తెలుగు వినాయకులకు విశేష పూజలు
పింప్రి, న్యూస్‌లైన్: పుణే తెలుగు సమాజ్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠిం చిన వినాయక విగ్రహం రోజూ భక్తులతో విశేష పూజలు అందుకుంటోంది. శ్రీ బాలాజీ గణేష్ ఉత్సవ మిత్రమండలి గత పదేళ్లుగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఖడికిరేంజ్ హిల్స్‌లో ఏర్పాటు చేసిన ఈ వినాయక విగ్రహానికి శుక్రవారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖడికి కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు మనీషానంద్, స్థానిక కార్పొరేటర్ సునీల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు ప్రజలు, మరాఠీలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఇదిలాఉండగా స్థానిక తెలుగు మహిళలు మండపం ఆవరణలో రంగురంగుల ముగ్గులు వేసి తెలుగుదనం ఉట్టిపడేలా చేశారు. ప్రతి ఏటా మరాఠీయులతో కలిసి గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని పుణే తెలుగు సమాజ్ అధ్యక్షుడు సుబ్బలక్ష్మయ్య (స్వామి) తెలిపారు. రోజూ సాయంత్రం అధిక సంఖ్యలో తెలుగు మహిళలు ఇక్కడికి తరలి వచ్చి భక్తి పాటలు, కీర్తనలు ఆలపిస్తున్నారని ఆయన తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామన్నారు. శుక్రవారం నాటి పూజల్లో సమితి కార్యాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యదర్శి రాధాకృష్ణ, సభ్యులు పెంచలయ్య, కొండయ్య, కృష్ణంరాజు, పూలయ్య పాల్గొన్నారు.
నిమజ్జనమైన తెలుగుసేన వినాయకుడు
బోరివలి, న్యూస్‌లైన్: గోరేగావ్ పశ్చిమంలోని మోతీలాల్‌నగర్‌లో ముంబై తెలుగుసేన ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడిని శుక్రవారం నిమజ్జనం చేశారు. గోరేగావ్ సముద్రపు ఒడ్డున ఉన్న ఓ నీటిగుంటలో నిమజ్జనం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక శివసేన ఎమ్మెల్యే సుభాష్ దేశాయ్, కార్పోరేటర్ లోచనాచవాన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
తెలుగు యువమిత్ర మండలి ఆధ్వర్యంలో..
ఈ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడు ఐదు రోజులపాటు విశేష పూజలు అందుకొని శుక్రవారం సాయంత్రం నిమజ్జన మయ్యాడు. గోరేగావ్ పశ్చిమం తీన్ డోంగ్రి ప్రాంతంలో ఉండే కరీంనగర్ ప్రజలు గత 1986 నుంచి క్రమం తప్పకుండా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ శ్రమజీవి సంఘం ఆధ్వర్యంలో..
అంధేరి (పశ్చిమం) సుభాష్‌నగర్‌లో నల్గొండ జిల్లా వాసులు ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాన్ని తెలంగాణ డప్పులతో నృత్యాలు చేస్తూ నిమజ్జనం చేశారు. తెలంగాణ అనుకూల ప్రకటన రావడంతో తమ ప్రాంతంలో తొలిసారిగా విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఇదే మొదటిసారని వారు పేర్కొన్నారు. వర్సోవా సముద్రతీరంలో నిమజ్జనం చేశామని సంఘం అధ్యక్షులు నిమ్మల యాదయ్య, కార్యదర్శి ఎన్.నర్సిహ్మ, ఎన్.ఉమ, రామచంద్రం, వై.సురేష్, ఎన్.నాగేష్ తెలిపారు.
52,525 విగ్రహాలకు నిమజ్జనం
సాక్షి, ముంబై: గత ఐదు రోజులుగా పూజలందుకున్న వాటిలో 52,525 వినాయక విగ్రహాలు శుక్రవారం నిమజ్జనమయ్యాయి. ఇందులో ఇళ్లలో ప్రతిష్ఠించినవి 47,735 కాగా, 431 విగ్రహాలు సార్వజనిక మండళ్లకు చెందిన విగ్రహాలు. వీటిలో 5,292 విగ్రహాలను తాత్కాలిక చెరువుల్లో నిమజ్జనం చేశారని కార్పొరేషన్ అధికారి ఒకరు వెల్లడించారు. భక్తులు సముద్రం లోపలికి వెళ్లకూడదని బీఎంసీ అధికారులు హెచ్చరించినా కొంత మంది వినిపించుకోకుండా చాలా దూరం వెళ్లి నిమజ్జనం చేశారని బృహన్ముంబై సార్వజనిక్ గణేషోత్సవ్ సమన్వయ సమితికి చెందిన నరేష్ దహిబావ్కర్ తెలిపారు.
భివండీలో ఘనంగా నిమజ్జనం
భివండీ, న్యూస్‌లైన్: ఐదు రోజుల గణపతి నిమజ్జనోత్సవాలు శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. భక్తులు వినాయకుడికి ఆఖరిహారతి అందించి భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు. తెలుగుప్రజలు అధిక సంఖ్యలో నివసించే పద్మనగర్ నుంచి పెద్ద ఎత్తున గణపతి విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. ఈ ప్రాంతంలోని ప్రతి వీధీ తెలుగువారితో కిటకిటలాడింది. అయితే సార్వజనిక మండళ్లలో చాలా తక్కువ గణపతులు నిమజ్జనానికి వచ్చాయని కార్పొరేషన్ సిబ్బంది తెలిపారు. ఐదు రోజులు పూజలందుకున్న వినాయకుడిని స్థానిక వరాలదేవి చెరువు, కామ్‌వారి నది ఘాట్, ఫేనేఘాట్, కామత్‌ఘర్ ఘాట్, టేమ్ఘర్, నార్‌పోళి, కరవళి ఘాట్ల వద్ద నిమజ్జనం చేశారు. 63 సార్వజనిక గణపతులు, 8,100 ఇంటి గణపతులు, 775 గౌరీగణపతుల విగ్రహాలు నిమజ్జనమయ్యాయని కార్పొరేషన్ తెలిపింది. విగ్రహాలను తోపుడుబళ్లు, లారీలు, టెంపోలు, కార్లలో తీసుకురాగా, కొందరు తలపై పెట్టుకొని ఘాట్లకు వచ్చారు.
ఈ సందర్భంగా భివండీ-నిజాంపుర మున్సిపల్ కార్పొరేషన్ (బీఎన్‌ఎంసీ) నిమజ్జన స్థలాల వద్ద భారీ ఏర్పాట్లు చేసింది. డిప్యూటీ మేయర్ మనోజ్ కాటేకర్, ప్రభాగ్ సమితి-మూడు అధికారి సుధామ్ జాదవ్, సభాపతి మురళి మచ్చ, కార్పొరేటర్లు సంతోశ్ శెట్టి, లక్ష్మీ పాటిల్, సామాజిక కార్యకర్త వినోద్ పాటిల్, అనిల్ పాటిల్ వరాలదేవి ఘాట్ వద్ద భక్తులకు స్వాగతం పలికారు. తెలుగు కార్పొరేటర్ మురళి మచ్చ ఇంట్లో ప్రతిష్ఠించిన గణపతిని ఇదే ఘాట్‌లో నిమజ్జనం చేశారు.