అద్భుతం అంటే ఇదే....
చెన్నై: మానవత్వం మంటగలిసిపోతున్న వార్తలను చూసి ఊసూరుమంటున్న వారికి ఊరట కలిగించే వార్త ఇది. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు మనుషులు స్పందిస్తున్నారు అనడానికి ఈ తల్లీ కూతుళ్ల ఉదంతమే నిదర్శనం. అనూహ్య పరిణామాలతో ఇబ్బందుల్లో పడ్డ తల్లీకూతుళ్లను ఆదుకొని, ఒక విద్యార్థిని భవిష్యత్తుకు చెన్నైలోని టీ-వాకర్లు పునాది వేసిన వైనం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.
స్వాతి అనే విద్యార్థిని కాలేజీలో అడ్మిషన్ కోసం కౌన్సెలింగ్‌కు హాజరవ్వాలి. ఆమె తల్లితో కలిసి చెన్నైలోని అన్నా యూనివర్సిటీకి చేరుకుంది. తీరా అక్కడికొచ్చాక తను చేసిన తప్పేంటో అర్థమైంది. మార్నింగ్ వాక్ చేస్తున్న కొంతమందిని అడ్రస్ గురించి వాకబు చేసినపుడు వారికి విషయం అర్థమైంది. కోయంబత్తూరులోని అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్లాల్సిన తాము.. పొరపాటున వేరేచోటకు వచ్చామని తెలుసుకున్నారు. అప్పటికి చాలా తక్కువ సమయమే మిగిలి ఉండడంతో ఆశలు వదిలేసుకున్నారు. కానీ ఇక్కడే అద్భుతం జరిగింది.
తల్లీ కూతుళ్లు ఆశలు వదిలేసుకుని దిగాలు పడినా, ఆ వాకర్స్ మాత్రం ఈ విషయాన్ని వదిలేయలేదు. ఎలాగైనా స్వాతిని కౌన్సెలింగ్ సెంటర్‌కు చేర్చాలనుకున్నారు. తమ గ్రూపు సభ్యులను సంప్రదించారు. తలా ఇంత వేసుకుని అప్పటికప్పుడు సుమారు పదివేల రూపాయలకు పైగా పోగేశారు. ఆగమేఘాల మీద తల్లీకూతుళ్లను విమానంలో కోయంబత్తూరుకు పంపారు. ఎయిర్పో ర్ట్లో వారిని రిసీవ్ చేసుకొని యూనివర్సిటీకి చేర్చడానికి అక్కడ మరికొందరు సిద్ధంగా ఉన్నారు. అంతేనా.. యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కి జరిగిందంతా వివరించి ఆమెకు సీటును ఖాయం చేసేందుకు కృషి చేశారు. ఇదంతా విన్న ఆయన కూడా దీనికి సానుకూలంగా స్పందించారు. కానీ నిర్ణీత సమయంలో యూనివర్సిటీకి చేరుకుని, తమ సీటును ఖాయం చేసుకుంది స్వాతి.
స్వాతికి సాయం చేసిన వాకర్స్ టి-వాకర్స్ పేరుతో నడుస్తున్న గ్రూపు సభ్యులు. ఈ విషయాన్నివిషయాన్ని వారు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఇదిపుడు నెటిజన్లు బాగా ఆకర్షిస్తోంది. దీనిపై స్వాతి సంతోషంతో పొంగిపోయింది. ఇది తన జీవితంలో జరిగిన అద్భుతమని పేర్కొంది. తమకోసం వాకర్స్ గ్రూపు ఖర్చుపెట్టిన సొమ్మును తిరిగి చెల్లిస్తామని తెలిపింది. అటు స్వాతి తల్లి తంగ పొన్ను కూడా తన ఆనందాన్ని వ్యక్తంచేశారు. వాళ్లకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదన్నారు. ఏం చేసి వారి రుణం తీర్చుకోగలమని సంతోషపడ్డారు.