raabta movie
-
మగధీర స్థాయిలో యాక్షన్ సీన్లు రావాలని..
'రాబ్తా' ట్రైలర్ చూసిన అందరికీ టాలీవుడ్ మూవీ 'మగధీర'ను బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారా అనే అనుమానాలు తలెత్తాయి. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన ఈ మూవీ అప్పట్లో టాలీవుడ్ బాక్సాఫీసు రికార్డులను షేక్ చేసింది. ప్రస్తుతం అదే తరహాలో వస్తున్న 'రాబ్తా'ను దర్శకుడు దినేష్ విజన్ తెరకెక్కిస్తున్నారు. ప్రొడ్యూసర్‌గా బద్లాపూర్, కాక్టెయిల్, ఫైండింగ్ ఫాన్నీ లాంటీ మూవీలను నిర్మించిన దినేష్ తొలిసారిగా దర్శకుడి అవతారం ఎత్తారు. యాక్షన్ మూవీ కోసం ఎదురుచూసిన సుశాంత్‌కు ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు. యాక్షన్ సీన్లు చేస్తున్న సందర్భంగా తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా మంచి స్పందన వస్తోంది. 'రాబ్తా'లో యాక్షన్ సీన్ల కోసం బ్యాంకాక్‌లో సుశాంత్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని నటుడు తన ట్వీట్టర్ ద్వారా వెల్లడించాడు. సుశాంత్ పోస్ట్ చేసిన ట్రైనింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రికెటర్‌గా ధోనీ బయోపిక్‌లో అదరగొట్టిన ఈ యువ హీరో రాబ్తాలో యాక్షన్ సన్నివేశాల కోసం కత్తియుద్ధం నేర్చుకుని తన కళను ప్రదర్శిస్తున్నాడు. ఏది ఏమైనా రాబ్తా మూవీ కోసం 'ఎంఎస్ ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరి' ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కృతి సనన్, జంటగా నటించిన ఈ మూవీ జూన్ 9న విడుదల కానుందని ఇటీవల మూవీ యూనిట్ తెలిపింది. -
నేను చాలా స్వార్థపరుడిని: హీరో
ఒక సినిమా విజయాన్ని బట్టే తర్వాతి సినిమాలో ఆ హీరోకు పారితోషికం ఎంత ఇవ్వాలి, అసలు చాన్సు ఇవ్వాలా వద్దా అనేవి కూడా నిర్ణయిస్తారు. కానీ, అసలు బాక్సాఫీసు కలెక్షన్ల గురించి గానీ, సినిమాకు అవార్డుల విషయాన్ని గానీ ఏమాత్రం పట్టించుకోని హీరోలు కూడా ఎవరైనా ఉంటారా అంటే.. ఎవరో ఎందుకు తానే ఉన్నానని చెబుతున్నాడు ధోనీ సినిమా హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. ''చివరిరోజు షూటింగ్ ముగిసిందంటే చాలు.. ఆ సినిమాతో నా పని అయిపోయినట్లే. నేను చాలా స్వార్థపరుడిని. సినిమా షూటింగ్ సమయంలో ఎలా ఉందనే విషయం మాత్రమే ఆలోచిస్తాను తప్ప బాక్సాఫీసు కలెక్షన్లు ఎలా ఉన్నాయో కూడా పట్టించుకోను'' అని కుండబద్దలు కొట్టి మరీ చెప్పాడు. సినిమాలో తన పాత్ర నచ్చి ఏమైనా అవార్డు ఇస్తానంటే బాగానే అనిపిస్తుందని, కానీ తాను మాత్రం అసలు అవార్డులు వస్తాయా రావా అన్న విషయం గురించి ఏమాత్రం ఆలోచించబోనని అన్నాడు. సినిమా సెట్టింగుకు వచ్చి, షూటింగ్ పూర్తి చేయడమే తనకు అన్నింటి కంటే ముఖ్యమన్నాడు. ఐఐఎఫ్ఏ ఓటింగ్ వీకెండ్ 2017 సందర్భంగా అతడు మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పాడు. తాజాగా కృతి సనన్‌తో కలిసి నటించిన 'రాబ్తా' సినిమా విడుదల కోసం సుశాంత్ ఎదురు చూస్తున్నాడు. దినేష్ విజన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 9న విడుదల కావాల్సి ఉంది. -
అయ్యో పాపం... గాయం!
అదో పెద్ద కోట. ఆ కోట గోడపై పరిగెత్తడం అంటే సాహసం చేయడమే. కండల వీరుల గుండెలు దడదడలాడి పోతాయ్. ఇక, గులాబీ బాల కృతీ సనన్ వంటి భామలైతే వణికిపోతారు. ఆ వణుకుతో పరిగెత్తితే జారడం ఖాయం. అదే జరిగింది. కృతీ సనన్ ఎవరో ప్రత్యేకంగా గుర్తు చేయక్కర్లేదు. మహేశ్‌బాబుతో ‘నేనొక్కడినే’, నాగచైతన్యతో ‘దోచెయ్’ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత హిందీ సినిమాలకు పరిమితమయ్యారు. ప్రస్తుతం దినేశ్ విజన్ దర్శకత్వం వహిస్తున్న ‘రాబ్తా’ చిత్రంలో సుషాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో జతకట్టారామె. ఈ చిత్రం షూటింగ్ హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరుగుతోంది. ఓ కోట గోడపై కృతి పరిగెత్తే సన్నివేశం తీయడానికి ప్లాన్ చేశారు. సీన్ విన్న కృతి భయపడినా, ‘చేయను’ అంటే బాగుండదు కదా... ఒప్పేసుకున్నారు. డెరైక్టర్ షాట్ రెడీ అనగానే, మనసులో భయాన్ని బయటికి కనిపించనివ్వకుండా గోడపై పరిగెత్తసాగారామె. హఠాత్తుగా కృతి పరుగుకి బ్రేక్ పడింది. కాలు జారిందట. అయితే గోడ పైనుంచి పూర్తిగా కిందపడకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కానీ, నొప్పితో కృతి విలవిలలాడిపోయారట. పెద్ద గాయం కాకపోయినా, కాలు బెణికినందువల్ల రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారట.