భారత్‌కు ఎఫ్‌డీఐలు కీలకం, వచ్చే మూడేళ్లలో 75 వేల మంది రిక్రూట్
వాషింగ్టన్: భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) కీలకమని డెలాయిట్ సీఈవో పునీత్ రంజన్ అభిప్రాయపడ్డారు. బ్రిటన్, అమెరికా, జపాన్, సింగపూర్ తదితర దేశాల్లో పలువురు ఇన్వెస్టర్లు భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తిగా ఉన్నారని వెల్లడించారు. తాము నిర్వహించిన సర్వేలో పాల్గొన్న 1,200 మంది వ్యాపార దిగ్గజాల్లో అయిదింట రెండొంతుల మంది.. ఇండియాలో అదనంగా పెట్టుబడులు పెట్టడం లేదా తొలిసారిగా ఇన్వెస్ట్ చేయడంపై ఆసక్తి కనపర్చినట్లు ఒక ఇంటర్వ్యూలో రంజన్ చెప్పారు.
విదేశీ పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయ దేశాల్లో ఒకటిగా భారత్ కొనసాగుతోందని ఆయన వివరించారు. ‘కోవిడ్–19పరమైన ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్‌లోకి రికార్డు స్థాయిలో ఎఫ్‌డీఐలు వచ్చాయి. 5 లక్షల కోట్ల ఎకానమీగా ఎదగాలన్న భారత్ లక్ష్యం సాకారం కావడానికి విదేశీ పెట్టుబడులు కీలకం. అంతే కాదు ఇది సాధించతగిన లక్ష్యమే అన్నది నా అభిప్రాయం‘ అని రంజన్ వివరించారు.
ఆకర్షణీయమైన అంశాలు..
సుశిక్షితులైన నిపుణులు, ఆర్థిక వృద్ధి (ముఖ్యంగా దేశీయంగా) వంటి అంశాలు ఎఫ్‌డీఐలను ఆకర్షించేందుకు అనువైన అంశాలుగా ఉంటున్నాయని తమ సర్వేలో తేలినట్లు రంజన్ వివరించారు. ఇన్వెస్టర్లకు భారత్ ఎగుమతి హబ్‌గా ఉపయోగపడటంతో పాటు దేశీ మార్కెట్ కూడా అందుబాటులో ఉండటం ముఖ్యమని ఆయన చెప్పారు.
అయితే, భారత్‌లో వ్యాపారం చేయడమంటే సవాళ్లతో కూడుకున్న వ్యవహారమనే అభిప్రాయం ఇప్పటికీ కొనసాగుతోందన్నారు. ప్రభుత్వం ఇటీవల తీసుకున్న చర్యలు సహా పలు ప్రభుత్వ పథకాలు, ప్రోత్సాహకాలు, సంస్కరణలపై అంతగా అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని రంజన్ అభిప్రాయపడ్డారు. కస్టమర్ల డిజిటైజేషన్, అనుమతుల ప్రక్రియ, ఉత్పత్తికి ప్రోత్సాహకాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి తమకు అంతగా తెలియదని జపాన్‌లో 16 శాతం మంది, సింగపూర్‌లో 9 శాతం మంది వ్యాపార దిగ్గజాలు చెప్పారని ఆయన వివరించారు.
‘ప్రభుత్వం చేస్తున్న అనేక మంచి పనుల గురించి ఇన్వెస్టర్లలో సరైన అవగాహన ఉండటం లేదు‘ అని రంజన్ చెప్పారు. భారత ప్రభుత్వ విధానాలు కచ్చితంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సహాయపడే విధంగానే ఉన్నాయని చెప్పారు. ఇన్ఫ్రాపై ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడం సానుకూలాంశమని పేర్కొన్నారు.
భారత్‌లో 75వేల నియామకాలు..
వచ్చే మూడేళ్లలో భారత్‌లో 75 వేల మందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు రంజన్ చెప్పారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి కూడా తెలియజేసినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం డెలాయిట్‌కు అంతర్జాతీయంగా మొత్తం 3,45,000 మంది సిబ్బంది ఉండగా.. దేశీయంగా 65,000 మంది ఉద్యోగులు ఉన్నారు.