పుణేకు డెంగీ దడ
పుణే: నగరాన్ని డెంగీ గడగడలాడిస్తోంది. ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 120 కేసులు నమోదయ్యాయి. ఆదివారం నమోదైన రెండు కేసులతో ఈ సంఖ్య 120కి చేరుకుంది. ఇప్పటివరకు ఈ ఏడాదిలో 398 కేసులు నమోదయ్యాయని పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ‘ఆదివారం వరకు 129 పాజిటివ్ కేసులను వైద్యులు గుర్తించారు. ఆగస్టులో 99 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు సెప్టెంబర్‌లోనే అత్యధిక డెంగీ కేసులు నమోదయ్యాయ’ని చెప్పారు. వాతావరణంలో మార్పులు, తరచూ కురిసిన వర్షాలు, భవన నిర్మాణాల వద్ద పెరిగిన దోమల వల్ల ఈ డెంగీ ప్రభావం జూన్ నుంచే కనిపిస్తోందని అన్నారు. వజ్రే, హదప్సర్, కోతూర్ధ్, తిలక్‌రోడ్డు, కర్వేనగర్, ఔద్, ధోలే పాటిల్ రోడ్డు, అహ్మద్‌నగర్ రోడ్డు, సంగంవాడి, భవాని పేట్, విశ్వమ్బాగ్వాడ, బింబ్వేడి, సహకర్ణనగర్, ధంకవాడి ప్రాంతాలలో దోమల సంఖ్య విపరీతంగా ఉందని చెప్పారు. జూన్‌లో 36 డెంగీ కేసులను గుర్తించామని వివరించారు.
జూలైలో 44కి పెరిగిన వీటి సంఖ్య ఆగస్టులో 99కి చేరుకుందని తెలిపారు. గతంలోనే కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల నుంచే డెంగీ రోగుల వివరాలను సేకరించిన కార్పొరేషన్ ఈసారి ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి కూడా జాబితాను తెప్పించుకుంటుందన్నారు. ఈ వ్యాధులను నియంత్రించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామని తెలిపారు. దోమలు ఎక్కువగా ఉన్న ఆయా ప్రాంత భవనవాసులకు లీగల్ నోటీసులు జారీ చేశామన్నారు. పరిశుభ్రతను పాటించాలని కోరామన్నారు. ఈ వ్యాధుల బారిన ప్రజలు పడకుండా ఉండేందుకు ఇంటి ఇంటికి వెళ్లి తీసుకోవాల్సిన నివారణ చర్యల గురించి వివరిస్తున్నామన్నారు. ప్రతి జోన్లో దోమలను చంపేందుకు ఫాగింగ్ చేస్తున్నామని తెలిపారు. ‘మురికి కాల్వ ప్రాంతాల్లో ఫాగింగ్ చేస్తున్నాం. రోజువారీ తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు, వైద్య శిబిరాలను కూడా నిర్వహిస్తున్నాం. వ్యాధుల గురించి ప్రజల్లో జాగృతిని కల్పిస్తున్నాం. వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నామ’ని చెప్పారు. వాతావరణ మార్పుల వల్ల దోమలు పెరుగుతున్నాయన్నారు.