జియో ఇంటర్ కనెక్ట్ పరిష్కారం కష్టమే- కాయ్
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో , ఇతర టెల్కోల వివాదంపై టెలికాం రెగ్యులేటర్ శుక్రవారం నిర్వహించిన సమావేశం సమస్యకు పరిష్కారం లభించకుండానే ముగిసింది. ఈ సమావేశానికి సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(కాయ్) నుంచి ఎవరినీ అనుమతించకపోవడం సరికొత్త వివాదానికి దారి తీసింది.
మొబైల్ నెట్వర్క్ ఇంటర్ కనెక్షన్ సమస్యను చర్చించేందుకు భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా సెల్యులార్, భారత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) సమావేశమైంది. గంటకుపైగా జరిగిన ఈ సమావేశానికి జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ప్రతినిధులు హాజరుకాగా సమావేశంలో పాల్గొనేందుకు కాయ్ కు సంబంధించిన ఒక్కరికీ కూడా అవకాశం కల్పించలేదు. దీంతో సెల్యులార్ ఆపరేటర్ల అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) కావాలనే నిషేధించారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో సర్వీస్ ప్రొవైడర్స్ త్వరలోనే ఇంటర్ కనెక్ట్ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. రిలయన్స్ జియోకు అందించే పాయింట్స్ ఆఫ్ ఇంటర్కనెక్ట్ (పీఓఐ) తమలో తాము చర్చించనున్నట్టు తెలుస్తోంది.కాయ్ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ మాట్లాడుతూ.. రిలయన్స్ జియో కోరిక మేరకే ట్రాయ్ ఈ సమావేశాన్ని నిర్వహించిందనీ, కాయ్ నుంచి ఎవరికీ అవకాశం కల్పించలేదని ప్రకటించారు. జియో అభిమతానికి ట్రాయ్ తలొగ్గిందని వ్యాఖ్యానించారు.
అటు కస్టమర్లకోసం, వారి న్యాయంకోసం పోరాటం తప్ప మిగిలిన టెల్కోల కస్టమర్లతో పోరాటం కాదని సమావేశం తరువాత, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ బోర్డు సభ్యుడు మహేంద్ర నహతా విలేకరులతో చెప్పారు . తాము ఎవరినీ సమావేశంనుంచి వెళ్లపొమ్మని చెప్పలేదన్నారు. ట్రాయ్ ఆహ్వానించిన వారు హాజరు కావాలని మాత్రమే తాము వాదించామన్నారు. కాల్స్ ను అనుసంధానం చేయమని మాత్రమే తాము ట్రాయ్ను కోరుతున్నామన్నారు. తమ పోరాటం దేశంలోని ప్రతీ వినియోగదారుడి కోసం అన్నారు.