నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారే న్యుమోనియా!
పల్మనాలజీ కౌన్సెలింగ్
మా బాబుకు మూడేళ్లు. ఇటీవల వాడికి తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గు వచ్చాయి. మాకు తెలిసిన కొన్ని మందులు వాడినా లక్షణాలు తగ్గలేదు. గత ఏడాది కూడా చలికాలంలో ఇలాంటి సమస్యే కనిపించి, కొంతకాలం తర్వాత తగ్గింది. మా బాబుకు చలికాలంలోనే ఈ సమస్య వస్తున్నట్లు అనిపిస్తోంది. దానంతట అదే తగ్గిపోతుందని అంతగా పట్టించుకోలేదు. కానీ రోజురోజుకూ సమస్య క్రమంగా పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. మా బాబుకు ఏమైందో తెలియడం లేదు. చలికాలంలోనే ఇలాంటి సమస్య ఎందుకు వస్తోంది. దయచేసి వాడి సమస్యకు తగిన పరిష్కారం చూపించగలరు.
- రాజేశ్వరి, మహబూబ్‌నగర్
మీరు తెలిపిన వివరాలను బట్టి మీ బాబు న్యుమోనియాతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమస్య ఉన్నవారికి వెంటనే చికిత్స ప్రారంభించాలి. ఆలస్యం చేస్తే వ్యాది తీవ్రమైపోయి, శ్వాస ఆడక పరిస్థితి విషమించే అవకాశం ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే న్యుమో నియా ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, వారి సూచించిన జాగ్రత్తలు పాటించండి.
కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు, అధిక చల్లదనం వల్ల ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. దాంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. సులువుగా శ్వాస తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. మీ బాబుకు అన్ని రకాల వ్యాక్సిన్లు వేయించారా లేదా ఒకసారి చూసుకోండి. న్యుమోకోకల్, ఇన్ఫ్లుయెంజా (ఫ్లూ) అనే వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని వేయించడం ద్వారా పిల్లలకు న్యుమోనియా రాకుండా నివారించవచ్చు.
అపరిశుభ్ర వాతావరణం, పోషకాహార లోపం, శిశువులకు మొదటి ఆరు నెలలు తల్లిపాలు ఇవ్వకపోవడం వల్ల న్యుమోనియా వస్తుంది. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి చలికాలం అనర్థాలను నివారించడానికి మీ బాబు శరీరం పూర్తిగా కప్పి ఉండేలా స్వెటర్లు వేయండి. ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో బాబును బయటకు తీసుకెళ్లకండి. వీలైనంత వరకు చలిగాలి తగలకుండా చూడండి. ఈ సీజన్లో చల్లటి పానీయాలు, చల్లటి పదార్థాలు ఇవ్వకపోవడమే మంచిది.
నెఫ్రాలజీ కౌన్సెలింగ్
నా వయు 64 ఏళ్లు. గత రెండేళ్లుగా నేను హైబీపీతో బాధపడుతున్నాను. నిరుడు రక్తపరీక్షలు చేయించుకుంటే క్రియాటినిన్ 6, యూరియా 120 వరకు ఉన్నాయి. నా కిడ్నీలు పనిచేయడం లేదని చెబుతున్నారు. కానీ నాకు ఎలాంటి ఇబ్బందులూ లేవు. నాకు ఇలా ఏ లక్షణాలూ కనిపించకపోయినా లోపల ఏవైనా సమస్యలు ఉండి ఉంటాయా? ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి?
- లోకేశ్వరరావు, నేలకొండపల్లి
మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీరు క్రానిక్ కిడ్నీ డిసీజ్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ జబ్బు వచ్చినవారిలో రెండు కిడ్నీల పనితీరు బాగా తగ్గిపోతుంది. రక్తపరీక్షలూ ఏమీ తెలియకపోవచ్చు. సాధారణంగా అయితే కిడ్నీ పనితీరు 30 శాతం కంటే తగ్గగానే ఈ జబ్బు లక్షణాలు వెంటనే తెలుస్తాయి. కాబట్టి మీరు ఏడాదికి ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం.
హైబీపీ, డయాబెటిస్, కిడ్నీలో రాళ్లు, కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న కుటుంబాల్లో ఎవరికైనా కిడ్నీ వ్యాధులు ఉంటే... వారికి క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి వాళ్లు ప్రతి ఏడాదీ కిడ్నీ ఎంత శాతం పనిచేస్తుందో తెలుసుకునే పరీక్షలు చేయించుకోవాలి. ఈ వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే... కిడ్నీలను కాపాడుకునే వీలు అంత ఎక్కువ.
నా వయసు 48 ఏళ్లు. నేను గత ఏడాదిగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ)తో బాధపడుతున్నాను. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకోవాలన్నారు. ఒకటి లేదా రెండు సార్లు చేయించుకుంటే సరిపోదా?
- రమేశ్‌కుమార్, కరీంనగర్
మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీ కిడ్నీ కేవలం పది నుంచి పదిహేను శాతం మాత్రమే పనిచేస్తోందని అనుకోవచ్చు. క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ)లో ఇలాంటి పరిస్థితే సంభవిస్తుంది. ఈ దశలో మీరు వారానికి మూడుసార్లు తప్పనిసరిగా డయాలసిస్ చేయించుకోవాల్సిందే.
ఒకవేళ మీరు క్రమం తప్పితే ఆ ప్రభావం మీ శరీరంలోని ఇతర కీలక అవయవాల మీద పడే అవకాశం ఉంది. జీవన నాణ్యత కూడా తగ్గుతుంది. పై పరిణామాలను నివారించడానికి మీరు తప్పనిసరిగా క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకోక తప్పదు.
లైఫ్‌స్టయిల్ కౌన్సెలింగ్
ఆస్తమా ఉన్నవారు చలికాలంలో అనుసరించాల్సిన జీవనశైలిలో మార్పులు చెప్పండి.
- శ్రీధర్, తుంగతుర్తి
ఈ సీజన్ ఆస్తమా రోగులకు కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. అయితే కొన్ని జీవనశైలి మార్పులను చేసుకోవడం ద్వారా ఈ సమస్యను చాలావరకు నివారించవచ్చు. మీరు అనుసరించాల్సిన సూచనలివి...
చేతులు కడుక్కోవడం : మీరు వీలైనన్ని ఎక్కువసార్లు మీ చేతుల్ని కడుక్కుంటూ ఉండండి. సబ్బుతో కడుక్కుంటూ ఉండటం వల్ల చేతులకు అంటుకునే జలుబును కలిగించే వైరస్‌లను ముక్కు వరకూ చేరకుండా ఉంచవచ్చు. అలాగే ఇతర హానికారక క్రిములూ కొట్టుకుపోతాయి ఫ్లూని నివారించే వ్యాక్సిన్ తీసుకోండి : చాలా చిన్న వయసు పిల్లలూ, వయసు పైబడిన వారిలో వ్యాధి నిరోధకత తక్కువగా ఉంటుంది. అందుకే వీళ్లు ఆస్తమాకు తేలిగ్గా గురవుతారు. పైగా ఫ్లూను కలుగజేసే క్రిముల వల్ల ఆస్తమా బారినపడే అవకాశాలు మరింత ఎక్కువ. కాబట్టి ఈ సీజన్లో ఫ్లూని నివారించే వ్యాక్సిన్ (ఫ్లూ షాట్) తీసుకోండి.
దీనివల్ల మీకు ఫ్లూ తర్వాతి నిమోనియా వంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కలుగుతుంది చలిమంట, కాలే కట్టెల దగ్గర కూర్చోకండి : చలికాలంలో ఆస్తమా ఉన్నవారికి మంట దగ్గర ఉండటం మరింత ఉపశమనంగా ఉంటే ఉండవచ్చు. కానీ చలిమంట దగ్గర, కాలే కట్టెల వద్ద ఆస్తమా రోగులు కూర్చోకపోవడం మంచిది. కట్టెలపొయ్యి దగ్గర కూర్చొని ఉండటం వల్ల ఆస్తమా రోగులకు ఉపశమనం దొరుకుతుందనుకుంటే పొరబాటే.
ఎందుకంటే చలిమంట, కట్టెలపొయ్యి నుంచి వచ్చే పొగలు, ఆవిర్లు ఊపిరితిత్తులను మరింతగా మండిస్తాయి. ఆస్తమాను ప్రేరేపిస్తాయి నోటిని మూసి ఉంచండి: కేవలం ముక్కుతో మాత్రమే శ్వాసతీసుకుంటూ ఉండాలి. నోటిద్వారా ఎంత మాత్రమూ శ్వాసించకూడదు. ఇక ముక్కుకు ఏదైనా అడ్డంకి ఉంచుకోవడం మరీ మంచిది
ఏసీ ఫిల్టర్లను మార్చుకోండి : మీ ఏసీ ఫిల్టర్లను మార్చుకుంటూ ఉండండి. ఈ ఫిల్టర్లను మార్చుకోవడం క్రమం తప్పకుండా జరగాలి ఇంట్లోనే వ్యాయామం చేయండి : వ్యాయామం ఇంట్లో చేయాలి లేదా ఇన్‌డోర్స్‌లో మాత్రమే జరగాలి వార్మప్ తర్వాతే వ్యాయామాలు : వ్యాయామం చేసే ముందర తగినంత సేపు వార్మప్ ప్రక్రియలతో దానికి సంసిద్ధం కావాలి.
ఇలా వార్మప్ చాలాసేపు చేశాక, వ్యాయామం చేసే వారిలో ఊపిరితిత్తుల పనిసామర్థ్యం పెరుగుతుందనీ, వాళ్లు తక్కువగా ఆస్తమాకు గురవుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. పైగా ఇలాంటివాళ్లు ఆస్తమాకు గురైతే తేరుకోవడమూ చాలా వేగంగా జరుగుతుందనీ పరిశోధనలు పేర్కొంటున్నాయి మందులు తప్పక వాడండి : ఆస్తమాను నివారించే మందులు, ఇన్హేలర్స్ మరచిపోకుండా వాడండి. క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించండి. లక్షణాలు కనిపించన వెంటనే డాక్టర్‌ను కలవండి.