pushpak bus
-
పుష్పక్ బస్సుల్లో డిజిటల్ సేవలు.. అలా చేస్తే చార్జీలపై 10 శాతం రాయితీ
సాక్షి, హైదరాబాద్: పుష్పక్ బస్సుల్లో డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం, తదితర మొబైల్ యాప్‌ల ద్వారా టికెట్ చార్జీలను చెల్లించవచ్చు. ఇందుకోసం కొత్తగా ఇంటెలిజెన్స్ టికెట్ ఇష్యూ మిషన్లను ప్రవేశపెట్టారు. నగదు, డిజిటల్ రూపంలోనూ చార్జీలు చెల్లించే విధంగా ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మరోవైపు ‘టీఎస్ఆర్టీసీ ట్రాక్’ ద్వారా ప్రయాణికులు తాము బయలుదేరే మార్గంలో పుష్పక్ బస్సుల జాడను కనిపెట్టవచ్చు. ఈ అధునాతన సాంకేతిక వ్యవస్థను కొద్ది రోజుల క్రితమే ఆర్టీసీ ప్రవేశపెట్టింది. ప్రయాణికులు బయలుదేరే సమయానికి అనుగుణంగా అందుబాటులో ఉండే పుష్పక్ బస్సుల వివరాలు మొబైల్ ఫోన్లో లభిస్తాయి. దీంతో బస్సు కోసం ప్రత్యేకంగా ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా సకాలంలో ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల వేళలకు అనుగుణంగా పుష్పక్ బస్సులను 24 గంటల పాటు నడుపుతున్న సంగతి తెలిసిందే. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగిస్తున్న 40 పుష్పక్ బస్సులకు కొంతకాలంగా ప్రయాణికుల ఆదరణ పెరిగింది. ఈజీగా బస్సు.. ►జేబీఎస్, సికింద్రాబాద్ నుంచి తార్నాక, ఉప్పల్ల మీదుగా ఎయిర్‌పోర్టుకు కొన్ని బస్సులు నడుస్తుండగా, బేగంపేట్ పర్యాటక భవన్ నుంచి మెహిదీపట్నం, ఆరాంఘర్‌ల మీదుగా మరికొన్ని బస్సులు నడుస్తున్నాయి. అలాగే కేపీహెచ్‌బీ జేఎన్టీయూ నుంచి గచ్చిబౌలి మీదుగా ఔటర్ మార్గంలో ఇంకొన్ని బస్సులు ఎయిర్‌పోర్టుకు అందుబాటులో ఉన్నాయి. ►ప్రయాణికుల నిరాదరణ కారణంగా తీవ్ర నష్టాల్లో ఉన్న ఈ బస్సులు కొద్ది రోజులుగా మెరుగైన ఫలితాలను సాధిస్తున్నాయి. ఆక్యుపెన్సీ రేషియో 45 నుంచి 60 శాతానికి పెరిగింది. ప్రస్తుతం సుమారు 4500 మందికి పైగా ప్రయాణికులు ప్రతి రోజు ఈ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. ►ప్రయాణికులను పుష్పక్ సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రవేశపెట్టిన డిజిటల్ చెల్లింపులు, వెహికిల్ ట్రాకింగ్ వల్ల గత నెల రోజుల వ్యవధిలో సుమారు 500 మందికి పైగా ప్రయాణికులు అదనంగా వచ్చి చేరినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. తిరుమల దర్శనం... ►మరోవైపు పుష్పక్ బస్సుల్లో తాజాగా లక్కీ డిప్‌లను ఏర్పాటు చేశారు. వారానికి ఒకసారి ఈ లక్కీడిప్ ద్వారా ముగ్గురు ప్రయాణికులను ఎంపిక చేసి వారికి తిరుమలలో ఉచిత దర్శనం కల్పిస్తారు. ఆర్టీసీ బస్సుల్లో తిరుపతికి వెళ్లేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇందుకోసం పుష్పక్‌లో ప్రయాణం అనంతరం టికెట్ వెనుక పేరు, ఫోన్ నంబర్ రాసి లక్కీడిప్ బాక్సుల్లో వేస్తే సరిపోతుంది. టికెట్లపై రాయితీలు.. ►హైదరాబాద్ నుంచి దేశంలోని వివిధ నగరాలకు బయలుదేరే ప్రయాణికులు ఇంటి నుంచి ఎయిర్‌పోర్టుకు, తిరిగి ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి ఒకేసారి టికెట్లను కొనుగోలు చేయవచ్చు. ఇలా తీసుకొనే టికెట్లపై 10 శాతం వరకు తగ్గింపు ఉంటుంది. కనీసం ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తే 20 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ వెంకన్న తెలిపారు. ►ఎయిర్‌పోర్టు నుంచి నగరానికి వచ్చే వారు పుష్పక్ బస్సుల్లో ప్రయాణం చేస్తే మరో 3 గంటల పాటు వాళ్లు అదే టిక్కెట్ పై సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఉదాహరణకు ఎయిర్‌పోర్టు నుంచి జేబీఎస్‌కు వచ్చినవారు అక్కడి నుంచి ఎక్కడికైనా సిటీ బస్సుల్లో వెళ్లవచ్చు. పర్యావరణ పరిరక్షణను ఆదరించండి పుష్పక్ బస్సులు వంద శాతం పర్యావరణహితమైనవి. విద్యుత్‌తో నడిచే ఈ బస్సులను ప్రయాణికులు ఆదరించడం వల్ల పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లవుతుంది. – వెంకన్న, ఆర్టీసీ రీజినల్ మేనేజర్, సికింద్రాబాద్ -
పెరుగుతున్న విమాన ప్రయాణికులు.. వారి కోసం స్పెషల్‌గా..
సాక్షి, హైదరాబాద్: విమాన ప్రయాణాలు చేసేవారి సంఖ్య పెరుగుతుండటంతో అందుకనుగుణంగా నగరంలో అదనంగా పుష్పక్ బస్ షెల్టర్లను ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. సాధారణ బస్షెల్టర్ల మాదిరిగా కాకుండా ప్రయాణికులకు తగిన సదుపాయాలతో వీటిని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే వారికి పీపీపీ విధానంలో అవకాశం కల్పిస్తూ ఏర్పాట్లు చేసేందుకు టెండరు దక్కించుకునే ఏజెన్సీతో జీహెచ్ఎంసీ ఒప్పందం కుదుర్చుకోనుంది. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) పద్ధతిలో వీటిని అందుబాటులోకి తేనున్నారు. జీహెచ్ఎంసీ పేర్కొన్న నిబంధనలకనుగుణంగా బస్షెల్టర్లను తగిన సదుపాయాలతో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. షెల్టర్ల ప్యానెల్స్‌పై ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎంపికైన ఏజెన్సీ పొందుతుంది. ఈ ఒప్పందం పదేళ్ల వరకు అమలులో ఉంటుందని సంబంధిత అధికారి తెలిపారు. షెల్టర్ ఏర్పాటు ఇలా.. షెల్టర్‌ను 25్ఠ8 అడుగుల విస్తీర్ణంతో తగిన వెంటిలేషన్ ఉండేలా అల్యూమినియం గ్రిల్స్, పీవీసీ స్లైడింగ్ గ్లాస్ విండోస్ తదితరమైన వాటితో ఏర్పాటు చేయాలి. షెల్టర్‌లో మొబైల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లు చార్జింగ్ చేసుకునే సదుపాయంతోపాటు లైటు, ఫ్యాను, కూర్చునేందుకు సదుపాయాలుండాలి. జీహెచ్ఎంసీ సూచించిన డిజైన్ కనుగుణంగా వీటిని ఏర్పాటు చేయాలి. జీహెచ్ఎంసీ ఆమోదంతో స్వల్ప మార్పులు చేయవచ్చు. తగిన పెట్టుబడి ధనాన్ని కలిగి ఉండటంతోపాటు బస్షెల్టర్ల ఏర్పా టు, నిర్వహణలో గతంలో అనుభవమున్నవారే వీటిని ఏర్పాటు చేసేందుకు అర్హులని పేర్కొన్నారు. నిర్వహణ ఇలా.. ► నిబంధనల మేరకు టెండరు పొందే ఏజెన్సీ ఆపరేషన్‌లో భాగంగా దిగువ పేర్కొన్న అంశాలు పాటించాలి. అన్ని బస్షెల్టర్లు, వాటి పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. చెత్తడబ్బాలు పూర్తిగా నిండకముందే చెత్త ఖాళీ చేయాలి. ప్రకటనల ప్యానెల్స్ దుమ్ము, మరకలు లేకుండా ఎల్లవేళలా శుభ్రంగా ఉండాలి. పోస్టర్ల వంటివి అతికించరాదు. ► పైకప్పు నుంచి లీకేజీలు ఉండరాదు. నీరు, ద్రవాల వంటివి నిల్వ ఉండరాదు. తగిన డ్రైనేజీ ఏర్పాట్లుండాలి. లైటింగ్ ఏర్పాట్లు ఎల్లవేళలా ఉండాలి. ఎలక్ట్రికల్ సేఫ్టీ ఏర్పాట్లుండాలి. ఫ్లోర్ టైల్స్ పగిలిపోతే, మూడు రోజుల్లోగా తిరిగి ఏర్పాటు చేయాలి. షెల్టర్లలో ఉండే సిబ్బంది చదువుకున్నవారై ఉండి,ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాలి. వృద్ధులు, శారీరక వికలాంగులకు అవసరమైన సహాయం చేయాలి. వీటితోపాటు మరికొన్ని నిబంధనలు పాటించాలి. విఫలమైతే ఒక్కో బస్‌షెల్టర్‌కు రోజుకు రూ.2వేల వంతున పెనాల్టీ విధించేందుకు జీహెచ్ఎంసీకి అధికారం ఉంటుంది. కొత్తగా పుష్పక్ బస్షెల్టర్లు ఏర్పాటు కానున్న ప్రదేశాలివే: నాగోల్ క్రాస్‌రోడ్, ప్యాట్నీ, రాణిగంజ్, లక్డీకాపూల్, ఎన్ఎండీసీ, మెహిదీపట్నం, ఆరాంఘర్, యాత్రినివాస్, బేగంపేట్, నిమ్స్, కేర్ హాస్పిటల్, నిజాంపేట్ క్రాస్‌రోడ్, ఫోరమ్‌మాల్, మలేషియన్ టౌన్‌సిప్, బయో డైవర్సిటీ, గచ్చిబౌలి ఓఆర్ఆర్, మదీనగూడ, కొండాపూర్, కొత్తగూడ, ర్యాడిసన్ హోటల్. (వీటిలో ఎన్ఎండీసీ, మెహిదీపట్నం, గచ్చిబౌలి ఓఆర్ఆర్, ఆరామ్‌ఘర్‌ల వద్ద రెండేసి బస్షెల్టర్ల చొప్పున మొత్తం 24 బస్షెల్టర్లను ఎంపికయ్యే ఏజెన్సీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.) చదవండి: జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం: దారుణాలకు ఆ వాహనాలే కారణమా? -
డబుల్’ ధమాకా! టికెట్ పైనే రెండు గంటలు ఉచిత ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: పుష్పక్ బస్సుల్లో ఎయిర్‌పోర్టు నుంచి నగరంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు డబుల్ ధమాకా. ఎయిర్‌పోర్టు నుంచి పుష్పక్‌లో టికెట్ తీసుకున్నప్పటి నుంచి రెండు గంటల పాటు ఉచిత ప్రయాణం వర్తిస్తుంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రమయానికి నడిచే పుష్పక్ బస్సుల్లో ప్రయాణికుల భర్తీ సామర్థ్యాన్ని పెంచుకొనేందుకు ఆర్టీసీ వినూత్నమైన పథకానికి శ్రీకారం చుట్టింది. మరో వారం, పది రోజుల్లో ఇది అందుబాటులోకి రానుంది. విమానాశ్రయం నుంచి పుష్పక్‌లో వచ్చే ప్రయాణికులు తీసుకొనే టికెట్లపైనే ఈ రెండు గంటల ఉచిత ప్రయాణం నమోదై ఉంటుంది. ఎయిర్‌పోర్టు ప్రయాణికులకు నాణ్యమైన, మెరుగైన రవాణా సదుపాయాన్ని అందజేసేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందిస్తోంది. ఠంచన్‌గా పుష్పక్... ప్రస్తుతం 39 పుష్పక్ బస్సులు నగరంలోని జేఎన్టీయూ, పర్యాటక భవన్, సికింద్రాబాద్, తదితర ప్రాంతాల నుంచి వివిధ మార్గాల్లో ఎయిర్‌పోర్టు వరకు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాణికుల అవసరాలకనుగుణంగా ఈ బస్సులు 24 గంటల పాటు అందుబాటులో ఉండేవిధంగా నడుపుతున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి తిరిగి వచ్చేటప్పుడు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. 70శాతం ఆక్యుపెన్సీతో బస్సులు నడుస్తున్నాయి. కానీ నగరం నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లే సమయంలోనే 25 నుంచి 30 శాతం వరకే ఆక్యుపెన్సీ నమోదవుతోంది. ఫ్లైట్ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు వెళ్లేటప్పుడు క్యాబ్‌లు, ఇతర వాహనాల్లో వెళ్తున్నట్లు ఆర్టీసీ గుర్తించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని సిటీ నుంచి బయలుదేరే ప్రతి బస్సు కచ్చితమైన సమయపాలన పాటించేవిధంగా చర్యలు చేపట్టారు. బస్సుల సమయపాలనపై ప్రయాణికులకు నమ్మకాన్ని కలిగించేందుకు విస్తృతంగా ప్రచారం చేపట్టనున్నారు. బస్సుల్లో, బస్‌షెల్టర్‌లో కచ్చితమైన వేళలను ప్రదర్శించనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పుష్పక్‌ల నిర్వహణపై ఎప్పటికప్పుడు ప్రయాణికుల స్పందన తెలుసుకొనేందుకు ప్రత్యేక క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేస్తారు. ప్రయాణికుల నుంచి అందే సమాచారం ఆధారంగా బస్సుల నిర్వహణలో మార్పులు, చేర్పులు ఉంటాయి. ఫ్లైట్ వేళలతో అనుసంధానం.. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రస్తుతం ప్రతి రోజు సుమారు 190కిపైగా జాతీయ విమాన సర్వీసులు, మరో 30కిపైగా అంతర్జాతీయ విమానాసర్వీసులు నడుస్తున్నాయి. రోజుకు 40 వేల నుంచి 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. పుష్పక్‌లను వినియోగించుకొనేవారి సంఖ్య 5వేలు మాత్రమే. కనీసం మరో 10 వేల మంది ప్రయాణికులను పెంచుకోగలిగినా పుష్పక్ బస్సుల్లో ఆక్యుపెన్సీ గణనీయంగా పెరుగుతుందని అధికారుల అంచనా. ఇందుకనుగుణంగా విమానాల వేళలను దృష్టిలో ఉంచుకొని ప్రతి బస్సు సకాలంలో ఎయిర్‌పోర్టుకు చేరేవిధంగా పుష్పక్‌ల నిర్వహణపై ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు. (చదవండి: వడివడిగా ‘స్టడీ’...నిరుద్యోగులకు ప్రత్యేక కోచింగ్) -
మరోసారి ప్రయాణికులతో కలిసి..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరోసారి బస్సులో ప్రయాణం చేశారు. ప్రయాణికులతో ముచ్చటించారు. శుక్రవారం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పంజగుట్ట వరకు పుష్పక్ బస్సులో ప్రయాణించి మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తదితర రాష్ట్రాలకు చెందిన ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. మరిన్ని మెరుగైన సేవలందజేసేందుకు వారి సలహాలు, సూచనలను కోరారు. ఆయా రాష్ట్రాల్లో ఆర్టీసీల సేవలపైనా ఆరా తీశారు. కాగా, విధి నిర్వహణలో అనారోగ్యానికి గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆర్టీసీ డ్రైవర్ అంజయ్యను సజ్జనార్ పరామర్శించారు. డ్రైవర్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. నిమ్స్ డైరెక్టర్ మనోహర్‌తో మాట్లాడి మెరుగైన వైద్యం అందజేయాలని కోరారు. -
పుష్పక్ బస్సు దగ్ధం.... ప్రయాణికులు క్షేమం
హైదరాబాద్ : పుష్పక్ ఆర్టీసీ బస్సులో సోమవారం అర్థరాత్రి మంటలు చెలరేగాయి. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రయాణికులు సురక్షింగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే అయిదుగురు ప్రయాణికులతో శంషాబాద్ విమానాశ్రయానికి వెళుతున్నపుష్పక్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గత రాత్రి 11 గంటల సమయంలో సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ వెళ్తున్న ఈ బస్సు ఆరాంగడ్ చౌరాస్తా దాటి కొద్ది దూరం వెళ్లగానే వెనక ఇంజన్ నుంచి మంటలు రావటాన్ని డ్రైవర్ గమనించాడు. దాంతో వెంటనే బస్సును ఆపివేశాడు. బస్సులో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా కిందికి దిగారు. ఆ వెంటనే మంటలు వ్యాపించి బస్సుంతా పూర్తిగా తగలబడిపోయింది. రెండు ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరుకునే సరికే బస్ పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. డ్రైవర్ అప్రమత్తతతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.