అత్యవసరంలో 'ఆర్వీవరం'
‘‘అమ్మకి హెల్త్ బాగోలేదు. ఇంటి దగ్గర ఒంటరిగా వదిలి వచ్చాను. ఎలా ఉందో ఏమిటో...’’ ఇలా దిగులు పడే నగరవాసులు ఎందరో. పేరెంట్స్ మీద ఎంత ప్రేమాభిమానాలు ఉన్నా...పరుగుల ప్రపంచంలో...వారిని ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉండడం కష్టమే. ఈ సమస్యలకు ఇప్పటికే మార్కెట్లో చలామణీలో ఉన్న పరిష్కారాలకు భిన్నంగా వినూత్న శైలి పరికరాన్ని అందుబాటులోకి తెచ్చారు నగరానికి చెందిన యువ బృందం.
సాక్షి, సిటీబ్యూరో: టీవీ చూస్తూ ఇంట్లోనే కుప్పకూలిపోయిన మహిళ, బాత్రూమ్లో గుండెపోటు... ఇలాంటి వార్తలు, విషయాలు వింటూనే ఉన్నాం. ఒంటరి జీవితాలు పెరిగిపోతున్న నేటి రోజుల్లో ప్రాణాపాయం ఎటువైపు నుంచి ఎప్పుడు ముంచుకొస్తుందో తెలియని దుస్థితి. మరోవైపు వృద్ధుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ‘‘ఉద్యోగ, వ్యాపారాల దృష్ట్యా తమ తల్లిదండ్రులకు పిల్లలు దూరంగా ఉంటున్నారు. అలా ఉన్న ప్రతి ఒక్కరికీ తమ తల్లిదండ్రుల ఆరోగ్యం, ఎమర్జన్సీ కేర్ గురించిన ఒత్తిడిì కి గురయ్యేవీరికి సీనియర్ సిటిజన్స్‌కు 24/7 వైద్యసేవలను అందించే మార్గం తెలిస్తే అంతకు మించిన ప్రశాంతత ఏదీ ఉండదు’’అని చెప్పారు నగరానికి చెందిన సుశాంత్‌రెడ్డి. తమ స్టార్టప్ ఆర్వీ (్చటఠిజీ.జీn)గురించిన విశేషాలు ఆయన మాటల్లోనే...
పిచ్చాపాటినుంచి పుట్టినఆలోచన..
ముంబయ్‌లో ఐఐటీ చదివి సింగపూర్, అమెరికాలో ఎంబీఏ చేశాను. ఆ సమయంలో నా మిత్రులతో మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా ఇండియాలో ఉన్న పేరెంట్స్ వైద్య సేవల గురించి ప్రస్తావన వచ్చేది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసుకుంటూ వృద్ధులకు అత్యవసర వైద్య సేవలను అందించడం అనేది మన దేశంలో ఇంకా చాలా తక్కువ స్థాయిలోనే ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆధునిక టెక్నాలజీని సమర్థంగా వినియోగించడం ద్వారా పెద్దలకు అత్యంత వేగవంతమైన విశ్వసనీయమైన వైద్య సేవల్ని అందించాలని మిత్రుడు అవినాష్, డాక్టర్ చందనలతో కలిసి ఆర్వీ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టాం.
బటన్‌నొక్కితే చాలు...
అర్వీ అనేది ఒక స్మార్ట్ మెడికల్ సిస్టమ్. ఇంట్లోని వాష్‌రూమ్, బెడ్రూమ్, హాల్, కిచెన్ పలు కీలక ప్రదేశాల్లో డివైజ్ అమరుస్తాం. ఈ పరికరానికి రెడ్, గ్రీన్ రంగుల్లో రెండె బటన్స్ ఉంటాయి. అత్యవసర సమయాల్లో డివైజ్ మీద ఉన్న రెడ్ బటన్‌ను నొక్కితే సైరన్ వస్తుంది. ఆటోమేటిగ్గా ఆర్వీ టీమ్ అప్రమత్తమవుతుంది. ఇరుగు పొరుగువారికి ఎస్సెమ్మెస్‌లు వెళతాయి. బాధితునికి, ఎమర్జన్సీ డాక్టర్‌కు మధ్య హాట్‌లైన్ ఏర్పాటవుతుంది. కనీసం నలుగురు కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు ఫీడ్ చేసి ఉంచుతాం కాబట్టి వారికి కాల్స్ వెళతాయి. అలాగే మా కాల్ సెంటర్‌కి కాల్ వస్తుంది. ఏ ప్లేస్‌లో ఎటువంటి స్థితిలో ఉండి బటన్ పుష్ చేశారో తెలిసిపోతుంది కాబట్టి దాని ప్రకారం ఎమర్జన్సీని అంచనా వేస్తాం. మా కాల్కి రెస్పాండ్ కాకపోయినా సరే జీపీఎస్ సాంకేతికత సహయంతో వారుండే ప్రదేశానికి అంబులెన్స్‌తో సహా చేరుకుంటాం. ఈ డివైజ్ 100 మీటర్ల వరకూ పనిచేస్తుంది. అలాగే నాన్ ఎమర్జన్సీ సమయంలో గ్రీన్ బటన్ ప్రెస్ చేస్తే మెడికల్ డెలివరీ, డాక్టర్ అపాయింట్ మెంట్, ఇంటి దగ్గరే హెల్త్ చెకప్స్ వంటి సేవలు లభిస్తాయి.
ఒప్పందాలతో సేవల విస్తరణ..
ప్రస్తుతం ఆర్వీ సంస్థ 350 మంది డాక్టర్స్, నర్సింగ్ సిబ్బంది, అంబులెన్స్, ఫిజియోథెరఫి, ఫార్మసీ ఇలా అన్ని రకాల వైద్యసదుపాయాలతో ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేసింది. మా కాల్ సెంటర్లలో కూడా ఫిజియోథెరపిస్ట్స, నర్సింగ్, డయాగ్నస్టిక్స్, ఫార్మసీ...బ్యాగ్రవుండ్ ఉన్నవారినే కాల్ సపోర్ట్‌కి తీసుకుంటున్నాం. ప్రస్తుతం వృద్ధుల అత్యవసర సేవల గురించి యాప్స్ అందుబాటులో ఉన్నప్పటికీ అవి ఉపయోగించడం అందరికీ రాకపోవచ్చు. కరీంనగర్, వరంగల్ వంటి ప్రాంతాల నుంచి . ఎన్ఆర్ఐలు ఎక్కువ ఉన్నారు అక్కడి నుంచి బాగా ఎంక్వయిరీలు వస్తున్నాయి. త్వరలో ఈ రెండు నగరాలకు విస్తరిస్తున్నాం. డిమెన్షియా వంటి సమస్యలున్న వృద్ధుల కోసం సెన్సర్లు డెవలప్ చేస్తున్నాం.. తద్వారా వీరు మతిమరపుతో జియో ఫెన్సింగ్ దాటి బయటకు వెళితే సంబంధీకులకు హెచ్చరికలు పంపుతాం.