నికల రిటర్నింగ్ అధికారి సవరమ్మను వివరణ కోరగా ఎన్నికల సమయంలో ర్యాలీ నిర్వహించడం తప్పని, దీనిపై ఎన్నికల అధికారులు విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలావుండగా ఎమ్మెల్యే రామాంజనేయులుకు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నాయకులు తప్ప టీడీపీ ముఖ్య నేతలు ఎవ్వరూ రాకపోవడం గమనార్హం.