క్వారీలో బ్లాస్టింగ్: భారీగా ప్రాణ నష్టం
గుంటూరు: గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం సమీపంలోని గొల్లపాలెం మైనింగ్ క్వారీలో శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. అక్రమ బ్లాస్టింగ్ చేపట్టడంతో బండరాళ్లు మీదపడి బండరాళ్లు పడి ఆరుగురు కూలీలు మృతిచెందారు. మరొ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్వారీ ప్రమాద విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, రూరల్ ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అక్రమ పేలుళ్ల వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్వారీ ఘటనపై సీఎం దిగ్భ్రాంతి:
ఫిరంగిపురం క్వారీ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. ఘటనాస్థలికి వెళ్లాలని మంత్రులు ప్రత్తిపాటి, దేవినేనిలకు సూచించారు. సీఎం ఆదేశాలతో మంత్రులు, ఎమ్మెల్యే శ్రవణ్‌కుమార్ ఘటనాస్థలికి బయల్దేరారు.