గీతానాదం
పుస్తక పరిచయం
సంగీతానికి రాళ్లు కరుగుతాయి అంటారు, సత్తిరాజు శంకర్‌కు మాత్రం పెన్సిల్ కరుగుతుంది. గ్రాఫైట్ రజను పుప్పొడిలా కాగితంపై ఆవరించుకుంటుంది. ఆ పొగబారు వర్ణం వెంట పెన్సిల్ రూపపు దారులు వేస్తుంది. కొన్ని గంటలు, ఒక్కోసారి రోజులు అలా ఆ పెన్సిల్ దానివెంట ఆయన వేళ్లు నాదాన్ని మీటుతూ ఉంటాయి. కాగితంపై కాగితం చేరుతూ వందల చిత్రాలు రూపుదిద్దుకుంటూ ఉంటాయి. గాల్లో తేలుతూ ఆ నాద రేఖలు విన తెలిసిన కళ్లకు చేరుతాయి. ఒకవేళ ఆ కళ్లు గుణం మూర్తీభవించినవైతే తాము పొందిన ఆనందాన్ని పదిమందికి పంచ సంకల్పిస్తాయి. ఈ కాలంలో అటువంటి కళ్లు గల్గినవారిని వరప్రసాద్‌రెడ్డి అంటారు. వారి సంకల్ప సిద్ధిని ‘నాదరేఖలు’ అంటారు.
ఆనాటి నుండి మననాటి వరకు, అన్నమయ్యవారి దగ్గరి నుండి హైదరాబాద్ సోదరులు రాఘవాచారి, శేషాచారి గార్ల దాకా, కర్ణాటక హిందుస్తానీ సంగీత కళామూర్తులు గాత్ర, తంత్రీవాద్య విశేష ప్రతిభావంతులైన 186 మంది మూర్తి చిత్రణ చిత్రకారుడు సత్తిరాజు శంకర్‌ది, వారి జీవిత విశేషాలను అనల్ప పదాలలో విశేషంగా రచించినవారు డాక్టర్ వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం. శ్రుత జ్ఞానం కల్గినవారు మాత్రమే కాదు, విహంగ వీక్షణంగా మన భారతీయ సంగీతకారుల జీవితచరిత్రలని తెలుసుకోవాలనే అభిరుచి కల్గినవారు చూడదగ్గ పుస్తకం.