ఉమ్మడి పశ్చిమలో జనసేన అభ్యర్థుల ఖరారు !
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఎట్టకేలకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన అభ్యర్థులు ఖరారైనట్టు సమాచారం. బుధవారం పవన్‌కళ్యాణ్ అభ్యర్థులతో సమావేశం నిర్వహించి బీ–ఫామ్, ఎన్నికల నియామవళి విధి విధానాలు, అనుమతి పత్రాలు అందజేశారు. భీమవరం నుంచి పవన్‌కళ్యాణ్ పూర్తిగా తప్పుకున్నారు. నియోజకవర్గాల వారీగా నరసారం నుంచి బొమ్మిడి నాయకర్, తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు నుంచి పత్సమట్ల ధర్మరాజు, భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు సమావేశానికి హాజరై పత్రాలు తీసుకుని అభ్యర్థులుగా ఖరారయ్యారు. తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ ర్యాలీ, సమావేశం నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల్లో భాగంగా జనసేనకు ఉమ్మడి పశ్చిమలో నిడదవోలుతో కలిపి ఆరు సీట్లు కేటాయించారు. పోలవరం అభ్యర్థిత్వంపై జనసేనకు స్పష్టత లేకపోవడంతో పెండింగ్‌లో ఉంది.
జంపింగ్ నేతకు భీమవరం టికెట్
కాంగ్రెస్ పార్టీలో రాజకీయం ప్రారంభించి ఒకసారి ఎమ్మెల్యేగా చేసి వెంటనే టీడీపీలో చేరి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచిన భీమవరం మాజీ ఎమ్మెల్యే, జంపింగ్ నేత పులపర్తి రామాంజనేయులుకు భీమవరం టికెట్ కేటాయించారు. 2019లో పవన్‌కళ్యాణ్ పోటీ చేసి ఓటమి పాలైనప్పటి నుంచి మళ్లీ భీమవరంలోనే పోటీ చేస్తానని పలుమార్లు ప్రకటించి చివరకు జిల్లా నుంచి జారుకున్నారు. అంతటితో ఆగకుండా పార్టీ ఆవిర్భావం నుంచి జనసేనలో ఉన్న వారికి కాదని రెండు రోజుల క్రితం పార్టీలో చేరిన రామాంజనేయులకు టికెట్ ఇవ్వడంపై జనసేన కేడర్‌లో అసమ్మతి మొదలైంది.
గత వారమే రామాంజనేయులకు టికెట్ ఇస్తారని ప్రచారం జరిగిన క్రమంలో భీమవరం జనసేన కార్యకర్తలు ప్రొడ్యూసర్ బన్నీ వాసును కలిసి రామాంజనేయులకు టికెట్ ఇవ్వవద్దని కలిసి చెప్పారు. ఇక రామాంజనేయులు అభ్యర్థిత్వం ఖరారు కావడంతో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నేతల్లో అసహనం మొదలైంది. సాధారణంగా పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తాయి, అయితే ఇక్కడ మాత్రం అభ్యర్థులు వారికి వారే ప్రకటించుకున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment