quarry blasting
-
బ్లాస్టింగ్‌తో.. కంపిస్తున్న భూమి
సాక్షి, వనపర్తి/కొత్తకోట: గత కొన్నేళ్ల క్రితం మైనింగ్ అనుమతి పొందిన ఓ కంపెనీ.. జనావాసాలకు అతి సమీపంలో బ్లాస్టింగ్ చేస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి సమీపంలో డ్రిల్లింగ్ మిషన్‌కు బదులుగా బోరు డ్రిల్లింగ్ చేస్తుండటంతో భూమి దద్దరిల్లడంతో పాటు గ్రా మంలోని పదుల సంఖ్యలో ఇళ్లు నెర్రెలు బారాయి. ఏడాది క్రితం ఈ సమస్యపై గ్రామస్తులు ఏకతాటిపైకి వచ్చి బ్లాస్టింగ్‌ను బంద్ చేయించారు. ఇటీవల బ్లాస్టింగ్ తిరిగి ప్రారంభమవడంతో గ్రామస్తులు ఖంగుతిన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే.. మాకు అధికారుల నుంచి అనుమతి లభించిందని చెప్పుకొస్తున్నారు. ఎండుతున్న బోర్లు కంకర కొరకు రోజు బ్లాస్టింగ్ చేస్తుండటంతో సమీపంలో గల వ్యవసాయ బోర్లు పూడిపోయి నీళ్లు రాకపోవడంతో పంటలు పండించుకునే పరిస్థితి లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లాస్టింగ్ పనులు నిలిపేయాలని కోరితే.. క్వారీ యజమాని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. కలెక్టరేట్లో ఫిర్యాదు గుట్టలో అనుమతులకు మించి బ్లాస్టింగ్ చేస్తున్న తీరుపై, ఇళ్లు నెర్రెలు బారుతున్నాయని, భారీ శబ్దాలతో ఇళ్లు నెర్రెలు బారుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ రెవెన్యూ, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఫొటోలతో సహా మండల, జిల్లా స్థాయి అ«ధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా సోమవారం కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చేందుకు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టర్‌ను కలిసే అవకాశం లేకపోవడంతో కలెక్టరేట్లో బ్లాస్టింగ్ బంద్ చేయించాలని ఫిర్యాదు చేసి వెళ్లారు. అయినా అ«ధికారుల నుంచి స్పందన లేకపోవటం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే, ఎంపీ తమ గ్రామాన్ని సందర్శించి బ్లాస్టింగ్‌ను పూర్తిగా నిషేధించాలని గ్రామస్తులు కోరారు. కంపిస్తున్న భూమి సంకిరెడ్డిపల్లి సమీపంలో ‘గొట్టెతేనా’ అనే గుట్ట ఉంది. దీని నుంచి కంకర మిషన్‌కు రాయి సరఫరా కోసం అధికారులు అనుమతులిచ్చారు. ఈమేరకు బ్లాస్టింగ్‌తో చుట్టూ కిలోమీటర్ దూరం వరకు భూమి కంపించడంతో పాటు సమీపంలో గల పంట పొలాల రైతులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని జీవిస్తున్నారు. ప్రతి రోజు బ్లాస్టింగ్ చేస్తుండటంతో గ్రామంలో దాదాపు 30ఇళ్లకు పైగా పాక్షికంగా దెబ్బతిన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. బ్లాస్టింగ్ తిరిగి ప్రారంభమవడంతో నూతనంగా ఇళ్లు నిర్మించుకునేందుకు సైతం వెనకాడే పరిస్థితి నెలకొంది. పరిశీలిస్తాం సంకిరెడ్డిపల్లి సమీపంలోని క్రషర్లో బ్లాస్టింగ్ చేసేందుకు అనుమతుల విషయం మాకు తెలియదు. పాత అనుమతులు ఉన్నట్లుగా తెలుసు. మరొకసారి ఈ విషయంపై దృష్టి సారించి అనుమతుల వివరాలను తెలుసుకుంటాం. – మల్లిఖార్జున్‌రెడ్డి, సీఐ, కొత్తకోట క్వారీ అనుమతి రద్దు చేయాలి కాసులకు కక్కుర్తి పడి గ్రామ శివారులోని గుట్టపై రాళ్లు తీయడానికి అనుమతులిచ్చారు. బ్లాస్టింగ్‌తో ఇళ్ల గోడలు పగుళ్లు వస్తున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయం భయంగా జీవిస్తున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని క్వారీ అనుమతి రద్దు చేసి తమకు న్యాయం చేయాలి. – గీత, సంకిరెడ్డిపల్లి ఇంట్లో ఉండలేకపోతున్నాం ప్రతి రోజు బ్లాస్టింగ్ చేయడంతో పెద్దగా శబ్దాలు వస్తున్నాయి. ఇళ్లు పగుళ్లు ఇచ్చాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నాం. ఇంట్లో ఉండాలంటేనే భయమేస్తుంది. ఇలాగే ఉంటే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటాం. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపాలి. – భారతమ్మ, సంకిరెడ్డిపల్లి -
హమ్మ.. శ్రీనివాసా!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఏకంగా 13 మందిని బలి తీసుకున్న హత్తిబెళగల్ క్వారీ పేలుడు ఘటన నుంచి అధికార పార్టీకి చెందిన క్వారీ యజమాని తప్పించుకునేలా పథక రచన జరుగుతోందా? అసలు ఆ ఘటనతో తనకేమీ సంబంధం లేదనే రీతిలో వ్యవహారం నడుస్తోందా? పేలుడు సంభవించిన ప్రాంతంలో ఉన్న డిటోనేటర్లకు, అతనికి సంబంధం లేదంటూ మొత్తం కేసును తప్పుదోవ పట్టించేందుకు రంగం సిద్ధమైందా?.. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. పేలుడు జరిగిన ప్రాంతం తన క్వారీ పరిధిలోకి రాదనడంతో పాటు అక్కడ చనిపోయిన వారు కూడా తన వద్ద పనిచేయడం లేదంటూ విఘ్నేశ్వర క్రషర్స్ కంపెనీ యజమాని, అధికార పార్టీకి చెందిన శ్రీనివాస చౌదరి అధికారులకు వాంగ్మూలం ఇవ్వడం విస్తుగొల్పుతోంది. అక్కడున్న డిటోనేటర్లు కూడా తనవి కాదని పేర్కొనడంతో అధికారులకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. క్వారీ యజమాని అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో అతన్ని రక్షించేందుకు ఈ మొత్తం నాటకాన్ని తెరమీదకు తీసుకొచ్చారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హత్తిబెళగల్ పేలుడు ఘటనపై కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విచారణ కమిటీ నివేదిక పూర్తికాలేదని తెలిసింది. పేలుడు ఘటనలో బాధ్యులను తేల్చేందుకు అధికారులు మరింత లోతుగా జార్ఖండ్, ఒడిశాలకు వెళ్లి విచారణ చేస్తారా? లేక పైపైన పూతలు పూసి నివేదికను తుస్సుమనిపిస్తారా అన్నది చూడాల్సి ఉంది. అనేక ఆరోపణలు... హత్తిబెళగల్ గ్రామానికి ఆనుకుని ఉన్న విఘ్నేశ్వర క్రషర్స్ కంపెనీ ఆధ్వర్యంలోని క్వారీలో పేలుళ్లు చేపట్టడంపై గ్రామస్తులు మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఈ పేలుళ్ల వల్ల తమ గ్రామంలో భూకంపం వచ్చినట్టుగా భూమి కంపించడంతో పాటు ఎప్పుడు ఇళ్లు కూలుతాయోనన్న ఆందోళనతో జీవించారు. దీనిపై అనేకసార్లు అధికారులను కలిసి విన్నవించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో ఏకంగా క్వారీలోనే బైఠాయించి నిరసన కూడా తెలిపారు. అయినప్పటికీ అధికారుల అండదండలతో కనీసం అగ్నిమాపక శాఖ అనుమతి కూడా లేకుండానే పేలుళ్లు జరిపారు. ఈ క్వారీపై గ్రామస్తుల నిరసనను అధికారులు పట్టించుకోలేదు. పైగా నెలవారీ మామూళ్లు తీసుకున్నారనే ఆరోపణలు వినిపించాయి. ఈ ఏడాది ఆగస్టు 3న భారీ పేలుడు జరిగి కూలీలు చనిపోయిన తర్వాత ప్రభుత్వం స్థానిక అధికారులను బదిలీ చేసి చేతులు దులిపేసుకుంది. ఘటన జరిగి సుమారు నాలుగు నెలలు కావస్తున్న తరుణంలో మొత్తం వ్యవహారాన్ని పక్కదారి పట్టించే విధంగా క్వారీ యజమాని మాట మార్చడం అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదీ ఘటన.. ఆలూరు పట్టణానికి కూతవేటు దూరంలో హత్తిబెళగల్ వద్ద ఆగస్టు 3వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో డిటోనేటర్లు పేలి భారీ విస్పోటం సంభవించింది. ఈ దుర్ఘటనలో మొత్తం 13 మంది మృతిచెందారు. వీరంతా జార్ఖండ్, ఒడిశా రాష్ట్ర వాసులు. వీరిని ఒడిశా రాష్ట్రానికి చెందిన లేబర్ కాంట్రాక్టర్ కైలాష్ ద్వారా పనికి పిలిపించుకున్నారు. క్వారీకి సమీపంలోని ఒక షెడ్డులో ఉండేవారు. ఇక్కడే లారీలో భారీగా డిటోనేటర్లను ఉంచారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో డిటోనేటర్లు పేలాయి. అప్పుడే వండుకున్న అన్నం ముద్దలను నోట్లో పెట్టుకుంటున్న సమయంలో కూలీలు అగ్నికి ఆహుతైపోయారు. వీరంతా వేరే రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో పాటు వీరి గురించి అడిగే కుటుంబాలు కూడా లేకపోవడంతో మృతదేహాలను అప్పుడే తరలించారు. ఈ కూలీలు ఎక్కడ పనిచేస్తున్నారన్న రికార్డులను కూడా ఎవరూ నిర్వహించలేదు. అయితే, సమీప గ్రామ ప్రజలు మాత్రం వీరంతా విఘ్నేశ్వర క్వారీలోనే పనిచేస్తున్నారని సంఘటన సమయంలో పేర్కొన్నారు. అయితే, అధికార పార్టీ నేతలు మాత్రం క్వారీ యజమానిని రక్షించేందుకు ప్రస్తుతం కొత్త నాటకాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. క్వారీ యజమాని మాట మార్చిన నేపథ్యంలో అధికారులు మరింత లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ప్ర్రాణాలు తీస్తున్న క్వారీ పేలుళ్లు
-
పులిగిలిపాడు క్వారీలో ప్రమాదం
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. మండలంలోని పులిగిలిపాడు క్వారీలో అక్రమ బ్లాస్టింగ్ చేపట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ సందర్భంగా క్వారీలో కూలిపనులకు వెళ్లిన ఓ మహిళకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన మహిళను నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంతో క్వారీ వద్ద గాయపడిన మహిళ బంధువులు ఆందోళన చేపట్టారు. -
10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి: ఎమ్మెల్యే గోపిరెడ్డి
గుంటూరు : ఫిరంగిపురం కొండల్లో మైనింగ్ బ్లాస్ట్‌లో మృతి చెందినవారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫిరంగిపురం సమీపంలోని గొల్లపాలెం క్వారీలో శనివారం మధ్యాహ్నం అక్రమ బ్లాస్టింగ్ చేపట్టడంతో.. కొండ చరియలు, రాళ్లు, మట్టిపెళ్లలు మీదపడి ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు దుర్గాంజనేయులు, చిన్న బాలశౌరి, నాగేశ్వరరావు, రాయప్ప, శరవణలుగా గుర్తించారు. నర్సరావుపేట ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలను సందర్శించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి... మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు ఘటనా స్థలాన్ని పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి,క్రిస్టినా తదితరులు సందర్శించి, ఘటనపై ఆరా తీశారు. -
క్వారీలో బ్లాస్టింగ్: భారీగా ప్రాణ నష్టం
-
క్వారీలో బ్లాస్టింగ్: భారీగా ప్రాణ నష్టం
గుంటూరు: గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం సమీపంలోని గొల్లపాలెం మైనింగ్ క్వారీలో శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. అక్రమ బ్లాస్టింగ్ చేపట్టడంతో బండరాళ్లు మీదపడి బండరాళ్లు పడి ఆరుగురు కూలీలు మృతిచెందారు. మరొ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్వారీ ప్రమాద విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, రూరల్ ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అక్రమ పేలుళ్ల వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. క్వారీ ఘటనపై సీఎం దిగ్భ్రాంతి: ఫిరంగిపురం క్వారీ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. ఘటనాస్థలికి వెళ్లాలని మంత్రులు ప్రత్తిపాటి, దేవినేనిలకు సూచించారు. సీఎం ఆదేశాలతో మంత్రులు, ఎమ్మెల్యే శ్రవణ్‌కుమార్ ఘటనాస్థలికి బయల్దేరారు.