నేను చాలా స్వార్థపరుడిని: హీరో
ఒక సినిమా విజయాన్ని బట్టే తర్వాతి సినిమాలో ఆ హీరోకు పారితోషికం ఎంత ఇవ్వాలి, అసలు చాన్సు ఇవ్వాలా వద్దా అనేవి కూడా నిర్ణయిస్తారు. కానీ, అసలు బాక్సాఫీసు కలెక్షన్ల గురించి గానీ, సినిమాకు అవార్డుల విషయాన్ని గానీ ఏమాత్రం పట్టించుకోని హీరోలు కూడా ఎవరైనా ఉంటారా అంటే.. ఎవరో ఎందుకు తానే ఉన్నానని చెబుతున్నాడు ధోనీ సినిమా హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. ''చివరిరోజు షూటింగ్ ముగిసిందంటే చాలు.. ఆ సినిమాతో నా పని అయిపోయినట్లే. నేను చాలా స్వార్థపరుడిని. సినిమా షూటింగ్ సమయంలో ఎలా ఉందనే విషయం మాత్రమే ఆలోచిస్తాను తప్ప బాక్సాఫీసు కలెక్షన్లు ఎలా ఉన్నాయో కూడా పట్టించుకోను'' అని కుండబద్దలు కొట్టి మరీ చెప్పాడు.
సినిమాలో తన పాత్ర నచ్చి ఏమైనా అవార్డు ఇస్తానంటే బాగానే అనిపిస్తుందని, కానీ తాను మాత్రం అసలు అవార్డులు వస్తాయా రావా అన్న విషయం గురించి ఏమాత్రం ఆలోచించబోనని అన్నాడు. సినిమా సెట్టింగుకు వచ్చి, షూటింగ్ పూర్తి చేయడమే తనకు అన్నింటి కంటే ముఖ్యమన్నాడు. ఐఐఎఫ్ఏ ఓటింగ్ వీకెండ్ 2017 సందర్భంగా అతడు మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పాడు. తాజాగా కృతి సనన్‌తో కలిసి నటించిన 'రాబ్తా' సినిమా విడుదల కోసం సుశాంత్ ఎదురు చూస్తున్నాడు. దినేష్ విజన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 9న విడుదల కావాల్సి ఉంది.