పుణే కార్పొరేషన్లపై ఎంఐఎం కన్ను
పింప్రి, న్యూస్‌లైన్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రెండు స్థానాలను సాధించి శాసనసభలో అడుగుపెట్టిన ఎంఐఎం ఇక మున్సిపాలిటీలపై దృష్టి సారించింది.. రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లలో పాగా వేయడానికి ప్రణాళికలను రూపొందిస్తూ ముందుకు సాగుతోంది. పుణే కార్పొరేషన్లో 20 స్థానాలు, పింప్రి-చించ్వడ్ కార్పొరేషన్లో 13 స్థానాలపై ఎంఐఎం గురి పెట్టింది. పలురాజకీయ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలు కూడా మజ్లిస్ పట్ల ఆకర్షితులవుతున్నట్లు తెలుస్తోంది.
పుణేలో ఇటీవల ముస్లిం రిజర్వేషన్లపై నిర్వహించిన బహిరంగ సభలో ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని శివసేన అడ్డుకున్న సంగతి తెల్సిందే. తన సభకు ఆటంకం కలిగించడంతో ఒవైసీ రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఒక్కడినే అన్ని బహిరంగ సభలలో ప్రసంగిస్తానని సవాల్ విసిరి వెళ్లారు. దీనితొ మరో రెండు సంవత్సరాలలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల సందడి ఇప్పుడే మొదలైంది. పుణే కార్పొరేషన్లో 76 స్థానాలుండగా, పింప్రి-చించ్వడ్లో 64 స్థానాలున్నాయి. రెండింటిలో కలిపి కనీసం 30 స్థానాలను సాధించేందుకు ఎంఐఎం రూట్‌మ్యాప్ సిద్ధం చేస్తోంది.
ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో వంద శాతం విజయం సాధించవచ్చని ఆ పార్టీ భావిస్తోంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను కలుపుకొని వారికి కొన్ని స్థానాలను కేటాయిస్తే, మరిన్ని స్థానాలను పార్టీ ఖాతాలో వేసుకోవచ్చని వ్యూహం రచిస్తోంది. పుణే నగరంలోని కొండ్వాలో (2), గణేష్‌పేట్ నానాపేట్, మంగళవార్ పేట్, జునా మంగళవార్ పేట్, కసబాపేట్, శివాజీనగర్-పాటిల్ ఎస్టేట్, యరవాడా, శాస్త్రినగర్‌లోని వార్డులపై ఎంఐఎం అధ్యయనం చేస్తున్నది.
అలాగే పింప్రి-చించ్‌వడ్‌లోని కాసర్వాడి, జిరాత్వాడి, కాలేవాడి, నెహ్రునగర్, రూపీనగర్, చిఖిలి, కుదల్ వాడి, ఆకృడి, దాపోడీ, చించ్‌వడ్‌లోని వార్డులపై ఎంఐఎం దృష్టి పెట్టింది. ముస్లిం మంచ్‌కు చెందిన అంజుమన్ ఇనాందర్ మాట్లాడుతూ...రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం కేవలం ముస్లిం అభ్యర్థులనే కాకుండా ఆయా వార్డులలోని పరిస్థితులను బట్టి ఇతర అభ్యర్థులను కూడా రంగంలోకి దింపుతామని చెప్పారు.