- పాఠశాలల యూనిఫామ్‌కు చెదలు
నెల్లూరు(టౌన్): అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్‌కు చెదలు పట్టింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్‌లను అందించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జిల్లాలో 1.95 లక్షల మందికి యూనిఫామ్ అందించాలి. రాజీవ్ విద్యామిషన్ అధికారులు నిధులను సక్రమంగా వినియోగించి సకాలంలో విద్యార్థులకు యూనిఫామ్ అందించాలి. అయితే అధికారుల నిర్లక్ష్యంవల్ల యూనిఫామ్స్ సకాలంలో విద్యార్థులకు చేరడం లేదని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. వీటికి బలం చేకూర్చేలా మూలాపేటలోని బాలికల ఉన్నత పాఠశాలలోని స్టాక్ పాయింట్లో నిల్వ ఉంచిన యూనిఫామ్స్ చెదలు పట్టాయి. నెల్లూరు మండలానికి చెందిన పాఠశాలలకు పంపాల్సిన యూనిఫామ్ అక్కడ నిల్వ ఉంది.
గత సంవత్సరం ఎలా పంచారో.. ఏమో గాని పెద్ద సంఖ్యలో ఉన్న యూనిఫామ్‌లు దుమ్ము పట్టి పనికి రాకుండా పోతున్నాయి. అంతే కాక అడుగు భాగాన ఉన్న యూనిఫామ్‌కు చెదలు కూడా పట్టింది. యూనిఫామ్స్ పనికి రాకుండా పోతున్నాయంటూ ఏబీవీపీ జిల్లా నాయకులు బుధవారం స్టాక్ పాయింట్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఏబీవీపీ నేత ఈశ్వర్ మాట్లాడుతూ కలెక్టర్ జోక్యం చేసుకుని సకాలంలో యూనిఫామ్ విద్యార్థులకు చేరేలా చూడాలన్నారు. ఈ విషయమై ఎంఈవో రమేష్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా గత సంవత్సరం 500 మంది విద్యార్థులకు సంబంధించిన యూనిఫామ్ మిగిలిందన్నారు. ఈ యూనిఫామ్‌ను నాలుగురోజుల్లో అందరికీ పంచుతామని తెలిపారు. ఒక సారి ఉతికితే పై దుమ్ము పోతుందన్నారు.