నన్ను కన్నడంలోకి రమ్మంటున్నారు!
ప్రేమకావాలి, లవ్‌లీ, సుకుమారుడు...
ఈ మూడు సినిమాలతోనే ప్రామిసింగ్ హీరోల జాబితాలో చేరిపోయారు ఆది. అటు తాత పీజే శర్మ, ఇటు తండ్రి సాయికుమార్ వారసత్వాన్ని నిలబెట్టారు. ఆది హీరోగా రవి చావలి దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ‘ప్యార్ మే పడిపోయానే’ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు ఆది. ఆ వివరాలివి...
‘సుకుమారుడు’ నాకో గుణపాఠం
‘సుకుమారుడు’ నిర్మాణంలో ఉన్నప్పుడే నా శ్రేయోభిలాషులు చాలామంది... ‘నీకు ప్రేమకథలే బాగుంటాయి. ఇలాంటి సినిమాలు అచ్చిరావు’ అని చెప్పారు. వాళ్లు చెప్పినట్లుగానే... ‘సుకుమారుడు’ సరిగ్గా ఆడలేదు. నిజంగా అది నాకో గుణపాఠం. నా సినీ జీవితంలో విజయాలుగా చెప్పుకునే ప్రేమకావాలి, లవ్‌లీ సినిమాలు ప్రేమకథలే. అందుకే... ‘సుకుమారుడు’ తర్వాత ప్రేమకథనే చేయాలనుకున్నాను. సరిగ్గా ఆ సమయంలోనే రవిచావలి నాకీ కథ చెప్పారు. వెంటనే అంగీకారం తెలిపా.
ముందు అలా, తర్వాత ఇలా...
ప్రేమ విఫలమైతే... హృదయం బద్దలైపోయినట్లు భావించడం, నిరాశ నిస్పహలకు లోనుకావడం... ఇందులోని నా పాత్రకు అస్సలు నచ్చదు. కానీ... తర్వాత ప్రేమ లేకపోతే... బతకలేనంత స్థాయికి వస్తా. రవి చావలి సినిమాలు ఎక్కువ శాతం సామాజిక దృక్పథంతో సాగుతాయి. కానీ ఈ సినిమాలో అలాంటివేం ఉండవ్. కేవలం ప్రేమ, వినోదం మాత్రమే ఉంటుంది. రాధామోహన్ నిజంగా సాహసవంతమైన నిర్మాత. విడుదల విషయంలో మూడ్రోజుల క్రితం నిర్ణయం తీసుకొని ధైర్యంగా విడుదల చేస్తున్నారు.
ఆరుపలకల దృఢకాయునిగా మారా
నేను ఆరు పలకల దృఢకాయునిగా మారిన మాట నిజం. అయితే... అది ‘ప్యార్ మే పడిపోయానే’ కోసం కాదు. ‘రఫ్’ సినిమా కోసం. కథ రీత్యా ఆ సినిమాకు ఆరు పలకల దేహం అవసరం. అందుకే చేశా. లొకేషన్లో నా దృఢకాయానికి మంచి స్పందన వచ్చింది. ప్రేక్షకులు కూడా మెచ్చుకుంటారనుకుంటున్నా.
నాన్నతో కలిసి నటిస్తా... కానీ!
చాలామంది ‘మీ నాన్నతో కలిసి ఎప్పుడు నటిస్తావు’ అని అడుగుతున్నారు. కలిసి నటించాలని కథ వెతుక్కోకూడదు. మేం ఇద్దరం కలిసి నటించేంత మంచి కథ కుదరాలి. అందులో నాన్న పాత్ర... ఆయన ఇమేజ్‌కి తగ్గట్టుగా శక్తిమంతంగా ఉండాలి. నా ఇమేజ్‌కి తగ్గట్టుగా నా పాత్ర కుదరాలి.
ఇవన్నీ కుదరాలంటే... సాధారణమైన విషయం కాదు. నాన్న కన్నడంలో పెద్ద స్టార్ కావడంతో నన్ను కూడా కన్నడ పరిశ్రమకు
పరిచయం చేయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. కానీ... దానికి చాలా సమయముంది. ఇప్పుడు కనుక నేను కన్నడంలో నటించాలనే నిర్ణయం తీసుకుంటే... ‘తెలుగులో నెట్టుకురాలేక కన్నడ బాట పట్టాడు’ అనే విమర్శలొస్తాయి. అందుకే... ముందు ఇంట గెలిచి, తర్వాత రచ్చ గెలుస్తా.