రాంగ్‌కాల్‌తో మోసం
అమడగూరు : అమడగూరు మండలం ఎ.పుట్లవాండ్లపల్లికి చెందిన కేశవ అనే వ్యక్తి తనకొచ్చిన ఓ రాంగ్‌కాల్‌తో నిలువునా మోసపోయాడు. ఇరవై రోజుల కిందట వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో సెల్: 7065635979 నంబర్‌తో ఓ ఫోన్ కాల్ వచ్చింది. ‘మీ ఫోన్ నంబరుకు శ్యామ్‌సంగ్ జే7, ఫోన్ ఆఫర్‌గా వచ్చిందని’ అవతలి వ్యక్తి చెప్పాడు. మార్కెట్లో ఆ ఫోన్ ధర రూ.16 వేలు, ఉండగా మీకు ఆఫర్ కింద కేవలం రూ.4 వేలకే ఇస్తున్నట్లు తెలిపాడని, అడ్రస్ చెప్తే పోస్ట్‌కు పంపిస్తామని, డబ్బులు చెల్లించి మీఫోన్‌ను తీసుకోవచ్చని తెలిపాడన్నారు.
అతను చెప్పిన ప్రకారం బుధవారం ఉదయం సెల్: 8510995234 నంబర్‌తో మరో కాల్ రాగా, ‘మీ సెల్‌ఫోన్ పోస్టులో ఉందని, వెళ్లి తీసుకోవాల్సిందిగా తెలిపాడన్నారు. పోస్టాఫీసుకు వెళ్లి రూ.4 వేలు చెల్లించగా, శ్రీసాయి ఎంటర్ ప్రైజస్-ఢిల్లీ పేరుతో వచ్చిన పార్శిల్‌ను తనకు అందిచారని, వాటిని తెరచి చూస్తే.. సెల్‌ఫోన్‌కు బదులు లక్ష్మీబొమ్మ, రెండు బిల్లలు, ఒక యంత్రం ఉన్నాయని బాధితుడు లబోదిబోమన్నారు. ఏం చేయాలో తోచక బాధితుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు.