Quadriga motorcycle
-
బజాజ్ ‘క్యూటీ’ కమింగ్ : చిన్నకార్లకు దెబ్బే
సాక్షి, ముంబై: ఎంట్రీ లెవల్ కారుకోసం ఎదురు చూస్తున్న భారత వినియోగదారులకు శుభవార్త. వాణిజ్య అవసరాలకే వాడుతున్న క్వాడ్రిక్ సైకిళ్లను ఇకపై వ్యక్తిగత అవసరాలకు కూడా వినియోగించుకో వచ్చని నవంబరు 20న కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల సంస్థ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే కొన్ని నిబంధనలను కూడా విధించింది. ఈ నేపథ్యంలో టాటా నానో కారు తరహాలో ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తన చిన్నకారును ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెటేందుకు సిద్ధమవుతోంది. ‘క్యూటీ’ పేరుతో క్వాడ్రిక్ సైకిల్‌ను ఫిబ్రవరి 2019లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోందని సమాచారం. బజాజ్ క్యూటీ ధర సుమారు రూ.2.60లక్షల నుంచి రూ.3లక్షల వరకూ ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాదు అధిక మైలేజీని ఇవ్వడంతో పాటు, కాలుష్య ఉద్గారాలను తక్కువ వెలువరిస్తుందట. లీటరు కు 30కి.మీ. పైనే మేలేజీ, గంటకు 70కి.మీ. వేగంతో ప్రయాణించగలదని అంచనా. భారత ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం నగరాలకు ఈ క్యూటీ అనువుగా ఉండనుంది. ప్రస్తుతం క్యూటీని కేవలం వాణిజ్య అవసరాలకు మాత్రమే విక్రయిస్తున్నారు. కాగా, ఇటీవల ప్రభుత్వం వ్యక్తిగత అవకాశాలకు కూడా దీన్ని వినియోగించుకోవచ్చంటూ నిబంధనలను సడలించింది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత ప్రయాణ వాహన రంగంలో పెను మార్పు చోటు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో టాటా మోటార్స్, ఎం అండ్ ఎండ్ మరో రెండు సంవత్సరాల్లో తమ సరికొత్త వాహనాలను లాంచ్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. అలాగే మారుతి, హ్యుందాయ్ తమ వ్యూహాలను మార్చుకొని అతి తక్కువ ధరలో ఎంట్రీ లెవల్ కార్లను లాంచ్ చేస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ మాట్లాడుతూ.. పట్టణాల్లో ప్రయాణాలకు క్యూటీ చక్కగా సరిపోతుంది. ద్విచక్రవాహనంతో పోలిస్తే, భద్రత విషయంలోనూ మంచి ప్రమాణాలను పాటించాం. టూ-వీలర్‌కు ఎంతైతే నిర్వహణ ఖర్చు అవుతుందో దీనికి కూడా అదే స్థాయిలో ఉంటుంది. అంతేకాదు, అధిక మైలేజీని ఇవ్వడంతో పాటు, కాలుష్య ఉద్గారాలను సైతం తక్కువగా వెలువరిస్తుందని వెల్లవడించారు. కాగా యూరప్, లాటిన్ అమెరికా, ఆసియా దేశాల్లో క్వాడ్రిక్ సైకిల్ విక్రయిస్తున్న బజాజ్ ఆటోక్యూటీని తొలిసారి 2012లో ఆవిష్కరించింది. భద్రతా ప్రమాణాల దృష్ట్యా రోడ్డువాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి భారత్‌లో అనుమతి లభించలేదు. -
అప్పుడు.. మ్యాడ్ ఇన్ ఇండియా అవుతుంది!
కొత్త ఆవిష్కరణలకు అడ్డంకులు సృష్టిస్తే ఎలా • అయిదేళ్లుగా క్వాడ్రిసైకిల్‌కి అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం • బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ముంబై: వినూత్నంగా ఆవిష్కరించిన తమ క్వాడ్రిసైకిల్‌కు అనుమతుల కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ తాజాగా ప్రభుత్వ విధానాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఓవైపు భారత్‌లో తయారు చేయండని పిలుపునిస్తూ.. మరోవైపు నియంత్రణ ఏజెన్సీలు దేశీయంగా తయారయ్యే కొత్త ఆవిష్కరణల గొంతు నొక్కేస్తున్నాయని వ్యాఖ్యానించారు. దీనివల్ల మేడిన్ ఇండియా నినాదం కాస్తా మ్యాడ్ (పిచ్చితనం) ఇన్ ఇండియాగా మారిపోయే ప్రమాదం ఉందని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తమ కంపెనీ రూపొందించిన క్వాడ్రిసైకిల్ ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘దేశీయంగా తయారు చేసే ఏ కొత్త ఆవిష్కరణ భవితవ్యం అయినా.. ప్రభుత్వ అనుమతులపైనో.. న్యాయపరమైన ప్రక్రియలపైనో ఆధారపడి ఉంటే మేడ్ ఇన్ ఇండియా నినాదం కాస్తా.. మ్యాడ్ ఇన్ ఇండియాగా మారిపోయే ప్రమా దం ఉంది. మేం ఫోర్ వీలర్‌ను రూపొందించి అయిదేళ్లవుతోంది. దాన్ని ఇక్కడ అమ్మడానికి అనుమతుల కోసం అయిదేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నాం’ అని బజాజ్ పేర్కొన్నారు. ఇంధనం ఆదా చేసేవిగాను, సురక్షితమైనవిగాను యూరప్, ఆసియా, లాటిన్ అమెరికాల్లోని దేశాల్లో అమ్ముడవుతున్న క్వాడ్రి–సైకిల్‌ను భారత్‌లో విక్రయించడానికి మాత్రం అడ్డంకులు ఎదురవుతున్నాయన్నారు. తమ సంస్థ కార్లకు వ్యతిరేకమని బజాజ్ మరోసారి స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనాలు ప్రమాదకరమైనవనేది అపోహేనని, నిర్లక్ష్య డ్రైవింగే టూవీలర్ ప్రమాదాలకు కారణమవుతున్నదని చెప్పారు. మళ్లీ స్కూటర్ల యోచన లేదు .. కంపెనీ మళ్లీ స్కూటర్ల తయారీలోకి ప్రవేశించాలన్న సూచనలను బజాజ్ తోసిపుచ్చారు. దీనివల్ల అంతర్జాతీయంగా మోటార్‌సైకిల్ అమ్మకాల్లోని 10% వాటాను మరింతగా పెంచుకోవాలన్న తమ లక్ష్యం పక్కదారి పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘టూ వీలర్ ఏదైనా టూ వీలరే అనుకుంటారు. మోటార్ సైకిల్ తయారు చేస్తున్నప్పుడు స్కూటర్లు కూడా తయారు చేయొచ్చుగా అంటారు. ఇది.. ఎలాగూ బ్యాట్, బాల్తోనే కదా ఆడేది అలాంటప్పుడు బేస్‌బాల్ ఆడొచ్చుగా అని సచిన్ టెండూల్కర్‌కి చెప్పినట్లుగా ఉంటుంది’ అని బజాజ్ అన్నారు. మోటార్‌సైకిల్ మార్కెట్లో మరికాస్త ఎక్కువ వాటా దక్కించుకోవడానికి ప్రయత్నించడం సబబుగా ఉంటుంది కానీ.. అసలు వాటాయే లేని స్కూటర్ల మార్కెట్లో కొత్తగా ప్రవేశించడం వల్ల ప్రయోజనం ఉండదని చెప్పారు. గడువుకు ముందే ‘బీఎస్–4’ అమలు... 2017 జనవరి నుంచి తమ కంపెనీలో తయారవుతోన్న వాహనాలన్నీ బీఎస్–4 నిబంధనలకు అనువుగా ఉన్నాయని బజాజ్ తెలిపారు. బజాజ్ ఆటో పేర్కొంది. నిర్దేశిత గడువు(2017, ఏప్రిల్)కు ముందుగానే బీఎస్–4 అమలుకు సిద్ధంగా ఉన్న తొలి కంపెనీగా తాము అవతరించామని చెప్పారు.