Pyar mein Padipoyane
-
నన్ను కన్నడంలోకి రమ్మంటున్నారు!
ప్రేమకావాలి, లవ్లీ, సుకుమారుడు... ఈ మూడు సినిమాలతోనే ప్రామిసింగ్ హీరోల జాబితాలో చేరిపోయారు ఆది. అటు తాత పీజే శర్మ, ఇటు తండ్రి సాయికుమార్ వారసత్వాన్ని నిలబెట్టారు. ఆది హీరోగా రవి చావలి దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ‘ప్యార్ మే పడిపోయానే’ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు ఆది. ఆ వివరాలివి... ‘సుకుమారుడు’ నాకో గుణపాఠం ‘సుకుమారుడు’ నిర్మాణంలో ఉన్నప్పుడే నా శ్రేయోభిలాషులు చాలామంది... ‘నీకు ప్రేమకథలే బాగుంటాయి. ఇలాంటి సినిమాలు అచ్చిరావు’ అని చెప్పారు. వాళ్లు చెప్పినట్లుగానే... ‘సుకుమారుడు’ సరిగ్గా ఆడలేదు. నిజంగా అది నాకో గుణపాఠం. నా సినీ జీవితంలో విజయాలుగా చెప్పుకునే ప్రేమకావాలి, లవ్లీ సినిమాలు ప్రేమకథలే. అందుకే... ‘సుకుమారుడు’ తర్వాత ప్రేమకథనే చేయాలనుకున్నాను. సరిగ్గా ఆ సమయంలోనే రవిచావలి నాకీ కథ చెప్పారు. వెంటనే అంగీకారం తెలిపా. ముందు అలా, తర్వాత ఇలా... ప్రేమ విఫలమైతే... హృదయం బద్దలైపోయినట్లు భావించడం, నిరాశ నిస్పహలకు లోనుకావడం... ఇందులోని నా పాత్రకు అస్సలు నచ్చదు. కానీ... తర్వాత ప్రేమ లేకపోతే... బతకలేనంత స్థాయికి వస్తా. రవి చావలి సినిమాలు ఎక్కువ శాతం సామాజిక దృక్పథంతో సాగుతాయి. కానీ ఈ సినిమాలో అలాంటివేం ఉండవ్. కేవలం ప్రేమ, వినోదం మాత్రమే ఉంటుంది. రాధామోహన్ నిజంగా సాహసవంతమైన నిర్మాత. విడుదల విషయంలో మూడ్రోజుల క్రితం నిర్ణయం తీసుకొని ధైర్యంగా విడుదల చేస్తున్నారు. ఆరుపలకల దృఢకాయునిగా మారా నేను ఆరు పలకల దృఢకాయునిగా మారిన మాట నిజం. అయితే... అది ‘ప్యార్ మే పడిపోయానే’ కోసం కాదు. ‘రఫ్’ సినిమా కోసం. కథ రీత్యా ఆ సినిమాకు ఆరు పలకల దేహం అవసరం. అందుకే చేశా. లొకేషన్లో నా దృఢకాయానికి మంచి స్పందన వచ్చింది. ప్రేక్షకులు కూడా మెచ్చుకుంటారనుకుంటున్నా. నాన్నతో కలిసి నటిస్తా... కానీ! చాలామంది ‘మీ నాన్నతో కలిసి ఎప్పుడు నటిస్తావు’ అని అడుగుతున్నారు. కలిసి నటించాలని కథ వెతుక్కోకూడదు. మేం ఇద్దరం కలిసి నటించేంత మంచి కథ కుదరాలి. అందులో నాన్న పాత్ర... ఆయన ఇమేజ్‌కి తగ్గట్టుగా శక్తిమంతంగా ఉండాలి. నా ఇమేజ్‌కి తగ్గట్టుగా నా పాత్ర కుదరాలి. ఇవన్నీ కుదరాలంటే... సాధారణమైన విషయం కాదు. నాన్న కన్నడంలో పెద్ద స్టార్ కావడంతో నన్ను కూడా కన్నడ పరిశ్రమకు పరిచయం చేయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. కానీ... దానికి చాలా సమయముంది. ఇప్పుడు కనుక నేను కన్నడంలో నటించాలనే నిర్ణయం తీసుకుంటే... ‘తెలుగులో నెట్టుకురాలేక కన్నడ బాట పట్టాడు’ అనే విమర్శలొస్తాయి. అందుకే... ముందు ఇంట గెలిచి, తర్వాత రచ్చ గెలుస్తా. -
ప్యార్ మే పడిపోయానే మూవీ స్టిల్స్
-
ప్రేమలో పడిపోయారు!
ప్రేమకథలకు ట్రెండ్‌తో సంబంధం లేదు. మంచి కథాంశంతో తెరకెక్కిస్తే విజయం ఖాయం. ఆ నమ్మకంతోనే శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె. రాధామోహన్ ‘ప్యార్ మే పడిపోయానే’ చిత్రం నిర్మిస్తున్నారు. ఆది, శాన్వి జంటగా రవి చావలి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుపుకుంటోంది. ఈ నెల 13న పాటలను, 25న సినిమాని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఓ క్యూట్ లవ్‌స్టోరీ తీద్దామనుకుంటున్న సమయంలో రవి చావలి ఈ కథ చెప్పారు. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే కథతో ఈ చిత్రం చేశాం. ఇప్పటివరకు ఆది నటించిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. ఈ చిత్రానికి అనూప్ అద్భుతమైన పాటలిచ్చారు’’ అన్నారు. ఇదొక మంచి మ్యూజికల్ లవ్‌స్టోరీగా నిలుస్తుందనే నమ్మకం ఉందని, చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎం.ఎస్. కుమార్ తెలిపారు. -
ఇకపై ఏడాదికి మూడు సినిమాలు చేస్తాను!
‘‘ఓ క్యూట్ లవ్‌స్టోరి చేద్దామనుకుంటున్న సమయంలో రవిచావలి ఈ కథ చెప్పారు. సంగీతభరితంగా సాగే ఈ ప్రేమకథలో నా పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది’’ అని ఆది చెప్పారు. రవిచావలి దర్శకత్వంలో ఆది నటిస్తున చిత్రం ‘ప్యార్ మే పడిపోయానె’. శాన్వి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కె.కె.రాధామోహన్ నిర్మాత. సోమవారం తన పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆది మాట్లాడుతూ- ‘‘నటునిగా ఇది నా నాలుగో చిత్రం. దర్శకుడు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. అనూప్ పాటలు ఈ చిత్రానికి ఆభరణాలు. యాభై శాతం చిత్రీకరణ పూర్తయింది. అందరి సహకారంతో వచ్చే ఏడాది మూడు సినిమాలు రిలీజ్ చేయాలనుకుంటున్నా’’ అని చెప్పారు. రవి చావలి ద్వారానే ఆది, ఆర్.ఆర్.మూవీస్ వెంకట్‌కి పరిచయం అయ్యాడని, ఇప్పుడు రవి దర్శకత్వంలో ఆది నటించడం చాలా ఆనందంగా ఉందని, టైటిల్‌కి, ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన లభిస్తోందని సాయికుమార్ అన్నారు. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం ఇదని, ఆది డాన్సులు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని, ఆయనలోని ఎనర్జీని చూసి, అందుకు తగ్గట్టుగా కథను ఇంకా మెరుగుపరిచామని దర్శకుడు చెప్పారు. ఈ షెడ్యూల్ జనవరి 11 వరకూ జరుగుతుందని, ఫిబ్రవరిలో పోస్ట్‌ప్రొడక్షన్ మొదలవుతుందని నిర్మాత తెలిపారు. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో ఆది జరుపుకోవాలని పీజే శర్మ ఆకాంక్షించారు. మళ్లీ ఆదితో నటిస్తుండటం పట్ల శాన్వీ ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి కెమెరా: టి.సురేందర్‌రెడ్డి, కూర్పు: కె.వి.కృష్ణారెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్.కుమార్. -
ప్రేమలో పడిపోయాడే...
సామాన్యుడు, శ్రీమన్నారాయణ తదితర చిత్రాల దర్శకుడు రవి చావలి దర్శకత్వంలో ‘లవ్లీ’ పెయిర్ ఆది, శాన్వి నటిస్తున్న చిత్రం ‘ప్యార్ మే పడిపోయానె’. కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘మా సంస్థ నుంచి వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రమిది. రవి చావలి చెప్పిన కథ అద్భుతంగా ఉండటంతో చిత్రాన్ని స్టార్ట్ చేశాం. ‘లవ్లీ’ తర్వాత ఆది, శాన్వి కలిసి నటిస్తున్న ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుంది’’ అని నమ్మకం వ్యక్తం చేశారు. హీరోగా తనకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని, ప్రస్తుతం జరుగుతున్న తొలి షెడ్యూల్ డిసెంబర్ 8 వరకూ జరుగుతుందని ఆది తెలిపారు. ఆదితో మళ్లీ కలిసి నటించడం పట్ల శాన్వి ఆనందం వ్యక్తం చేశారు. అలీ, కాశీ విశ్వనాథ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: టి.సురేందర్‌రెడ్డి, కూర్పు: కె.వి.కృష్ణారెడ్డి, కళ: కె.వి.రమణ, కార్యనిర్వాహక నిర్మాత: ఎం.ఎస్.కుమార్.